షాహీ బిండీ
ABN, First Publish Date - 2021-03-13T17:34:56+05:30
బెండకాయలు - పావుకేజీ, కారం - అర టీస్పూన్, పసుపు - చిటికెడు, గరంమసాల - అర టీస్పూన్, క్రీమ్ - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి ఆకులు - కొద్దిగా, నూనె - సరిపడా, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్, ఉల్లిపాయ - ఒకటి, జీడిపప్పు - పావు కప్పు, టొమాటో - ఒకటి,
కావలసినవి: బెండకాయలు - పావుకేజీ, కారం - అర టీస్పూన్, పసుపు - చిటికెడు, గరంమసాల - అర టీస్పూన్, క్రీమ్ - రెండు టేబుల్‌స్పూన్లు, మెంతి ఆకులు - కొద్దిగా, నూనె - సరిపడా, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్, ఉల్లిపాయ - ఒకటి, జీడిపప్పు - పావు కప్పు, టొమాటో - ఒకటి, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు, అల్లం - చిన్నముక్క, యాలకులు - రెండు, లవంగాలు - రెండు, దాల్చిన చెక్క - కొద్దిగా, పచ్చిమిర్చి - ఒకటి, జీలకర్ర - అర టీస్పూన్.
తయారీ విధానం: స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేయాలి. కాస్త వేడి అయ్యాక జీలకర్ర వేసి వేగించాలి. యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి మరికాసేపు వేగించాలి. తరువాత ఉల్లిపాయలు, వెల్ల్లుల్లి రెబ్బలు, అల్లం వేసి వేగనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పు పలుకులు, పచ్చిమిర్చి వేసి మరికాసేపు వేగించుకోవాలి. తరువాత టొమాటో ముక్కలు వేసి ఉడికించాలి. టొమాటోలు మెత్తగా ఉడికిన తరువాత స్టవ్‌పై నుంచి దింపి మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.
చల్లారిన తరువాత మిక్సర్‌లో వేసి మెత్తటి పేస్టులా పట్టుకోవాలి. స్టవ్‌పై మళ్లీ పాన్ పెట్టి నెయ్యి వేసి కాస్త వేడి అయ్యాక బెండకాయ ముక్కలు వేసి వేగించాలి. కొద్దిగా ఉప్పు చల్లి మరి కాసేపు వేగించి పాత్రలోకి మార్చుకోవాలి. అదే పాన్‌లో కాస్త నూనె వేసి వేడి అయ్యాక సిద్ధం చేసి పెట్టుకున్న షాహీ మసాలా పేస్టు వేయాలి. తరువాత కారం, పసుపు, గరంమసాల వేసి ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న బెండకాయలు వేసి కలపాలి. గ్రేవీ కోసం కొద్దిగా నీళ్లు పోయాలి. చివరగా క్రీమ్, మెంతి ఆకులు వేసి దింపుకోవాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి.