Oyo: చడీచప్పుడు లేకుండా OYO ఎంత పనిచేసింది..!
ABN, First Publish Date - 2022-12-03T16:23:56+05:30
Hospitality రంగంలో వెలుగొందుతున్న ఓయోకు (OYO) కూడా లే-ఆఫ్స్ సెగ తగిలింది. దేశవ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులతో నడుస్తున్న ఈ సంస్థ 600 మంది ఉద్యోగులను..
Hospitality రంగంలో వెలుగొందుతున్న ఓయోకు (OYO) కూడా లే-ఆఫ్స్ సెగ తగిలింది. దేశవ్యాప్తంగా 3,700 మంది ఉద్యోగులతో నడుస్తున్న ఈ సంస్థ 600 మంది ఉద్యోగులను (OYO 600 Job Cuts) ఇంటికి పంపించాలని నిర్ణయించింది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులపై ఈ లే-ఆఫ్స్ ప్రభావం పడనుంది. అయితే.. మేనేజ్‌మెంట్ టీమ్స్‌లో రిక్రూట్‌మెంట్లకు కూడా ఏకకాలంలో ఓయో పూనుకోవడం విశేషం. మేనేజ్‌మెంట్ టీమ్స్‌లో 250 మంది ఉద్యోగులకు అవకాశం కల్పించాలని ఈ సంస్థ నిర్ణయించింది. ప్రొడక్ట్, ఇంజనీరింగ్ విభాగాలను విలీనం చేసినట్లు ఓయో తెలిపింది. ఇన్నాళ్లూ ఐటీ రంగానికే (IT Layoffs) పరిమితమైన లే-ఆఫ్స్ ఇప్పుడు బ్యాంకింగ్, మీడియా, హాస్పిటాలిటీ రంగాలపై కూడా ప్రభావం చూపుతుండటం గమనార్హం.
వ్యయ భారాన్ని తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగించడం ఒక్కటే మార్గంగా మెజార్టీ సంస్థలు భావిస్తున్నాయి. ఓయో తీసుకున్న తాజా నిర్ణయం కూడా అలాంటిదే. ఇదిలా ఉండగా.. ఐటీలో మరోసారి మాంద్యం తలెత్తిందేమోనన్న రీతిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను సంస్థలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తీరు ఆ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఉద్యోగంపై అభద్రతా భావాన్ని రోజురోజుకూ పెంచుతున్న పరిస్థితి.
ఉద్యోగుల తొలగింపునకు పాల్పడుతున్న సంస్థలన్నీ ‘వ్యయ భారాన్ని తగ్గించుకునే నిమిత్తం’ అనే ఒక్కమాటతో జాబ్‌ల్లో నుంచి ఉద్యోగులను పీకేస్తున్నాయి. మరికొన్ని సంస్థలు ఫేక్ ఎక్స్‌పీరియన్స్‌తో ఉద్యోగాలను తెచ్చుకున్న వారిపై ఫోకస్ పెట్టాయి. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ పేరుతో ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్(Cognizant) తాజాగా కొందరు ఉద్యోగులను ఇంటికి పంపింది. కొన్ని మేజర్ ఐటీ సంస్థలేమో మూన్‌లైటింగ్‌కు కొందరు ఉద్యోగులు పాల్పడుతున్నారని, అలా తమ సంస్థలో పనిచేస్తూ మరో సంస్థకు పనిచేయడం పాలసీకి విరుద్ధమని అలాంటి వారిని ఉద్యోగాల నుంచి తొలగించామని ప్రకటించాయి. మొత్తంగా చూసుకుంటే.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(IT) రంగంలో గతంలో తలెత్తిన మాంద్యం(Recession) పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఒక్క మెయిల్‌తో ‘ఉద్యోగం నుంచి తొలగిస్తున్నాం’ అనే సమాచారం వస్తుందేమోనన్న భయాందోళన ఐటీ ఉద్యోగుల్లో నెలకొంది.
Updated Date - 2022-12-03T16:24:09+05:30 IST