జంకు‘బంకు’ లేకుండా..
ABN, First Publish Date - 2022-10-24T00:38:48+05:30
ఓవైపు విద్యాసంస్థలు.. మరోవైపు నివాస గృహాలు.. ఇంకోవైపు వాణిజ్య సముదాయాలు.. నిత్యం విద్యార్థులు, జన సంచారంతో రద్దీగా ఉండే ప్రాంతంలో వైసీపీ ప్రజాప్రతినిధి పెట్రోలు బంకు ఏర్పాటుచేశారు. సభలు.. సమావేశాలు జరిగే జింఖానా మైదానానికి ఈ పెట్రోలు బంకు అత్యంత సమీపంలో ఉంటుంది. ఇలాంటిచోట అసలు బంకుకు అనుమతి ఇవ్వడం ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆదివారం నాటి అగ్ని ప్రమాదం ఈ బంకుకు అత్యంత సమీపంలో జరగడంతో స్థానికులు భయాందోళన చెందారు.
ఇళ్లు, పాఠశాల, సభా ప్రాంగణం నడుమ పెట్రోల్ బంకు
స్థానిక ప్రజాప్రతినిధి అధికార బలంతో ఏర్పాటు
నిబంధనలు గాలికి వదిలి మరీ అనుమతులు
జింఖానా మైదానం ప్రమాద స్థలికి పక్కనే..
పెట్రోల్ బంకుపైకి ఎగసిపడిన టపాసులు
వణికిపోయిన స్థానికులు..
అదృష్టవశాత్తూ తప్పిన పెను ప్రమాదం
(విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్) : ఓ ప్రజాప్రతినిధి తన అధికార బలంతో జింఖానా మైదానం వద్ద ఉన్న నాలుగు రోడ్ల కూడలిలోని ఓ భాగంలో సుమారు రెండేళ్ల కిందట పెట్రోల్ బంక్ ప్రారంభించారు. నగరంలోని వైసీపీ ప్రజాప్రతినిధి ఈ పెట్రోలు బంకు యజమాని. ఆయన బంధువుల పేరుతో దీన్ని కొంతకాలం నిర్వహించారు. అనంతరం వేరే వ్యక్తులకు లీజుకు ఇచ్చారు.
తప్పిన పెను ప్రమాదం
పెట్రోలు బంకు ఏర్పాటు చేయాలంటే.. మున్సిపల్ కార్పొరేషన్, ఫైర్ సేఫ్టీ అధికారుల నుంచి ఎన్‌వోసీ సర్టిఫికెట్లు తీసుకోవాలి. నివాస సముదాయాల నడుమ అయితే, స్థానికుల నుంచి కూడా నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. కానీ, జింఖానా మైదానం కూడలిలో ఏర్పాటుచేసిన పెట్రోలు బంకుకు స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా బలవంతంగా అధికారులు అనుమతులు ఇచ్చేసినట్లు సమాచారం. జింఖానా మైదానంలో దీపావళి టపాకాయల స్టాల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న నేపథ్యంలో స్థానికుల నుంచి పెట్రోలు బంకు ఏర్పాటుపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జింఖానా మైదానంలోని టపాకాయలు భారీ ఎత్తున పేలి, మంటలు పెట్రోలు బంకుపైన పడి ఉంటే ప్రమాద తీవ్రత ఎన్ని రెట్లు పెరిగేదో ఊహించడానికే అవకాశం ఉండేది కాదు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశానికి, పెట్రోల్ బంకుకు కేవలం రోడ్డు మాత్రమే అడ్డు ఉంది. అది కూడా చిన్నది. అగ్ని ప్రమాదం జరిగిన స్టాల్‌కు రేకుల కప్పు ఉండటంతో టపాకాయలు ఎగిరిపడకుండా అడ్డు పడింది.
స్థానికులు వద్దన్నా..
పెట్రోల్ బంకు ఏర్పాటుచేసే సమయంలో స్థానికులను అంగీకారం ఇవ్వాలని కోరగా, నిరాకరించారు. సమీపంలోనే ఉన్న విద్యాసంస్థ యాజమాన్యం కూడా ఒప్పుకోలేదు. నగరపాలక సంస్థకు చెందిన జింఖానా మైదానంలో నిత్యం ఏవో సభలు.. ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ జరిగే సభలకు, కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో జనం వస్తుంటారు. జింఖానా మైదానానికి, పెట్రోల్ బంకుకు కనీసం 20 మీటర్ల దూరం కూడా ఉండదు. ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాతావరణంలో ఇక్కడ పెట్రోల్ బంకుకు నగరపాలక సంస్థ ఎలా అనుమతి ఇచ్చిందన్న ప్రశ్నలు ఉత్పన్నమవు తున్నాయి. ప్రజాప్రతినిధి ఒత్తిడితోనే ప్రజల ప్రాణాలను సైతం లెక్కచేయకుండా బంకుకు అనుమతి ఇచ్చినట్లుగా చెబుతున్నారు.
Updated Date - 2022-10-24T00:38:48+05:30 IST