ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జ్ఞానాన్వేషణకు వారధి పుస్తకం

ABN, First Publish Date - 2022-12-21T03:01:12+05:30

‘నువ్వుఇంత సుదూర విషయాలను ఎలా చూడగలుగుతున్నావు. ఇంత గొప్ప దృష్టి నీకెలా వచ్చింది’ అని న్యూటన్‍ను ఎవరో అడిగితే ఆయన చెప్పిన సమాధానం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘నువ్వుఇంత సుదూర విషయాలను ఎలా చూడగలుగుతున్నావు. ఇంత గొప్ప దృష్టి నీకెలా వచ్చింది’ అని న్యూటన్‍ను ఎవరో అడిగితే ఆయన చెప్పిన సమాధానం ‘నా ముందు తరాల శాస్త్రవేత్తల జ్ఞానభుజాల మీద ఎక్కి కూర్చున్నాను. అందుకే నేను అంత దూరం చూడగలుగుతాను’ అని. న్యూటన్ సమాధానం పునాదిగానే పుస్తక అధ్యయనాల జ్ఞాన దారులను చూడాలి. రాబోయే తరానికి భవిష్యత్తు దార్శనికతకు చరిత్ర, సంస్కృతి, జీవన విధానం, సమస్త ప్రపంచ పరిణామక్రమాల తీరును పుస్తకాల రూపంలో అందించాలి.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగమించినట్లుగానే చదువుల రంగంలో కూడా దూసుకుపోతోంది. ఈనాటి తరం తరగతి గది పుస్తకాలకే పరిమితమైపోతుందన్న వాదనలను కొట్టివేస్తూ గత కొన్నేళ్ళుగా అశేషంగా పుస్తక ప్రదర్శనలకు తరలివస్తున్న యువతను చూస్తే వారు పుస్తకాల్లోంచి విస్తృత ప్రపంచాన్ని తొంగి చూస్తున్నారని అవగతమవుతుంది. పుస్తక ప్రదర్శనలకు వచ్చేవారు హైదరాబాద్ చుట్టుపక్కల 100 కిలోమీటర్ల పరిధిలోని వారైతే ఒక్కరోజుతో సరిపెట్టుకోరు. సుమారు 300కు పైగా బుక్స్టాల్స్ కొలువైన సందర్భంలో రోజూ కొన్ని స్టాల్స్‌‍ను ఎంచుకొని అమూలాగ్రంగా చూస్తారు. ఇట్లా కొన్ని రోజులు ఇందుకు ప్రత్యేకించి సమయాన్ని కేటాయించి మరీ విచ్చేసేవారు ఉన్నారు. స్థానికంగా ఉన్న హైదరాబాదీయులు కాకుండా 33జిల్లాల నుంచి విచ్చేసే పుస్తక ప్రియులు ఒక్కరోజులోనే మొత్తం బుక్ ఫెయిర్ను సందర్శించి కావాల్సిన పుస్తకాలను కొనుక్కుంటారు. పుస్తక ప్రియులు పుస్తకాల దగ్గరకు రావటం, ఉత్సాహంతో వెతుక్కోవటం, మంచి పుస్తకాలను ఆదరించడం మంచి సంస్కృతిగా చెప్పాలి.

పుస్తకాలపై మక్కువ పెంచడానికి, చిన్నప్పటి నుంచే చదివే అలవాటు వైపుకు మళ్ళించడానికి కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలను పుస్తక ప్రదర్శనకు తీసుకొని వస్తున్నారు. ఈ విధంగా తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకువచ్చి పలు రకాల పుస్తకాలను చూపించి వారు చదివే పుస్తకాలను వారిచేత కొనిపించడం చేస్తారు. వారి ఇష్టంతో పుస్తకాలను తల్లిదండ్రులు కొనించే పద్ధతి పిల్లలపై మంచి ప్రభావాన్ని చూపుతుంది. క్రీడలు, ఆటపాటలు, బడి పిల్లలు రాసిన కథలు వంటి పుస్తకాలకు మంచి గిరాకీ ఉంటుంది. ఇటీవల 33 జిల్లాల నుంచి కథల సేకరణ జరిగింది. అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ ‘బాలచెలిమి’ పేరుతో వేదకుమార్ అనేక పుస్తకాలను వెలువరించారు. మంచి పుస్తకం ప్రచురణల పేరుతో బాలసాహిత్యం ఇప్పటికే విరివిగా వచ్చింది. ఇటీవల అనేక స్కూళ్లకు సంబంధించిన పిల్లలు రాసిన కథలతో విరివిగా సంకలనాలు వచ్చాయి. అవన్నీ పుస్తక ప్రదర్శనల్లో లభిస్తాయి. చిన్నపిల్లల కథలు తెలుగులోనే గాక హిందీ, ఇంగ్లీషు, తదితర భాషల్లో కూడా లభిస్తాయి.

దేశ దేశాల చరిత్రల దగ్గర్నుంచి గత రెండు దశాబ్దాలుగా కొనసాగిన మలిదశ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ చరిత్ర వరకు అన్ని రకాల చరిత్ర పుస్తకాలు పుస్తక ప్రదర్శనలో ఉంటాయి. చరిత్రతో మిళితమైన సాహిత్య సాంస్కృతిక సౌరభాలను వెదజల్లే రాహుల్ సాంకృత్యాయన్ లాంటి విశిష్ట పుస్తకాలు ఉంటాయి. భారత స్వాతంత్ర్య పోరాటాల దగ్గర నుంచి దేశదేశాల విముక్తి పోరాటాలు, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సామాజిక అస్తిత్వ ఉద్యమాల చారిత్రక భూమికలన్నీ వివిధ రూపాల్లో, వివిధ కోణాల్లో, విభిన్న భాషల్లో అందుబాటులో ఉంటాయి. విభిన్నత్వంతో కూడుకున్న భారతీయ సమాజంలోని భిన్నత్వంలో ఏకత్వం గల సంస్కృతి, సాహిత్యాలు ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ దగ్గర నుంచి రాచమల్లు రామచంద్రారెడ్డి సాహిత్య విమర్శ వరకు ఇక్కడ ఉంటుంది. వీర తెలంగాణ సాయుధ పోరాటం, వేరు తెలంగాణ పోరాటం ఈ రెంటికి సంబంధించిన గ్రంథాలు దొరుకుతాయి. జాతీయ కాంగ్రెస్ దగ్గర నుంచి టిఆర్ఎస్, బీఆర్ఎస్ ఆవిర్భావం వరకు జరిగిన, జరుగుతున్న పరిణామాల చరిత్రపై పుస్తకాలు లభిస్తాయి. ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సకల సామాజిక శాస్త్రాలు, సైన్స్ ఫిక్షన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ఎన్నెన్నో విలువైన గ్రంథాలు లభిస్తాయి. ఆధునిక సమాజం నుంచి అత్యాధునిక సమాజం వరకు వివిధ ప్రక్రియల కథ, కవిత, నవల, నాటక సాహిత్యం పుస్తక ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా అందుబాటులో ఉంటుంది.

తెలుగులో తొలి కథ అని చెప్పబడుతున్న గురజాడ ‘దిద్దుబాటు కథ’ (అచ్చమాంబ రాసిన తొలి కథ అంటున్నారు అది వేరే చర్చ) దగ్గర్నుంచి ఈనాటి అత్యాధునిక కాలపు యువతరం రాసిన కథ వరకు అన్ని రకాల కథల పుస్తకాలు లభిస్తాయి. చలం ‘మైదానం’, కొ.కు. గల్పికల దగ్గర్నుంచి, కుప్పిలి పద్మ ‘మైదానం’ శీర్షికగా రాసిన ఇష్టమైన లేఖల వరకు సతీష్ చందర్ ‘లవ్ ఎట్ డస్ట్ సైట్’ల వరకు అన్ని కథలు దొరుకుతాయి. నవీన్ ‘అంపశయ్య’ దగ్గర్నుంచి ‘కాల రేఖలు’, కాలువ మల్లయ్య కథల వరకు లభిస్తాయి. దళిత, బహుజన, గిరిజన, మైనార్టీ అస్తిత్వ కథలు, కులవృత్తి కథలు, ఎన్నెన్నో వందల వేల కథల భాండాగారం అంతా పుస్తక ప్రదర్శనలో దొరుకుతుంది.

ఇక కవిత్వాలకు సంబంధించి వందల సంఖ్యలో కవుల కలాల గళాల గర్జనలన్నీ కావాల్సినన్ని ఉంటాయి. భావ, అభ్యుదయ, విప్లవ, స్త్రీవాద, దళితవాద, బహుజన, మైనారిటీ, గిరిజన, ఆదివాసి తుడుందెబ్బల వరకు కావాల్సినన్ని కవిత్వ కంఠాల ధ్వనులు పుస్తక ప్రాంగణమంతా ప్రతిధ్వనిస్తాయి. వచన కవిత్వాలు, నానీలు, ఫీల్ గుడ్ పొయిట్రీలు, ఒకటారెండా విభిన్న వాదాల, విభిన్న ప్రక్రియల, కవిత్వపు రహదారులు పుస్తక ప్రదర్శన ప్రాంగణమంతా నిండి ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో లెక్కకు మించి ఉన్న సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల సంస్థల నుంచి ముద్రించిన ఎన్నెన్నో విలువైన పుస్తకాలు లభ్యమవుతాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనున్న కొందరు కవులు ప్రతినిత్యం కవిత్వ పాదాలై ఆ ప్రాంగణంలో సంచరిస్తుంటారు.

తరతరాలుగా వస్తున్న భారతీయ సంస్కృతికి దర్పణంగా ఉన్న సమస్త పద్యగద్య వాగ్గేయకారుల సాహిత్యమంతా పుస్తక ప్రదర్శనకు వస్తే చేతికి అందుతుంది. పురాణాల కథలు, వేదాల సారాలు, భారతీయ సమాజ మూలాలైన పురాతన సాహిత్యమంతా ఇక్కడ దొరికే అవకాశం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రాల వరకు, కాశీ నుంచి కాళేశ్వరం వరకు, తీర్థక్షేత్రాల సాహిత్యం వరకు అన్ని లభిస్తాయి.

