Twitter: ఉద్యోగుల తొలగింపు.. క్షమాపణలు చెప్పిన ట్విటర్ వ్యవస్థాపకుడు
ABN , First Publish Date - 2022-11-07T21:50:25+05:30 IST
ట్విటర్‌లో భారీగా ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: ట్విటర్(Twitter) ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో ట్విటర్ వ్యవస్థాపకుడు జాక్ డోర్సీ(Jack dorsey) బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. ఉద్యోగుల తొలగింపునకు తానే బాధ్యత వహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. ‘‘కంపెనీని నేనే వేగంగా విస్తరించాను. కాబట్టి.. నేను మీకు క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నారు. అయితే.. ట్విటర్‌లోని వారందరూ దృఢచిత్తులనీ, ఎంత క్లిష్ట పరిస్థితుల నుంచైనా బయటపడతారని చెప్పారు. ట్విటర్ ఎన్నటికీ అంతరించిపోదని కూడా ఆయన ఓ వ్యక్తికి సమాధానమిస్తూ ట్వీట్ చేశారు.
మరోవైపు.. ట్విటర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్(Elon musk) చేస్తున్న మార్పులను జాక్ డోర్సీ అంగీకరించలేకపోయారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ట్విటర్ వేదికగా వాదోపవాదాలు సాగాయి. తప్పుడు సమాచారానికి అడ్డుకట్టు వేసేందుకు బర్డ్ వాచ్ పేరిట్ ఓ కార్యక్రమం సాగుతున్న విషయం తెలిసిందే. దీన్ని మస్క్.. కమ్యూనిటీ నోట్స్‌గా మార్చరు. ఈ చర్యపై జాక్ డోర్సీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బర్డ్ వాచ్ పేరే బాగుందని జాక్ అభిప్రాయపడగా.. ట్విటర్‌కు సంబంధించిన ప్రతి పదంలో బర్డ్ ఉండాల్సిన అవసరం లేదని మస్క్ రిప్లై ఇచ్చారు. కమ్యూనిటీ నోట్స్ పదం బోర్ కొట్టేలా ఉందని జాక్ కామెంట్ చేశారు. దీంతో.. ట్విటర్‌లో పిట్టపోరు ఎక్కువైందంటూ కొందరు సరదా కామెంట్లు విసిరారు.
ఇక ట్విటర్ చేజిక్కించుకున్నాక మస్క్ అనేక అనూహ్య మార్పులకు తెరలేపారు. బ్లూటిక్ కావాలనుకునే వారికి 8 డాలర్ల సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి చేశారు. ఫేక్ అకౌంట్లపై కూడా ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమవుతున్నారు. అత్యంత కచ్చితమైన సమాచారానికి వేదికగా ట్విటర్‌ను తీర్చిదిద్దుతానంటూ భారీ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు.
Read more