Mahipal Reddy: అందుకే ED సోదాలు చేశారు.. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Jun 20 , 2024 | 09:04 PM
హైదరాబాద్‌లోని నిజాంపేటలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Goodem Mahipal Reddy) నివాసాల్లో ఈడీ అధికారులు ఈరోజు(గురువారం) సోదాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో వీరిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
సంగారెడ్డి జిల్లా: హైదరాబాద్‌లోని నిజాంపేటలో పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి (MLA Goodem Mahipal Reddy) నివాసాల్లో ఈడీ అధికారులు ఈరోజు(గురువారం) సోదాలు చేసిన విషయం తెలిసిందే. గతంలో లక్డారం గనుల వ్యవహారంలో వీరిపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసు ఆధారంగానే ఈడీ అధికారులు సోదాలు చేశారు. మహిపాల్ రెడ్డి ఇంట్లో జరుగుతున్న ఈడీ సోదాల్లో విచారణలో భాగంగా ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డిని ఇంటి నుంచి వెంట పెట్టుకొని ఈడీ అధికారులు తీసుకెళ్లారు. ఇంట్లో ఈడీ సోదాలపై మహిపాల్ రెడ్డి స్పందించారు.
ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి జరిగిన ఈడీ సోదాలన్నీ రాజకీయ కుట్రతోనే చేశారని ధ్వజమెత్తారు. సోదాలు చేసిన అధికారులకు పూర్తి సహకారం అందించినట్లు తెలిపారు. తమ నివాసాల్లో అక్రమంగా సంపాదించిన సొమ్ము ఏం దొరకలేదని స్పష్టం చేశారు. పనికి రాని జీరాక్స్ పేపర్లు తప్ప ఏం దొరకలేదని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రతో రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ముఖ్య మంత్రి స్థాయి వారిపై కూడా ఈడీ దాడులు చేస్తుందన్నారు. అదే విధంగా తనను ఇబ్బంది పెట్టేందుకే సోదాలు జరిగాయని వివరించారు. తన వద్ద ఉన్న చెప్పులు కొన్న బిల్లును కూడా అధికారులకు ఇచ్చానని తెలిపారు నివాసాల్లో సామాన్యంగా మహిళలు ధరించే బంగారం తప్ప ఇంట్లో ఎలాంటివి అధికారులకు దొరకలేదని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు.