Bhatti Vikramarka: కేసీఆర్ ప్రభుత్వ డిజైన్ లోపం వల్లే సుంకిశాల కూలింది
ABN , Publish Date - Aug 08 , 2024 | 05:14 PM
జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు.
హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Mallu Bhatti Vikramarka) అదేశించారు. వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అధికారులను అప్రమత్తం చేశామని తెలిపారు. గురువారం నాడు సచివాలయంలో మంత్రి భట్టివిక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై సంబంధింత అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అంతర్జాతీయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ సరఫరాపై దిశానిర్దేశం చేశారు. ఎస్పీడీసీఎల్‌లో అంతర్గత బదిలీలు, ప్రమోషన్లపై కూడా ఆదేశాలు జారీ చేశామని అన్నారు. విద్యుత్ సరఫరాకు ఏదైనా ఇబ్బంది అయితే 1912 టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల కోసమే నిరంతరం ఎస్పీడీసీఎల్ పనిచేస్తోందని మర్చిపోవద్దని అన్నారు. సుంకిశాలపై వార్తల్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. మేడిగడ్డ గోదావరి నదిపై మాత్రమే కాదని, కృష్ణానదిని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టలేదని చెప్పారు. సుంకిశాలను బీఆర్ఎస్ నిర్మించిందని చెప్పారు.
డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలిందని...దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సుంకిశాల కట్టింది తాము కాదని గత ప్రభుత్వం కట్టిందేనని స్పష్టం చేశారు. గోదావరి మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం కేసీఆర్ ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పారు. 2021లో మొదలు 2023 జూలైలో సుంకిశాలను బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ పాపాలను తమపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. పాపాలను భరించలేక ఇప్పటికే ప్రజలు కేసీఆర్ ప్రభుత్వనికి బుద్ధి చెప్పారని మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.