Mallikarjun Kharge: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేలా వారిద్దరి కుయుక్తులు
ABN , Publish Date - Jan 25 , 2024 | 05:38 PM
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) ఇచ్చిన అన్ని హామీలపై ప్రశ్నిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. గతంలో మోదీ గ్యారంటీ అని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు.. మరి రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ ఏమైంది. నల్లధనం వెనక్కు తెప్పిస్తాం అన్నాడు ఏమైందని ప్రశ్నించారు.
హైదరాబాద్: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ( PM Modi ) ఇచ్చిన అన్ని హామీలపై ప్రశ్నిస్తామని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) వ్యాఖ్యానించారు. గతంలో మోదీ గ్యారంటీ అని పత్రికలలో ప్రకటనలు ఇచ్చారు.. మరి రెండు కోట్ల ఉద్యోగాల గ్యారంటీ ఏమైంది... నల్లధనం వెనక్కు తెప్పిస్తాం అన్నాడు ఏమైందని ప్రశ్నించారు. దేశంలో ఏ ఒక్కరికీ పనులు లేకుండా మోదీ చేశారని ధ్వజమెత్తారు. పని లేకపోతే ప్రజలకు ఉపాధి ఎలా..? వారి కడుపు ఎలా నిండుతది అని ప్రశ్నించారు. మోదీ ప్రజాస్వామ్యాన్ని బలపరుస్తున్నాం అంటూ బలహీన పరుస్తున్నాడని మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు.
వారిని అయోధ్యకు ఎందుకు రానివ్వలేదు
పార్లమెంట్‌లో సమస్యలపై మాట్లాడితే ఎంపీలను సస్పెండ్ చేస్తారని మండిపడ్డారు. గురువారం నాడు ఎల్బీ స్టేడియంలో టీపీసీసీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ... మొన్న పార్లమెంట్‌లో 146 ఎంపీలను సస్పెండ్ చేశారన్నారు. మోదీ పదేళ్లుగా అన్ని సంస్థలను నాశనం చేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ కుట్రలను బహిర్గతం చేయాలన్నారు. మొన్న మోదీ అయోధ్యలో ఒక్కరే గర్భ గుడిలో పూజలు చేశారని.. అద్వానీ, మనోహర్ జోషిలను ఎందుకు లోపలికి రానివ్వలేదని ప్రశ్నించారు. దేశంలో దేవుడు ప్రతి ఇంట్లో ఉన్నాడు.. కానీ దేవుడు తమ దగ్గరే ఉన్నట్టు మోదీ ప్రచారం చేసుకుంటున్నాడని దుయ్యట్టారు. ఆకలి అయినవాడికి అన్నం పెట్టాలని.. ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇవ్వాలని.. కానీ మోదీ ఎన్నికల రాజకీయాలు, ప్రచారంతోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో మోదీ ప్రచారం చేసుకుంటున్నాడని మల్లికార్జున్ ఖర్గే ధ్వజమెత్తారు.
ఆ హామీలను కచ్చితంగా అమల్లోకి తేస్తాం
రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని.. బూత్ ఏజెంట్లు అత్యంత కీలకంగా పనిచేయాలని సలహాలు ఇచ్చారు. వారు చేసిన కృషి ఫలితంగా రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో అధికారంలోకి వచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలను ఇచ్చామని.. అప్పుడే రెండు గ్యారంటీలు అమలు చేశామని తెలిపారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం అన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. దేశంలో యువత ఉందని.. వారికి ఉపాధి లేదన్నారు. రాహుల్ మణిపూర్ నుంచి భారత్ న్యాయ యాత్ర ప్రారంభించారని.. దిగ్విజయంగా సాగిస్తున్నారని తెలిపారు. ప్రజలంతా బాగుండాలని రాహుల్ యాత్ర చేస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ యువత, మహిళ, దళిత, గిరిజన ప్రజల కోసం కష్ట పడుతున్నారని వివరించారు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ క్యాడర్ కష్టపడి, రాహుల్ గాంధీ కృషి వల్ల రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ మీరంతా కష్టపడి ఎలాంటి ఫలితాలు తెచ్చారో దేశంలో కూడా అలాంటి ఫలితాలను తేవాలని ఆకాక్షించారు. ఇక్కడ ప్రభుత్వ పనితీరు, రేవంత్ రెడ్డి పనితీరు ఆదర్శంగా ఉందని అభినందించారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడ ప్రభుత్వాలు పడగొట్టేందుకు కుయుక్తులు పన్నుతారని మల్లికార్జున్ ఖర్గే హెచ్చరించారు.
రేవంత్ జాగ్రత్త..
తెలంగాణలో గతంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు లేదని.. చాలా పటిష్టమైన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మోదీ, షాలు ఈడీ, సీబీఐ, ఐటీలను ఉపయోగించి దాడులు చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ నాయకులంతా చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోందని.. కానీ బీజేపీకి తెలంగాణలో ఎవరు భయపడరని చెప్పారు. కేసీఆర్ బీజేపీపై ఎప్పుడు ఆరోపణలు చేయలేదని.. ఆయన బీజేపీకే మద్దతిస్తారని.. బీజేపీ, బీఆర్ఎస్‌లను కాంగ్రెస్ రాష్ట్రంలో ఓడించిందని.. లోక్‌సభ ఎన్నికల్లో వారిని ఓడిస్తామని తేల్చిచెప్పారు. ఇక్కడ కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. క్యాడర్ లోక్‌సభ ఎన్నికల్లో కష్టపడి పనిచేస్తే విజయం సాధిస్తామని చెప్పారు. నెహ్రు ఒకసారి ఇలా అన్నారని ‘‘మనం ప్రజల మధ్య ఉంటే గెలుస్తాం... లేకపోతే ఓడిపోతాం’’ అని చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. క్యాడర్ గ్రామ, బూత్ స్థాయిలో పని చేయాలని సూచించారు. మీ శక్తి అంత గ్రామ, బూత్ స్థాయిలో పని చేసి రాబోయే పార్లమెంట్, తదితర ఎన్నికల్లో శక్తి వంచన లేకుండా పని చేసి విజయం సాధించాలని మల్లికార్జున్ ఖర్గే పిలుపునిచ్చారు.