ఆరిలోవ రోడ్డు విస్తరణకు మోక్షం లేదా?
ABN, First Publish Date - 2022-11-30T00:52:52+05:30
రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు కేవలం రూ.50 లక్షలు చెల్లించకపోవడంతో మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో నర్సీపట్నం- గొలుగొండ ప్రధాన రహదారి విస్తరణకు నోచుకోవడంలేదు. ఈ రోడ్డుని విస్తరించాల్సి వుండడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు మూడున్నరేళ్ల నుంచి నిర్వహణ పనులు చేయడం మానేశారు. కనీసం గోతులు కూడా పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అటవీ శాఖకు రూ.50 లక్షలు విడుదల చేయని ప్రభుత్వం
నెలల తరబడి ఆర్థిక శాఖ వద్ద మూలుగుతున్న ఫైలు
పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు
అధ్వాన రోడ్డులో ప్రయాణంతో జనం ఇక్కట్లు
గొలుగొండ, నవంబరు 29: రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు కేవలం రూ.50 లక్షలు చెల్లించకపోవడంతో మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో నర్సీపట్నం- గొలుగొండ ప్రధాన రహదారి విస్తరణకు నోచుకోవడంలేదు. ఈ రోడ్డుని విస్తరించాల్సి వుండడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు మూడున్నరేళ్ల నుంచి నిర్వహణ పనులు చేయడం మానేశారు. కనీసం గోతులు కూడా పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో వున్నప్పుడు అప్పటి ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే అయిన అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నుంచి గొలుగొండ మీదుగా కృష్ణాదేవిపేట వరకు 24 కిలోమీటర్ల రోడ్డు విస్తరణకు రూ.24 కోట్లు మంజూరు చేయించారు. ఇటు నర్సీపట్నం నుంచి ఆరిలోవ అటవీ ప్రాంతంలో రాజులబాబు గుడివద్ద వరకు, అటు పప్పుశెట్టిపాలెం నుంచి కృష్ణాదేవిపేట వరకు రోడ్డు మూడున్నరేళ్ల క్రితం విస్తరణ పనులు పూర్తి చేశారు. ఆరిలోవ రిజర్వు ఫారెస్టు ప్రాంతం కావడంతో అటవీ శాఖ నుంచి అనుమతులు రావడంలో జాప్యం కావడంతో సుమారు ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదు. ఈ సమయంలో సాధారణ ఎన్నికలు రావడంతో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆరిలోవ అటవీ ప్రాతంలో రోడ్డు విస్తరణ పనులు చేపడతామని ఆ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన పెట్ల ఉమాశంకర్ గణేశ్ హామీ ఇచ్చారు. కానీ రెండున్నరేళ్ల వరకు రోడ్డు విస్తరణలో ఎటువంటి కదలిక లేదు. ఈ నేపథ్యంలో ఆరిలోవ అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు తీసుకుంటున్న భూమికి ప్రత్యామ్నాయంగా భూమిని కేటాయించాలని, దీనిలో మొక్కలు పెంచడానికి రూ.50 లక్షల మంజూరు చేయాలని అటవీ శాఖ అధికారులు ప్రభుత్వానికి (ఆర్‌అండ్‌బీ శాఖ) లేఖ రాశారు. దీంతో రెవెన్యూ అధికారులు పాకలపాడులో ఐదు ఎకరాలను అటవీ శాఖకు బదలాయించారు. రూ.50 లక్షలు మాత్రం ఇంతవరకు విడుదల చేయలేదు... రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగలేదు.
ఛిద్రమైన రహదారి... వాహనదారుల పాట్లు
మూడున్నరేళ్ల నుంచి ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఆర్‌అండ్‌బీ అధికారులు ఎటువంటి నిర్వహణ పనులు చేయలేదు. దీంతో రోడ్డు మొత్తం గోతులు మయంగా మారింది. రోడ్డు ఇరువైపులా అంచులు కోతకు గురయ్యాయి. వ్యాన్లు, లారీలు, బస్సులు వంటి పెద్ద వాహనాలు ఎదురైతే తప్పుకోవడం కష్టం అవుతున్నది. గోతుల కారణంగా ఆటోలు బోల్తా పడుతున్నాయి. వర్షంపడితే గోతుల్లో నీరు చేరుతున్నది. రాత్రిపూట ద్విచక్రవాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. .
కాగా అటవీ శాఖకు రూ.50 లక్షల విడుదలలో జాప్యంపై ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, నిధులు మంజూరు చేయాలని సీఎం జగన్మోహన్‌రెడ్డికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. త్వరలో అటవీ శాఖకు రూ.50 లక్షలు విడుదల అవుతాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్‌అండ్‌బీ జేఈ ప్రసాద్‌ను సంప్రదించగా, అటవీ శాఖకు రూ.50 లక్షల మంజూరు చేయాలని తాము పంపిన ప్రతిపాదన ఫైలు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వద్ద వుందని, నిధులు విడుదలైతే పనులు ప్రారంభిస్తామని చెప్పారు.
Updated Date - 2022-11-30T00:52:53+05:30 IST