Share News

BANDI SANJAY : దేశంలో చక్రం తిప్పుతానని ఎక్కడ ఉన్నావ్ కేసీఆర్.. బండి సంజయ్ మాస్ సెటైర్లు

ABN , Publish Date - Jan 05 , 2025 | 07:38 PM

BANDI SANJAY: రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా టైం పాస్ చేసి మోసం చేసిందో అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటనలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు.

BANDI SANJAY : దేశంలో చక్రం తిప్పుతానని ఎక్కడ ఉన్నావ్ కేసీఆర్.. బండి సంజయ్ మాస్ సెటైర్లు
BANDI SANJAY

హైదరాబాద్: రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్ట్‌లు బాగుపడితేనే దేశం అభివృద్ధి చెందుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి బండి సంజయ్ తెలిపారు. అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ రంగంలో అభివృద్ధి సాధించిందని అన్నారు అందుకే భారతదేశాన్ని కూడా అగ్ర రాజ్యంగా మార్చాలనే లక్ష్యంతోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఇవాళ(ఆదివారం) హైదరాబాద్‌లోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ... కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు విడుదల చేశారని ప్రకటించారు. గ్రామాల నుంచి నగరానికి, రాజధాని వరకు రోడ్డు నిర్మాణం చేస్తున్నారని తెలిపారు.పదేళ్లలో తెలంగాణకు రూ.32వేల కోట్లు రైల్వే కోసం విడుదల చేశారని గుర్తుచేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.720కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రూ.350కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రేపు(సోమవారం) వర్చువల్‌గా రైల్వే టెర్మినల్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని చెప్పారు. గూడ్స్ రైళ్లు ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తాయని వివరించారు. 25 రైళ్ల రాకపోకలు కూడా రేపటి నుంచి ప్రారంభం కానున్నాయని అన్నారు.


కాంగ్రెస్ టైం పాస్ చేస్తోంది..

ఎన్డీఏ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు మాటలతో మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. ఏడాదిగా కాంగ్రెస్ టైం పాస్ చేసిందని విమర్శించారు. ఫాం హౌస్, డ్రగ్స్, ఫార్ములా ఈ రేసింగ్ కేసు అంటూ టైం పాస్ చేస్తున్నారని మండిపడ్డారు. పాలన ఎలా చేయాలనే దానిపై కాకుండా మోసంతో రెండోసారి ఎలా గెలవాలో ప్లాన్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకల్ బాడీ ఎన్నికలు రావడంతోనే సీఎం ఈ ప్రకటనలు చేస్తున్నారని చెప్పారు. 15వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎలా టైం పాస్ చేసి మోసం చేసిందో అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రకటనలతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. తమను గెలిపిస్తే రైతు భరోసా రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారన్నారు. ఈ ప్రకటనతో రైతులు అందరూ కాంగ్రెస్‌కు ఓటేశారని చెప్పారు. రూ.15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రూ.12వేలు ఇస్తామని ఎలా చెబుతుందని ప్రశ్నించారు. ఇప్పటి వరకు రూ.18వేలు రైతుల అకౌంట్లో వేయాలని డిమాండ్ చేశారు. ఎప్పటి వరకు వేస్తారో చెప్పాలని నిలదీశారు. రూ. 12600కోట్లు రైతులకు రైతు భరోసా కింద ఇవ్వాలని కోరారు.


రైతు బోనస్ 25శాతం అందలేదు..

