Share News

Pawan Kalyan: నిజానికి నిప్పు పెట్టిందెవరు?

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:17 AM

రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే.

  Pawan Kalyan: నిజానికి నిప్పు పెట్టిందెవరు?

  • పీసీబీ ఫైళ్ల దహనం కేసులో అదుపులో ముగ్గురు

  • మచిలీపట్నం తరలింపు.. వాంగ్మూలాలు నమోదు

  • ద్వారంపూడి ఫ్యాక్టరీపై విచారణ చేస్తామన్న పవన్‌

  • ప్రకటన వచ్చిన గంటల్లోనే ఘటన

  • దీనిపైనా దృష్టి సారించిన ప్రత్యేక బృందం

  • ఫైళ్ల దహనం కేసులో విచారణ వేగవంతం

  • పోలీసుల అదుపులో ముగ్గురు.. మచిలీపట్నం తరలింపు

అమరావతి(ఆంధ్రజ్యోతి), మచిలీపట్నం, జూలై 4: రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ) ఫైళ్ల్ల దహనం కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఫైళ్లను కృష్ణా జిల్లా యనమలకుదురు-పెదపులిపాక గ్రామాల మధ్య కృష్ణా కరకట్టపై బుధవారం రాత్రి సంబంధిత శాఖ సిబ్బంది తగలబెట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పీసీబీ కార్యాలయం ఓఎ్‌సడీ రామారావు, కారు డ్రైవర్‌ నాగరాజు, అటెండర్‌ ఒకరిని గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణకు ప్రత్యేకంగా నియమించిన పోలీసు అధికారులు మచిలీపట్నంలో వారి నుంచి వాంగ్మూలం నమోదు చేశారు.

తగలబెట్టిన ఫైళ్లు ఏ రకానికి చెందినవి? కీలక పత్రాలా? కాదా? ఎవరు తగలబెట్టమని సూచించారు? తదితర అంశాలపై వారిని ప్రశ్నించినట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వారు చెప్పిన వివరాలను, సంఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న పత్రాలను సంబంధిత విభాగం నిపుణులతో పరిశీలన చేయించి తుది నివేదికను ప్రభుత్వానికి పంపుతామని పోలీస్‌ అధికారులు తెలిపారు. బుధవారం రాత్రి కరకట్టపై మంటలను ఆర్పి స్వాధీనం చేసుకున్న పత్రాలను పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌, స్థానికులు పోలీసులకు అప్పగించారు. వీటిపై వైసీపీ ప్రభుత్వంలో గనుల మంత్రిగా పనిచేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పేర్లు, ఫొటోలు ఉన్నాయి. ఈ అంశంపైనా పోలీసులు విచారణ చేస్తున్నారు.


ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, కాకినాడ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి చెందిన రొయ్యల ఫ్యాక్టరీకి ఇచ్చిన అనుమతులు, ఆ కంపెనీ ద్వారా వెదజల్లుతున్న కాలుష్యంపై విచారణ చేయిస్తామని ప్రకటించిన కొద్ది గంటల వ్యవధిలోనేపీసీబీ కార్యాలయంలోని కీలక ఫైళ్లు దహనం చేసే ప్రయత్న జరగడంతో ఇందులో ఏదో మతలబు దాగి ఉందని అనుమనించి ఆదిశగానూ పోలీసులు విచారణ చేస్తున్నట్టు సమాచారం.

ఫైళ్ల దహనంపై డిప్యూటీ సీఎం ఆరా

పీసీబీలో ఫైళ్లు, నివేదికలు దహనం చేయడంపై ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ఆరా తీశారు. ఘటన వెనుక ఎవరెవరున్నారని అధికారులను ప్రశ్నించారు. పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక ఇవ్వాలని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పీసీబీ కార్యాలయాల్లో ఫైళ్లు ఏ మేరకు భద్రంగా ఉన్నాయి? ఫైళ్ల భద్రతకు అనుసరిస్తున్న విధానాలేమిటి? వంటి వివరాలను తెలియజేయాలన్నారు.

ఫైళ్ల దహనం ఘటనలో బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో గురువారం తెలిపారు. ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ చేయాలని ప్రభుత్వం పోలీసులను ఆదేశించిందన్నారు.

Updated Date - Jul 05 , 2024 | 02:17 AM