Varla Ramaiah: జగన్ రెడ్డి నోరు అబద్దాల పుట్ట.. వర్లరామయ్య వ్యంగ్యాస్త్రాలు
ABN , Publish Date - Jul 05 , 2024 | 04:16 PM
మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (Jagan Reddy) నోరు తెరిస్తే అబద్దాల పుట్ట అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య (Varla Ramaiah) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు.
అమరావతి: మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ రెడ్డి (Jagan Reddy) నోరు తెరిస్తే అబద్దాల పుట్ట అని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య (Varla Ramaiah) వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. మనీలాండరింగ్ కేసులో రూ. 40 వేల కోట్లు కొల్లగొట్టిన జగన్‌పై 11కు పైగా ఛార్జ్ షీట్లు ఉన్నాయని.. మొన్నటివరకు ఆయన ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరమని అన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంచివాడు అయిపోతాడా ? అని ప్రశ్నించారు.
ఒక రిమాండ్ ఖైదీ(పిన్నెల్లి)ని... ఎన్నో కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదురుక్కొంటున్న మరో ముద్దాయి జగన్ రెడ్డి నెల్లూరు జైల్లో మిలాఖత్ అయ్యారని సెటైర్లు గుప్పించారు. ఇద్దరు ముద్దాయిలు కలిసి జైల్లో దాదాపు 22 నిమిషాలు యోగక్షేమాలు మాట్లాడుకున్నారని విమర్శించారు. జగన్ రెడ్డికి తాను చేసిన నేరం ఈవీఎం బాక్స్ ధ్వంసం చేయడం గురించి పిన్నెల్లి చెప్పారా అని ఎద్దేవా చేశారు. జగన్ రెడ్డి ముందు పిన్నెల్లి నేరం ఒప్పుకున్నారని, కోర్టులో కాకుండా బయట నేరం ఒప్పుకుంటే ఎగస్ట్రా జ్యూడిషియల్ కన్ఫెషన్ అవుతుందని చెప్పారు.
జగన్‌ను విచారించాలి
‘‘దొంగలు, దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు, ఎన్నోకేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తుంటారు.. అంతమాత్రాన మంచోళ్లు అవుతారా..? గెలిచాడు కాబట్టి మంచివారని అనడానికి వీల్లేదు. పిన్నెల్లి ఘోరాతిఘోరమైన సంఘవిద్రోహక శక్తి, ప్రజా కంఠకుడు. పిన్నెల్లిని మంచివాడు అనడం చూస్తే జగన్ రెడ్డి ఎంత అవగాహన రాహిత్యుడో తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు జగన్‌ను కూడా విచారణ చేయాలి. వారిద్దరూ జైల్లో ఏం మాట్లాడారో పోలీసులు బయట పెట్టించాలి. కోర్టు బెయిల్ ఇస్తే నేరం చేయనట్లు కాదు జగన్ రెడ్డి. టీడీపీ నేతలు బుద్దా వెంకన్న, బోండా ఉమాలపై దాడి చేయించింది ఈ పిన్నెల్లి కాదా..?. అదృష్టం బాగుండి వారు బతికి బయట పడ్డారు. సీఐని చంపేస్తానని బెదిరించి అసభ్యంగా తిట్టిన వ్యక్తి జగన్ రెడ్డికి మంచివాడంట. ఒక దళితుడు టీడీపీ తరఫున సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ ఏజెంట్‌గా కూర్చుంటే అతని ఇంటికి వెళ్లి భార్య, బిడ్డలను కొట్టిన వ్యక్తులు మంచివారా జగన్ రెడ్డి..? అక్కడ ఉన్న డీఎస్పీ పిన్నెల్లి తమ్ముడి అరాచకానికి భయపడి టీడీపీ నేత మాణిక్యరావును దొంగదారిలో పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తే పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి చేయలేదా....? వాళ్లు ఎలా మంచివాళ్లు జగన్ ..? పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే... నరకాసుర వధ జరిగినట్లు మాచర్లలో పండుగ చేసుకున్నారు. ఏ కోణంలో పిన్నెల్లి జగన్‌కు మంచివాడుగా కనిపించాడు’’ అని ప్రశ్నించారు.
పిన్నెల్లి అరాచకం వెనుక జగన్‌రెడ్డి..
‘‘పిన్నెల్లి అరాచకాలు చేసిన సమయంలో పోలీస్టేషన్ దగ్గరకు నువ్వు ఎందుకు రాలేదు.. ? జగన్ రెడ్డి నోరు తెరిస్తే అబద్దాలపుట్ట.. ఆ అబద్దాల్లో ఇదోకటి. పిన్నెల్లి చేసిన ప్రతి నేరం, అరాచకం వెనుక జగన్ రెడ్డి అభయహస్తం ఉంది. జగన్ రెడ్డి అభయంతోనే మాచర్లలో ఒక భయానక వాతావరణం పిన్నెల్లి సృష్టించాడు. పిన్నెల్లి అరాచకాలపై విచారణ చేస్తున్న పోలీసులు మాణిక్యరావుపై చేసిన దాడికి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలి. బుద్దా వెంకన్న, బొండా ఉమాలపై దాడి మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. ఈ కేసులను కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. నీతి నిజాయతీ కలిగిన అధికారితో పల్నాడు ఎస్పీ దర్యాప్తు చేయించాలి. పిన్నెల్లి మంచివాడని చెబుతుంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు, నోరు మెదపరు..? ఇంత అరాచకం చేసిన పిన్నెల్లిని చిన్నవాడు అంటున్న జగన్ రెడ్డిని ఏమనాలో అర్థం కావట్లేదు..? ఘోరమైన సంఘ విద్రోహక శక్తిని మంచివాడని చెప్పడం జగన్ రెడ్డి చేసిన తప్పు..? ఇంకా ఏ2 పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు..? విచారణ చేసి ఎన్ని నేరాలు చేశారో తేల్చాలి..? అందరి స్టేట్మెంట్ రికార్డు చేసి నిజాలు బయట పెట్టాలి. జగన్ రెడ్డి స్టేట్మెంట్ అబద్ధం. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక విద్రోహక శక్తిని మంచివాడు అని చెప్పడం సిగ్గుచేటు’’ అని వర్లరామయ్య తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
TTD: తిరుమల అన్న ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం
TDP MP: ప్రత్యేకత చాటుకున్న ఎంపీ కలిశెట్టి
Read Latest AP News And Telugu News