రైతు బోనస్ కూడా 25శాతం రైతులకు అందలేదని చెప్పారు. నిరుద్యోగ యువతకు 40 లక్షల మందికి రూ.48వేలు బకాయి పడ్డారన్నారు. రూ.19,200 కోట్లు ఖర్చు అవుతుంది.. ఎప్పుడు ఇస్తారు.. ఎలా ఇస్తారో చెప్పాలని అడిగారు. జనవరి 26వ తేదీ లోపు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని అన్నారు. మహిళలకు ఇస్తానన్న రూ.2,500లు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి అంటే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. ఎక్కడ నుంచి తెస్తారో స్పష్టం చేయాలన్నారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆరోపించారు. ఇప్పటికే రూ.70వేల కోట్లు అప్పు చేశారని అన్నారు. బడ్జెట్‌లో చెప్పిన దానికంటే ఎక్కువ అప్పు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రూ. 6లక్షల కోట్లు అప్పు చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రూ. 6 లక్షల కోట్ల అప్పు చేస్తుందని ఆరోపించారు. తెలంగాణను శ్రీలంకలాగా మార్చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 30వేల కోట్ల రూపాయలు అప్పు కావాలని ఆర్బీఐ వద్దకు రేవంత్ ప్రభుత్వం వెళ్లింది నిజం కాదా అని బండి సంజయ్ ప్రశ్నించారు.

bandi-sanjay.jpg


భూములు తాకట్టు పెడుతున్నారు..

‘‘భూములు తాకట్టు పెట్టి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది. రైతు భరోసా పూర్తిగా ఒక బోనస్. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఇక రైతు భరోసా వేయరు. కాంగ్రెస్‌కు రైతు ఓటేసే ప్రసక్తే లేదు.. మిగతా వారు వద్దనుకుని వదిలేస్తుంది కాంగ్రెస్ పార్టీ. మిగతా వర్గాల ప్రజలు కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రసక్తే లేదని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే భస్మాసుర హస్తం. అధినాయకత్వానికి నెలనెలా ఢిల్లీ వెళ్లి కప్పం కడుతున్నారు. కొందరు మంత్రులు 14శాతం కమీషన్ వసూలు చేస్తున్నారు. రేయిన్ బో ఆస్పత్రిలో దోపిడీ సాగుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులు దోపిడీ చేస్తున్నాయి. గతంలో బీర్ఎస్ పార్టీని గెలిపించారు అని కాంగ్రెస్ నేతలు కూడా తమను గెలిపిస్తారని అనుకుంటున్నారు’’ అని బండి సంజయ్ మండిపడ్డారు.


కేసీఆర్ విశ్వాసఘాతకుడు..

‘‘గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులతోనే. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. బీఆర్ఎస్ పార్టీ ‘‘న ఘర్ కా నా ఘాట్కా’’ అన్నట్టు తయారైంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అత్యధిక స్థానాలు బీజేపీ గెలుస్తుంది. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చనిపోతే కనీసం సంతాపం తెలియజేయని మూర్ఖుడు కేసీఆర్. కేసీఆర్ అంటేనే విశ్వాసఘాతకుడు. బీఆర్ఎస్‌లో కుటుంబానికి మినహా మిగతా వారికి ఎందుకు పదవులు ఇవ్వడం లేదు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా కేసీఆర్ బయటకు రాకపోతే ఎలా. ఎన్నికలు వచ్చిన వెంటనే ఆయన బయటకు వస్తే ప్రజలు ఓటేస్తారా..?? బీఆర్ఎస్ పార్టీ ఇక అధికారంలోకి రాదు.. ప్రజలు ఓటేయరు. రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకానికి, ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారో చెబుతారా..?? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులపై చర్చకు, లెక్కలు ఇచ్చేందుకు మేం సిద్ధం. ఇదే అంశంపై స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లేందుకు రేవంత్ ప్రభుత్వం సిద్ధమా.?? దేశంలో చక్రం తిప్పుతా అన్నాడు కేసీఆర్.. ఏం చేసిండు.?? కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఔట్ డేటెడ్ పార్టీ. కేసీఆర్ బీఆర్ఎస్‌లో ఏమైనా ఎక్స్ట్రా ప్లేయరా...?? కాంగ్రెస్ పార్టీ హామీలను నెరవేర్చకపోతే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పినట్లే.. తెలంగాణలో కూడా గుణపాఠం చెబుతారు’’ అని బండి సంజయ్ హెచ్చరించారు.

Updated Date - Jan 05 , 2025 | 07:58 PM