ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘చిచ్చు’బుడ్లు

ABN, First Publish Date - 2022-10-24T00:29:31+05:30

తెల్లారితే దీపావళి. అందరి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన పండుగ ఆ రెండు కుటుంబాలకు మాత్రం తీరని విషాదాన్ని మిగిల్చింది. బాణసంచా షాపుల యజమానులకు భారీ నష్టాన్ని మిగిల్చింది. జింఖానా గ్రౌండ్స్‌లో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మూడు బాణసంచా షాపులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. చిచ్చుబుడ్డుల సరుకును ఇష్టానుసారంగా పడేయటం వల్ల, ఒకదానికొకటి రాజుకుని మంటలు చెలరేగి ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలింది.

జింఖానా గ్రౌండ్స్‌లో మంటలు అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జింఖానా గ్రౌండ్స్‌లో ప్రమాదానికి కారణం అవే..

చిచ్చుబుడ్లు ఇష్టానుసారంగా పడేసిన షాపు సిబ్బంది

ఒకదానినొకటి రాజుకుని రేగిన మంటలు

నిమిషాల్లో పక్క షాపులకు కూడా..

బూడిదైన మూడు షాపులు

ఇద్దరు పనివారు దుర్మరణం

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : పూర్ణానందంపేటకు చెందిన వి.గోపాలకృష్ణమూర్తి వన్‌టౌన్‌లో వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు. ఆయన వద్ద మొత్తం పదిమంది పనివారున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన కొల్లి బ్రహ్మం, జక్కంపూడిలోని వైఎస్సార్‌ కాలనీకి చెందిన కాసయ్య అనేవారు పనిచేస్తున్నారు. వస్త్ర వ్యాపారంలో ఉన్న గోపాలకృష్ణమూర్తి ఈ దీపావళికి బాణసంచా వ్యాపారంలోకి దిగారు. వస్త్ర దుకాణంలో పనిచేసే బ్రహ్మం, కాసయ్యను బాణసంచా షాపులోకి తీసుకొచ్చారు.

అసలు కారణం ఇదే..

జింఖానా గ్రౌండ్స్‌లో మొత్తం 19 బాణసంచా షాపుల ఏర్పాటుకు నగరపాలక సంస్థ అధికారులు అనుమతి ఇచ్చారు. ఇందులో 16వ నెంబర్‌ షాపును గోపాలకృష్ణమూర్తి దక్కించుకున్నాడు. ఈ షాపులో శనివారం రాత్రి నుంచే సరుకును సర్దిస్తున్నారు. బ్రహ్మం, కాసయ్యతో పాటు సాంబ, రాధాకృష్ణ, మహేశ్‌, గోవిందరాజులు అనేవారు ఇక్కడ పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి గ్రౌండ్‌లో యజమానులు షాపులు తెరిచారు. ఒక్కొక్కరూ బాణసంచాను సర్దుతున్నారు. గోపాలకృష్ణమూర్తి శివకాశి నుంచి తెప్పించిన సరుకుతో పాటు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్థానికంగా తయారుచేసిన సరుకును తెచ్చారు. ఇందులో ముఖ్యంగా పూల ఆకారంలో నిప్పులు చిందించే చిచ్చుబుడ్డుల (కుండ చించుబుడ్డులు) లోడును భారీగా తీసుకొచ్చారు. గోనె సంచుల్లో వచ్చిన ఈ సరుకును షాపులో సర్దుతున్న క్రమంలో ఒక్కసారిగా ప్రమాదం జరిగిందని నగరపాలక సంస్థ, అగ్నిమాపక విభాగ అధికారులు నిర్ధారణకు వచ్చారు. పోలీసులూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాసయ్య, బ్రహ్మంకు లోగడ బాణసంచా దుకాణాల్లో పనిచేసిన అనుభవం లేకపోవడంతో వస్త్ర దుకాణంలో పనిచేసిన విధంగానే ఇక్కడ సరుకును సర్దినట్టు తెలుస్తోంది. కుండ చిచ్చుబుడ్డులు ఉన్న గోనె సంచులను ఇష్టానుసారంగా పడేయడంతో ఒత్తిడికి అగ్గిరాజుకుని ఉంటాయని ప్రాథమికంగా గుర్తించారు. చిచ్చుబుడ్లలోనే అగ్గి రాజుకోవడం, అందులో మతాబు మందు ఉండటంతో మంటల విస్తృతి వేగంగా జరిగిపోయింది. దీన్ని గమనించిన సాంబ, రాధాకృష్ణ, మహేశ్‌, గోవిందరాజు షాపు నుంచి బయటకు పరుగులు తీశారు. షాపు మధ్యలో ఉండిపోయిన కాసయ్య, బ్రహ్మం మాత్రం మంటల్లో ఇరుక్కుపోయారు. పేలుళ్లకు సజీవ సమాధి అయ్యారు. 16వ నెంబర్‌ షాపులో రేగిన మంటలు అటు, ఇటు ఉన్న 15, 17 నెంబరు షాపులకూ వ్యాపించాయి. మంటలను ఆర్పడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. షాపులకు ఎదురుగా బకెట్లలో ఇసుక, ప్లాస్టిక్‌ డబ్బాల్లో నీళ్లు ఉన్నాయి. వాటిని తెచ్చే సమయానికే మంటలు వేగంగా వ్యాపించేశాయి.

బాణసంచా పేలుడు ధాటికి షాపుల ఇనుప ఫ్రేమ్‌లు వంకర తిరిగిపోయాయి. రెవెన్యూ అధికారి రవి ఇచ్చిన ఫిర్యాదుతో సత్యనారాయణపురం పోలీసులు గోపాలకృష్ణపై క్రైం నెంబర్‌ 586/2022, ఐపీసీ 285, 304(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పేలిన బాంబులు శరీరానికి తగలడంతో గోపాలకృష్ణ గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పూర్తి విచారణ చేయాలి

జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ప్రమాదంపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలి. బాధ్యులను తక్షణం శిక్షించాలి. పక్కనే పెట్రోలు బంకు ఉండగా, దీపావళి సామగ్రి షాపులకు అనుమతి ఎలా ఇచ్చారు? వైసీపీ ప్రజాప్రతినిధులకు ప్రజల ప్రాణాలంటే లెక్కలేదు. అధికార పార్టీ నేతల ఒత్తిడితో అధికారులు నిబంధనలను పట్టించుకోలేదు. - సాకే శైలజానాథ్‌, పీసీసీ అధ్యక్షుడు

Updated Date - 2022-10-24T00:29:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising