Share News

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు

ABN , Publish Date - Jan 25 , 2025 | 05:01 PM

YS Sharmila: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చురకలు అంటించారు. జగన్‌ను వీసా రెడ్డి వంటి వారే వదిలేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారని వైఎస్ షర్మిల విమర్శించారు.

YS Sharmila: విజయసాయి ఇప్పటికైనా నిజాలు బయటపెట్టు.. షర్మిల చురకలు
YS Sharmila

విజయవాడ: వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) రాజకీయ సన్యాసంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) హాట్ కామెంట్స్ చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డికు ఏం చెప్పకుండా విజయసాయి రెడ్డి రాజీనామా చేయరని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విజయసాయి రెడ్డిపై షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబం, తన పిల్లల మీద ఇష్టం వచ్చినట్లుగా విజయసాయిరెడ్డి మాట్లాడారని చెప్పారు. వైసీపీని ఆయన వీడారంటే చిన్న విషయం కాదన్నారు. జగన్‌ను వీసారెడ్డి వంటి వారే వదిలి వేస్తున్నారంటే ఆలోచన చేయాలని అన్నారు. ఒక్కొక్కరుగా జగన్‌ను వదిలి బయటకు వస్తున్నారని చెప్పారు. జగన్ నాయకుడిగా ఓడిపోయాడు.. విశ్వాసనీయతను కోల్పోయారని వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు.


విజయసాయివి అన్నీ అబద్దాలే..

అందుకే జగన్ తన అనుకున్నవారంతా వైసీపీ నుంచి వెళ్లిపోతున్నారని అన్నారు. బీజేపీకి, మోదీకి జగన్ దత్త పుత్రుడు అని విమర్శించారు. ఇంతకాలం వీసారెడ్డిని బీజేపీ దగ్గర ఉంచే కేసుల విచారణ సాగకుండా జగన్ చేశారని ఆరోపించారు. ఇప్పుడు విశ్వాసనీయతను జగన్ కోల్పోయారని విమర్శలు చేశారు. విజయసాయి రెడ్డి గతంలో ఎన్నో అబద్దాలు చెప్పారన్నారు. ఇప్పడైనా అన్ని నిజాలు ఆయన బయట పెట్టాలని చెప్పారు. మాజీ మంత్రి వివేకా కేసులో కూడా జగన్ చెప్పమన్న విధంగా అబద్దాలు చెప్పారన్నారు. వీసా రెడ్డి అన్నీ నిజాలు చెబితే.. ప్రజలు ఇప్పుడైనా హర్షిస్తారని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.


సూపర్ సిక్స్ హామీల అమల్లో విఫలం

సూపర్ సిక్స్ అంటూ ఎన్నికల్లో చంద్రబాబు, కూటమి నేతలు ప్రచారం ఊదరగొట్టారన్నారు. మీ హామీలపై మీకే నమ్మకం లేకపోతే ఎలా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. అన్నదాత సుఖీభవ అన్నారని...‌ కానీ రైతులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. తల్లికి వందనం పేరుతో ఒక్కో బిడ్డకు రూ.15 వేలు అన్నారని.. కానీ రాష్ట్రంలో ఒక్క బిడ్డకైనా మీరు డబ్బులు ఇచ్చారా అని వైఎస్ షర్మిల నిలదీశారు. తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ పిల్లల ఫీజులు కట్టారని చెప్పారు. మహాశక్తి అన్నారు.. మహిళల బాధ్యత తమది అన్నారని.. కానీ నెలకు రూ.1500 కూడా ఎందుకు ఇవ్వట్లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.


నిరుద్యోగ భృతి ఏదీ..

ఏడు నెలలుగా అధికారంలో ఉన్న మీరు ఎందుకు హామీలు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఏపీలో యాభై లక్షల మంది నిరుద్యోగులు ఉంటారని అంచనా వేశామన్నారు. దేశంలోనే నిరుద్యోగంలో ఏపీ ప్రథమ స్థానంలో ఉందని చెప్పారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలి కదా అని ప్రశ్నించారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉందని షర్మిల అన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్‌ అని‌ చంద్రబాబు ప్రకటించారని గుర్తుచేశారు. ఈ హామీల అమలుపై‌ చంద్రబాబు ప్రజలకు ఏం చెబుతారని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌కు అసలు దిక్కు లేదన్నారు. జగన్ జమానాలో చేసిన మోసాలను సరి చేస్తామని చెప్పిన చంద్రబాబు కూడా పేదలను మోసం చేశారని ఆరోపించారు. చంద్రబాబు సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్ అని తాము అంటున్నామన్నారు. ప్రజల కోసం చేసే‌ కార్యక్రమాలను మీడియా కవర్ ‌చేయాలని వైఎస్ షర్మిల అన్నారు.


Also Read:

విజయసాయి రాజకీయ సన్యాసంపై చంద్రబాబు ఏమన్నారంటే

వివేకానందరెడ్డికి గుండెపోటని ఎందుకు చెప్పానంటే

కూటమి కోసం రాజీనామా.. అసలు విషయం బయటపెట్టిన..

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jan 25 , 2025 | 05:21 PM

News Hub