ప్రపంచాన్ని కదిలించిన నడిపించిన నడిపిస్తున్న విభిన్న వాదాల, విభిన్న దేశాల సాహిత్యం ఇక్కడ దొరుకుతుంది. పలు సామాజిక శాస్త్రాలకు సంబంధించిన బోలెడన్ని గ్రంథాలు ఉంటాయి. కమ్యూనిజం, సోషలిజం, పెట్టుబడిదారీ సమాజాలు, రైటిస్టుల, లెఫ్టిస్టుల, శాంతి కాముకుల సత్యశోధన అహింసా మార్గాలు, గాంధీవాదాలు, నెల్సన్ మండేలాలు, బెంజీమెన్ మొలైసాలు, విప్లవాగ్నులు ఎగజిమ్ముతూ ఎర్రపొద్దులను పొడిపించే జూలియస్ మ్యూజిక్ రక్తాక్షరాలు, అలెక్స్ హేలీ ఏడు తరాలు, మహాత్మా జ్యోతిబాపూలే, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రచనల దగ్గర నుంచి బొజ్జా తారకం రాసిన ‘పోలీసులు అరెస్టు చేస్తే’ వరకు బాలగోపాల్ రచనలు, గాంధీ అనంతరం భారతదేశంలో ఎన్నెన్నో విలువైన రచనలు ఈ పుస్తక ప్రదర్శనలో దర్శనమిస్తాయి.

విదేశాల్లో, దేశంలో పేరుపొందిన సంస్థలు ముద్రించిన అనేక విలువైన పుస్తకాలు ఇక్కడ దొరుకుతాయి. దేశంలోని భిన్న భాషల పుస్తకాలు ప్రదర్శిస్తారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం నుండి ఒరియా భిన్న భాషల పుస్తకాలకు ప్రత్యేక స్టాల్స్ ఉంటాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో పేరుపొందిన విశాలాంధ్ర, ప్రజాశక్తి, నవచేతన, నవతెలంగాణ, ఎమెస్కో, మంచి పుస్తకం, అడుగుజాడలు, భూమిక, హైదరాబాద్ బుక్ ట్రస్టు, స్పృహ సాహితీ సంస్థ, రామయ్య విద్యాపీఠం, తెలంగాణ ప్రచురణలు, చెలిమె, మలుపు, నలుపు, ఎదురీతల ప్రచురణలు, పాలపిట్ట, స్వేచ్ఛ ప్రచురణలు, రంగనాయకమ్మ రచనల ప్రచురణలు ఇంకా ఎన్నెన్నో విలువైన లబ్ద ప్రతిష్టమైన ప్రచురణ సంస్థలు పుస్తకాల స్టాల్స్లో పుస్తక ప్రియులకు అందుబాటులోకి తీసుకువస్తారు. ఇన్ని ప్రచురణల సంస్థల సమాహారంగా, ఇన్ని ప్రచురణల సంస్థల విస్తృత వేదికగా నిలబడటంతో హైదరాబాద్ పుస్తక ప్రదర్శన జాతీయ పుస్తక ప్రదర్శనగా నిలిచింది. దేశంలో ఢిల్లీ, కలకత్తా, రాజస్థాన్ల తర్వాతి స్థానంలో హైదరాబాద్ బుక్ ఫెయిర్ జాతీయ పుస్తక ప్రదర్శనగా నిలబడింది. ఇందుకు కారణం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న చైతన్యం, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి అందుతున్న సహకారం కూడా. పది లక్షల మంది హాజరయ్యే ఈ పుస్తక ప్రదర్శన వెనుక ఎందరెందరి సహకారమో ఉంది. హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిర్వాహకుల సమిష్టి కృషి కూడా ఎంతో ఉంది. ఇందుకోసం నిరంతరం పనిచేసే క్రమశిక్షణ, నిబద్ధతగల వ్యక్తుల కృషి కూడా పుస్తక ప్రదర్శనల చరిత్రలో నిలిచిపోయేదని చెప్పక తప్పదు.

సాంకేతిక విప్లవాల పరిజ్ఞానం ఎంతగా మీ అరచేతుల్లోకి వచ్చినా, పుస్తకం తల్లి లాంటిది. కొత్తతరం ఈ పుస్తకాన్ని అందిపుచ్చుకునేందుకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఎంతో కృషి చేస్తున్నది. పౌరులు జ్ఞానాన్వేషణ మార్గాలలోకి పోవటానికి పుస్తకాలు ఎంతో దోహదం చేస్తాయి. వారికి పుస్తకాలు దూరమైతే మన చరిత్ర మరుగున పడినట్టే.

జూలూరు గౌరీశంకర్

చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమి

(రేపటి నుంచి హైదరాబాద్ బుక్ ఫెయిర్ )

Updated Date - 2022-12-21T03:01:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising