Jaggareddy: కేంద్రమంత్రులకు పౌరుషం ఉందా.. జగ్గారెడ్డి సవాల్
ABN , Publish Date - Aug 06 , 2024 | 06:49 PM
కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు, పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హయాంలో అసెంబ్లీ హుందాగా నడుస్తుందని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అన్నారు. మూసీ ప్రక్షాళన అవినీతి కోసమని బీజేపీ నేతలు అంటున్నారని.. మరి గంగా ప్రక్షాళన కూడా మోదీ అందుకే చేస్తున్నారా? అని ప్రశ్నించారు. బీజేపీ నేతలు కోతల రాయుళ్లు అని విమర్శించారు. కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు.
మంచి పనులను మెచ్చుకోరు..
సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్ బాబులు తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకే అమెరికా వెళ్లారని స్పష్టం చేశారు. గత పదేళ్లలో రుణమాఫీపై చర్చించలేదన్నారు. మంత్రి మల్లు భట్టి విక్రమార్క రుణమాఫీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి అమలు పరిచేలా చేశారని చెప్పారు. 8 నెలల కాంగ్రెస్ పాలనలో రూ.2 లక్షల రుణమాఫీ కాలేదా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ కంటే ప్రతిపక్ష సభ్యులు మాట్లాడిందే ఎక్కువ అని చెప్పారు. మంచి పనులను మెచ్చుకోరని. కానీ నిందలు వేయొద్దని హితవు పలికారు. అబద్ధాలకు తల్లిగారిల్లు.. అత్తగారిల్లు కేరాఫ్ కేసీఆర్‌దేనని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ లాంటి సీనియర్ మంత్రుల నాయకత్వంలో రైతు రుణమాఫీ అయ్యిందని చెప్పారు.
రేవంత్ హయాంలో హుందాగా అసెంబ్లీ..
‘‘మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు కదా? గత పదేళ్లలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి. రేవంత్ సీఎం అయ్యాకా ఎలా నడుస్తున్నాయో చూడండి. గతంలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. కోమటిరెడ్డి, సంపత్‌లను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. 8 నెలల్లో మూడు సార్లు, నెల రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నడిచాయి. అసెంబ్లీ సమావేశాలు రేవంత్ హయాంలో హుందాగా నడిచాయి. మాజీ సీఎం కేసీఆర్ సభకు ఒక్కసారే వచ్చారు. మాజీ మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌లు అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం సభలో మాట్లాడారు. ఇంత ప్రజాస్వామ్య బద్ధంగా ఉన్నా నిందలు వేస్తున్నారు. నిందలు వేయడం తప్పా, బీఆర్ఎస్ పార్టీకి ఏం తెలియదు. బీజేపీ నేతలు కూడా మాటలు మాట్లాడటమే తప్పా చేతలు లేవు. మూసీని సుందరీకరణ చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు.
గంగా నది ప్రక్షాళన అందుకోసమేనా...?
‘‘మూసీ ప్రక్షాళన డబ్బుల కోసమే అంటున్నారు. బీజేపీ నేతలు పనులు చేస్తే డబ్బుల కోసం అంటారు. చేయకపోతే చేయడం లేదు అంటారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ స్పష్టత ఉందా? లేదా..? మూసీ ప్రక్షాళన చేయొద్దు అని తీర్మానం చేసి చెప్పండి మరి. అంతే కానీ ప్రభుత్వంపై అభాండాలు వేయొద్దు. గంగా ప్రక్షాళనను అవినీతి కోసం చేస్తున్నారా మోదీ..? గంగా నది ప్రక్షాళన అవినీతి కోసమే అని మా రాహుల్ గాంధీ కానీ, కాంగ్రెస్ కానీ ఆరోపణ చేశారా..? గంగా ప్రక్షాళన కూడా మోదీ అవినీతి కోసమే చేశారు అని ఒప్పుకోండి..? సెక్రటేరియట్ అంతా కళకళలాడుతుంది. సెక్రటేరియట్‌లో అసలు పార్కింగ్‌కి జాగా సరిపోవడం లేదు. నేను ఎమ్మెల్యేగా లేను. కానీ గతంలో తన దృష్టికి వచ్చిన సమస్యలు మంత్రులకు చెబితే రెస్పాండ్ అయ్యి చేస్తున్నారు. సమస్యలు వినే వారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉంటారు. ముచ్చర్లలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. దాని గురించి ఎందుకు మాట్లాడరు..? సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌బాబులు అమెరికా నుంచి పెట్టుబడులు తెచ్చేందుకు వెళ్లారు’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.