CRACKRES: పేల్చలేక.. పంచలేక!
ABN, First Publish Date - 2022-11-02T06:29:20+05:30
అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు ‘స్టే’ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ వర్గాలు కొండంత ఆశగా ఎదురు చూశాయి. ‘స్టే రావడం ఖాయం. మరికొన్ని రోజుల్లోనే అమరావతిని ఖాళీ చేసేస్తున్నాం’ అంటూ వైసీపీ శిబిరంలో జోరుగా ప్రచారం జరిగింది.
బాణసంచా, మిఠాయిలు సిద్ధం చేసిన వైసీపీ
‘స్టే’ వస్తుందని కొండంత ఆశ
ఆగమేఘాలపై రాజధాని తరలించే యోచన
జస్టిస్ లలిత్ నిర్ణయంతో నిరాశ
(అమరావతి - ఆంధ్రజ్యోతి): అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం కోర్టు ‘స్టే’ ఇస్తుందని రాష్ట్ర ప్రభుత్వం, వైసీపీ వర్గాలు కొండంత ఆశగా ఎదురు చూశాయి. ‘స్టే రావడం ఖాయం. మరికొన్ని రోజుల్లోనే అమరావతిని ఖాళీ చేసేస్తున్నాం’ అంటూ వైసీపీ శిబిరంలో జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు... సుప్రీంకోర్టులో ‘స్టే’ వచ్చిన తక్షణం రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా పేల్చాలని, మిఠాయిలు పంచిపెట్టాలని సరంజామా మొత్తం సిద్ధం చేసుకున్నారు! హైకోర్టు, సుప్రీం కోర్టు ప్రాంగణాల వద్ద తమకు అనుకూలురైన న్యాయవాదులతో ప్రత్యేకంగా ఇంటర్వ్యూలను చేసేందుకు పాలకపక్ష మీడియా ప్రతినిధులను పెద్దఎత్తున మోహరించారు. కానీ... ఈ కేసు నుంచి తాను తప్పుకొంటున్నట్లు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ ప్రకటించడంతో వైసీపీ శిబిరంలో ఒక్కసారిగా నిరాశా నిస్పృహలు అలుముకున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరించాలని కోరుతూ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో... అమరావతిపై సర్కారుకు దెబ్బమీద దెబ్బ తగిలినట్లయింది.
ధర్మాన మాటలతో తలనొప్పి...:
‘పేరుకే మూడు రాజధానులు! విశాఖే అసలైన రాజధాని’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పిన మాటలు ప్రభుత్వాన్నీ, పాలకపక్షాన్నీ ఇరకాటంలో పడేశాయి. ‘పాలనా వికేంద్రీకరణ’ పేరుతో సీఎం జగన్, ఇతర ప్రభుత్వ పెద్దలు చెబుతున్న మాటలు.. అటు రాయలసీమలో, ఇటు ఉత్తరాంధ్రలో చేస్తున్న గర్జనలు ధర్మాన ప్రకటనతో తేలిపోయాయి. న్యాయ రాజధానితో ఒరిగేదేమీ లేదని రాయలసీమ వాసులు ఇప్పటికే పెదవి విరుస్తున్నారు. ఇప్పుడు ధర్మాన తన మాటల ద్వారా వారికి మరింత ‘స్పష్టత’ ఇచ్చేశారు.
Updated Date - 2022-11-02T06:29:20+05:30 IST