మస్క్‌కు షాక్.. భారతీయ విద్యార్థి కేసుతో..
ABN , First Publish Date - 2021-01-30T17:26:54+05:30 IST
ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను ఓ భారతీయ అమెరికన్ విద్యార్థి న్యాయస్థానంలో నిలువరించాడు.
పరువు నష్టం దావా: న్యాయస్థానంలో మస్క్‌ను నిలువరించిన భారతీయ విద్యార్థి !
కాలిఫోర్నియా: ప్రపంచ కుబేరుడు, ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలన్ మస్క్‌ను ఓ భారతీయ అమెరికన్ విద్యార్థి న్యాయస్థానంలో నిలువరించాడు. రణదీప్ హోతి అనే భారత సంతతి విద్యార్థి మస్క్ తనకు పరువు నష్టం కలిగించాడని ఆరోపిస్తూ అమెరికాలోని ఓ న్యాయస్థానంలో దావా వేశాడు. ఈ కేసు తాజాగా విచారణకు వచ్చింది. అయితే, హోతి దాఖలు చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందనే మస్క్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. దీంతో మస్క్‌కు కోర్టులో చుక్కెదురైనట్లైంది.
వివరాల్లోకి వెళ్తే.. రణదీప్ హోతి బర్కిలీలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో గ్రాడ్యుయేట్ విద్యార్థి. 2019 ఫిబ్రవరిలో ఫ్రీమోంట్లోని టెస్లా ఆటో ప్లాంట్‌లోకి విద్యుత్ కార్లపై అధ్యయనం కోసం వెళ్లాడు. ఆ సమయంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది హోతిని అడ్డుకున్నారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, హోతి మధ్య చిన్న ఘర్షణ చోటుచేసుకుంది. ఆ తర్వాత అదే ఏడాది ఏప్రిల్‌లో హోతి కారులో వెళ్తూ టెస్లా టెస్టు కారు ఫొటోలు తీశాడు. అనంతరం వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ రెండు సంఘటనలు మస్క్‌ను ఆగ్రహాం తెప్పించాయి. ఈ నేపథ్యంలో హోతిపై మస్క్ ఆన్‌లైన్ టెక్ ఎడిటర్‌కు ఫిర్యాదు చేశారు. హోతి తన కారులో దూసుకురావడంతో పాటు తమ ఉద్యోగులపై దాడికి పాల్పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగా అతడు అబద్ధాలకోరని తెలిపాడు.
ఈ విషయమై 2019 ఆగస్టులో మస్క్‌పై హోతి కోర్టుకెక్కాడు. మస్క్ కావాలనే తనపై ఆన్లైన్లో విద్వేషాన్ని ప్రచారం చేస్తున్నాడని అలమెడా కౌంటీ సుపీరియర్ కోర్టులో పరువు నష్టం దావా వేశాడు. దీనిపై తాజాగా న్యాయస్థానం విచారణ జరిపింది. హోతి దాఖలు చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని, తాను ప్రజా ప్రయోజనం దృష్ట్యానే అతనిపై ఆ వ్యాఖ్యలు చేశానని మస్క్ పేర్కొన్నారు. కనుక హోతి వేసిన పరువు నష్టం దావాను కొట్టివేయాల్సిందిగా న్యాయమూర్తి జస్టిస్ జులియా స్పెయిన్‌ను మస్క్ అభ్యర్థించారు. అయితే, హోతి ఆరోపణలు నిరాధారమైనవని, తన భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందనే మస్క్ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. మస్క్ వాదనల్లో నిజాన్ని తేల్చాల్సి ఉందని లిఖిత పూర్వక తీర్పులో జులియా పేర్కొన్నారు.
అసలు ఈ హోతి ఎవరు?
రణదీప్ హోతి ప్రస్తుతం మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆసియా భాషలు, సంస్కృతులపై డాక్టరల్ చేస్తున్న విద్యార్థి. టెస్లాపై తరచుగా విమర్శలు సంధిస్తుంటాడు. అతను తనను తాను కార్పొరేట్ మోసంపై దర్యాప్తు, రిపోర్టింగ్ చేసే వ్యక్తిగా పేర్కొంటాడు. దీనిలో భాగంగా హోతి ప్రస్తుతం టెస్లాపై దృష్టి సారించాడు. హోతి నివాసముండే ఫ్రీమాంట్‌లోనే టెస్లా ఆటో ప్లాంట్ ఉంది. అలాగే మస్క్, టెస్లాను తీవ్రంగా విమర్శించే ఓ గ్లోబల్ గ్రూపులో హోతి సభ్యుడు కూడా. ట్విటర్, ఆన్‌లైన్ వేదికగా ఈ గ్రూపు మస్క్, టెస్లాపై తరచూ ట్రోలింగ్ చేస్తుంటుంది. ఈ గ్రూపులోని సభ్యులు మరెవరో కాదు. టెస్లా మాజీ ఉద్యోగులతో పాటు హోతి లాంటి విద్యార్థులు, ఇతర నిపుణులు ఉన్నారు. వీరు $TSLAQ అనే హ్యాష్‌ట్యాగ్‌తో తమను తాము ట్యాగ్ చేసుకుంటుంటారు. TSLAQ సభ్యులు మారుపేర్లతో అనామక ఖాతాల నుండి టెస్లా, మస్క్‌పై విమర్శనాత్మక ట్వీట్లు చేస్తుంటారు. అలాగే హోతి @skabooshka పేరిట ట్వీట్లు చేస్తుంటాడు.