Blue tick: మస్క్ ప్లాన్ ఎదురు తన్నింది..ప్రముఖ సంస్థకు 1.20 లక్షల కోట్ల నష్టం
ABN, First Publish Date - 2022-11-13T16:35:32+05:30
ట్విటర్‌ను లాభాల బాట పట్టించేందుకు అపరకుబేరుడు ఎలాన్ మస్క్ రచించిన వ్యూహం.. ఓ ప్రముఖ కంపెనీ కొంప ముంచింది.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్‌ను లాభాల బాట పట్టించేందుకు అపరకుబేరుడు ఎలాన్ మస్క్(Elon musk) రచించిన వ్యూహం.. ఓ ప్రముఖ కంపెనీ కొంప ముంచింది. ఆ సంస్థకు ఏకంగా 15 బిలియన్ డాలర్ల(సుమారు రూ.1.20 లక్షల కోట్లు) నష్టం తెచ్చిపెట్టింది. డబ్బులిస్తే ఎవరికైనా బ్లూ టిక్ మార్క్(Blue tick) ఇచ్చేస్తామంటూ మస్క్ ప్రకటించిన సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ తాలూకు ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుందో ఈ ఉదంతంతో స్పష్టమైపోయింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాకు చెందిన ఫార్మా దిగ్గజం ‘ఎల్లీ లిల్లీ’(Eli lilly).. ఇన్సులిన్(Insulin) తయారు చేస్తుంది. ఈ సంస్థకు 18 దేశాల్లో శాఖలు ఉన్నాయి. అయితే..శుక్రవారం సంస్థ షేర్ ధర ఏకంగా 4.37 శాతం మేర పడిపోయింది(crash). అంటే.. ఒక్కరోజులో ‘ఎల్లీ లిల్లీ’ మార్కెట్ విలువలో సుమారు 15 బిలియన్ డాలర్లు తుడిచిపెట్టుకుపోయాయి. దీనికంతటికీ కారణం.. ఓ ఫేక్ ట్వీట్. ఇన్సులీన్‌ను ఇకపై ఉచితంగా సరఫరా చేస్తామంటూ ఎల్లీ లిల్లీ పేరిట ఉన్న నకిలీ అకౌంట్‌లో ఓ ట్వీట్ కనిపించింది. ఆ ఫేక్ అకౌంట్‌కు బ్లూ టిక్ మార్క్ కూడా ఉండటంతో.. ఈ వార్త దావానలంగా వ్యాపించింది.
‘ఎల్లీ లిల్లీ’ నిజంగానే ఉచితాలకు దిగిందనుకుని మదుపర్లు భయపడటంతో.. సంస్థ షేర్ ధర ఒక్కసారిగా ఢమాల్‌మంది. వెంటనే దిద్దుబాటు చర్యలకు పూనుకున్న ‘ఎల్లీ లిల్లీ’ తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో వివరణ ఇచ్చింది. ‘ఉచిత ఇన్సులీన్ ట్వీట్’.. నకిలీ అకౌంట్ నుంచి వచ్చిందని చెప్పడంతో మదుపర్లు ఊపరి పీల్చుకున్నారు. అసలైన అకౌంట్లకు మాత్రమే ఇచ్చే బ్లూటిక్ మార్క్‌ను మస్క్ అమ్మకానికి పెట్టడంతో..బ్లూ టిక్ ఉన్న నకిలీ అకౌంట్లు తామరతంపరగా పెరిగాయి. ఇది గుర్తించిన ట్విటర్ ఈ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ జారీని శుక్రవారమే నిలిపివేసింది. దాని స్థానంలో ‘అఫీషియల్’ బ్యాడ్జ్‌ను కొన్ని అకౌంట్లకు పునరుద్ధరించింది. కానీ.. ‘ఎల్లీ లిల్లీ’ విషయంలో అప్పటికే నష్టం జరిగిపోయింది. ఇక ఎయిరోస్పేస్ డిఫెన్స్ దిగ్గజం లాక్‌హీడ్ మార్టిన్(Lockheed Martin) కూడా ఇదే సమస్య ఎదురైంది. సంస్థ పేరిట ఉన్న ఓ నకిలీ అకౌంట్లోని ట్వీట్ కారణంగా.. సంస్థ షేర్లు ఏకంగా 5 శాతం మేర పతనమయ్యాయి. లాక్‌హీడ్ మార్టిన్..సౌదీ అరేబియాకు ఆయుధాల అమ్మకాలు నిలిపివేయనుందన్న ఫేక్ ట్వీట్‌తో సంస్థకు చేదు అనుభవం ఎదురైంది.
Fake documents: ఐటీ ఉద్యోగులకు వరుస షాకులు.. ఆ తప్పు చేసుంటే ఇంటికే..!
Layoffs 2022: గగ్గోలు పెడుతున్న హెచ్-1బీ వీసాదారులు, లైఫ్ తలకిందులు!
Updated Date - 2022-11-13T16:51:56+05:30 IST