Swiggy Instamart: ‘2022లో ఇంటి సరుకులకు ఇంత పెట్టినోడివి నువ్వే గురూ..! అంతలా ఏం ఆర్డర్ ఇచ్చావన్నా’..!
ABN, First Publish Date - 2022-12-29T19:20:48+05:30
మంచి, చెడు జ్ఞాపకాల మిళితమైన 2022 సంవత్సరం ముగింపునకు చేరువైంది. కొన్ని గంటల వ్యవధిలోనే కాలగర్భంలో కలిసిపోనుంది. కొంగొత్త ఆశలతో కొత్త ఏడాది 2023 విచ్చేయనుంది.
న్యూఢిల్లీ: మంచి, చెడు జ్ఞాపకాల మిళితమైన 2022 సంవత్సరం ముగింపునకు చేరువైంది. కొన్ని గంటల వ్యవధిలోనే కాలగర్భంలో కలిసిపోనుంది. కొంగొత్త ఆశలతో కొత్త ఏడాది 2023 విచ్చేయనుంది. అందుకే వీడ్కోలు పలకబోతున్న ఏడాది 2022కు సంబంధించిన వార్షిక నివేదికలను వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నాయి. ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్, డెలివరీ సంస్థలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటికే జొమాటో (Zomato) తన రిపోర్ట్‌ను వెల్లడించగా... తాజాగా స్విగ్గీ (Swiggy) కూడా వార్షిక నివేదికను విడుదల చేసింది. భారతీయ కస్టమర్లు ఎక్కువగా ఏ ఆహారాన్ని ఆర్డర్ చేశారనే ఆసక్తికర విషయాలను పంచుకుంది. గత ఏడేళ్లుగా టాప్ డిష్‌గా కొనసాగుతున్న బిర్యానీయే 2022లో కూడా అగ్రస్థానంలో నిలిచింది. దీంతో స్విగ్గీపై కస్టమర్లు అత్యధికంగా ఆర్డర్ చేసిన డిష్‌గా బిర్యానీ నిలిచింది.
ఒకే వ్యక్తి రూ.16 లక్షల విలువైన ఆర్డర్లు..
వార్షిక రిపోర్టులో స్విగ్గీ ఓ ఆసక్తికరమైన అంశాన్ని పంచుకుంది. బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి 2022 మొత్తం మీద ఏకంగా రూ.16 లక్షల విలువైన నిత్యావసరాలను స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై (Instamart) ఆర్డర్ చేశాడని వెల్లడించింది. సింగిల్ కస్టమర్‌కు సంబంధించి ఇదే అత్యధికమని తెలిపింది. ఇక అదే బెంగళూరుకు చెందిన మరో వ్యక్తి దీపావళి సమయంలో ఏకంగా రూ.75,378 విలువైన సింగిల్ ఆర్డర్ పెట్టాడు. పుణెకి చెందిన మరో కస్టమర్ తన టీమ్ కోసం ఏకంగా రూ.71,229 విలువైన బర్గర్లు, ఫ్రైలు ఒకేసారి ఆర్డర్ చేశాడని రిపోర్టులో పేర్కొంది. ఇక 2022లో అత్యుల్పంగా 1.03 సెకన్లలోనే ఒక కస్టమర్‌కు డెలివరీ అందించినట్టు, వినియోగదారుడి నివాసం స్టోర్ నుంచి 50 మీటర్ల దూరంలోనే ఉండడంతో సాధ్యపడిందని వెల్లడించింది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌పై ఇన్‌స్టంట్ నూడిల్స్, పాలు కోసం కస్టమర్లు ఎక్కువగా ఆర్డర్ చేస్తున్నారని పేర్కొంది.
ఇక 2022లో ఎక్కువగా ఆర్డర్ చేసిన ఆహార పదార్థాల జాబితాను కూడా స్విగ్గీ వెల్లడించింది. ఇండియన్స్ అత్యధికంగా ఇష్టపడే చికెన్ బిర్యానీ మొదటి స్థానంలో నిలవగా.. ఆ తర్వాతి స్థానంలో మసాలా సమోసా, చికెన్ ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా, బటర్ నాన్, వెజ్ ఫ్రైడ్ రైస్, వెబ్ బిర్యానీ, తందూరి చికెన్ వరుస స్థానాల్లో ఉన్నాయి. అంతేకాదు ఈ ఏడాది కొత్త వంటకాలను కూడా చాలామంది ప్రయత్నించారు. ఇటాలియన్ పాస్తా, పిజ్జా, మెక్సికన్ బౌల్, స్పైస్ రమెన్, సుషీ, రవియోలి(ఇటాలియన్), బిబింబాప్(కొరియన్) ఈ జాబితాలో టాప్ లిస్టులో ఉన్నాయి.
Updated Date - 2022-12-29T19:25:21+05:30 IST