Dove Dry Shampoo కొనేవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలట.. ఎందుకంటే..
ABN, First Publish Date - 2022-10-26T19:28:27+05:30
తలస్నానం చేసేందుకు ఒకప్పుడు కుంకుడు కాయలు వాడేవాళ్లు. కానీ ఈరోజుల్లో సహజసిద్ధమైన కుంకుడు కాయలు వాడేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పడంలో..
తలస్నానం చేసేందుకు ఒకప్పుడు కుంకుడు కాయలు వాడేవాళ్లు. కానీ ఈరోజుల్లో సహజసిద్ధమైన కుంకుడు కాయలు వాడేవాళ్లు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పడంలో సందేహమే లేదు. నూటికి 90 శాతం మంది షాంపులతోనే తల స్నానం చేస్తున్నారు. మారిన జీవన శైలి కారణంగా 30 ఏళ్ల లోపే జుట్టు ఊడిపోతున్న పరిస్థితి. దీంతో.. యాంటీ డాండ్రఫ్ షాంపులంటూ మార్కెట్లో బోలెడు షాంపులు అందుబాటులో ఉన్నాయి. త్వరితగతిన చుండ్రు సమస్యకు పరిష్కారం కోసం, జుట్టు ఊడిపోకుండా ఉండటం కోసం డ్రై షాంపులను నేటి యువత ఎక్కువగా వాడుతోంది. అయితే.. కాస్మోటిక్స్ అమ్మకాల్లోనే అగ్ర స్థానంలో ఉన్న ఈ డ్రై షాంపుల విషయంలో తాజాగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. డ్రై షాంపుల్లో (recalled dry shampoos dove) క్యాన్సర్ కారకం ఉందని అమెరికా ఔషధ నియంత్రణ మండలి USFDA గుర్తించడమే అందుకు కారణం. ముఖ్యంగా డవ్ డ్రై షాంపు (Dove Dry Shampoo) కొని వినియోగించేవాళ్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని USFDA చెబుతోంది. అమెరికా మార్కెట్లో ఇటీవల డవ్ డ్రై షాంపును రీకాల్ చేశారు. క్యాన్సర్ కారకమైన బెంజీన్ లాంటి రసాయనాలను డవ్ డ్రై షాంపులో అమెరికా ఔషధ నియంత్రణ మండలి గుర్తించింది.
అక్టోబర్ 21న USFDA ఈ ఉత్పత్తులను మార్కెట్ నుంచి ఉపసంహరించింది (రీకాల్). అయితే.. భారత్‌లో మాత్రం ఇప్పటికీ ఈ ఉత్పత్తులు అందుబాటులోనే ఉండటం గమనార్హం. అంతేకాదు.. ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్స్ అయిన అమెజాన్ లాంటి ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో కూడా డవ్ డ్రై షాంపు అందుబాటులో ఉంది. Dove Dry Shampoo Spray Fresh & Floral అనే పేరుతో 141 గ్రాముల పరిమాణం కలిగిన ఈ షాంపు 625 రూపాయలకు అమ్ముతున్నారు. కస్టమర్ రేటింగ్ 3 స్టార్‌పైగానే ఉంది. ప్రముఖ ఉత్పత్తుల కంపెనీ యూనిలివర్ ఈ Dove dry shampooను తయారుచేస్తోంది. అమెరికాలో ఈ షాంపు తయారవుతుంది. బెంగళూరుకు చెందిన యునైటెడ్ డిస్ట్రిబ్యూటర్స్ అనే బెంగళూరుకు చెందిన కంపెనీ ఇండియాకు దిగుమతి చేసుకుని మార్కెట్‌లో డవ్ డ్రై షాంపును వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది.
అమెరికా ఔషధ నియంత్రణ మండలి చెబుతున్న ప్రకారం.. డవ్ డ్రై షాంపులో మరీ ముఖ్యంగా 2021 అక్టోబర్‌కు ముందు తయారుచేసిన షాంపుల్లో బెంజీన్ మోతాదుకు మించి ఉందని తేల్చింది. అలాంటి షాంపులను వాడటం వల్ల లుకేమియా, బ్లడ్ క్యాన్సర్ వంటి వ్యాధులతో పాటు రక్తహీనత వంటి సమస్య కూడా తలెత్తే ప్రమాదం ఉందని USFDA తెలిపింది. ఒక్క డవ్ డ్రై షాపుల్లో మాత్రమే కాదు Nexxus, Suave, TIGI (Rockaholic and Bed Head), and TRESemmé ఉత్పత్తుల్లో కూడా బెంజీన్ మోతాదుకు మించి ఉందని గుర్తించిన అమెరికా ఔషధ నియంత్రణ మండలి సదరు ఉత్పత్తులను మార్కెట్‌లో అందుబాటులో ఉంచకూడదని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. యూనిలివర్ సంస్థకు అనుబంధ సంస్థ అయిన హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ (HUL) మాత్రం భారత్‌లో డ్రై షాంపులను అమ్ముతున్నారనే ప్రచారాన్ని ఖండించింది. తమ సంస్థ భారత్‌లో ఎలాంటి డ్రై షాంపులను అమ్మడం లేదని తెలిపింది.
Updated Date - 2022-10-26T20:11:27+05:30 IST