ముదిరిన యుద్ధం..రాష్ట్రానికే నష్టమా..?
ABN, First Publish Date - 2022-11-27T00:45:02+05:30
కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మొదలైన యుద్ధం ముదురు పాకాన పడింది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు భారత్–పాకిస్థాన్ ప్రభుత్వాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. నిజానికి కేంద్రంతో సఖ్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దశలో ప్రయత్నించారు..
కేంద్రప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య మొదలైన యుద్ధం ముదురు పాకాన పడింది. కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు భారత్–పాకిస్థాన్ ప్రభుత్వాలు అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. నిజానికి కేంద్రంతో సఖ్యత కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దశలో ప్రయత్నించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాజకీయాల నుంచి తాను విరమించుకొని తనయుడు కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేద్దామనుకుంటున్నానని, అందుకు సహకరించాలని కోరారు. అయితే తెలంగాణలో సొంతంగా అధికారంలోకి రావాలన్న బలమైన కాంక్షతో ఉన్న కమలనాథులు కేసీఆర్ చేసిన సదరు ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో కేంద్రంతో తలపడవలసిన ఆవశ్యకత కేసీఆర్‌కు ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలు రంగంలోకి దిగాయి. వాటికి ఇప్పుడు చేతి నిండా పని. టీఆర్‌ఎస్ ముఖ్యులు అందరూ కేంద్ర ప్రభుత్వ హిట్ లిస్ట్‌లో చేరిపోయారు. తాజాగా మంత్రి మల్లారెడ్డిపై ఆదాయపు పన్నుశాఖ అధికారులు దాడులు చేయడం, ఆ సందర్భంగా హైడ్రామా చోటుచేసుకోవడాన్ని చూశాం. మంత్రి కుటుంబ సభ్యులు, ఆదాయపు పన్ను శాఖ అధికారులు పోలీస్ స్టేషన్‌లో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. మల్లారెడ్డి కుటుంబ సభ్యులు తమ పట్ల వ్యవహరించిన ధోరణిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆగ్రహంగా ఉన్నారు. దాడుల సందర్భంగా తాము మర్యాదగా వ్యవహరించినప్పటికీ తాము దౌర్జన్యానికి పాల్పడినట్టు ప్రచారం చేయడాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. సోదాల సందర్భంగా తమకు లభ్యమైన పత్రాల ఆధారంగా మల్లారెడ్డి సంస్థలను పకడ్బందీగా ఇరికించే ప్రయత్నాలు పూర్తిచేశారు. మల్లారెడ్డి సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసినట్టు ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఆధారాలు లభించాయి. ఈ ఆధారాల మేరకు మల్లారెడ్డికి చెందిన విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవలసిందిగా ఏఐసీటీఈ, ఇండియన్ మెడికల్ కౌన్సిల్‌కు లేఖలు రాసే పనిలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఉన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో పనిచేస్తున్న సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులపై అవినీతి నిరోధక శాఖను ప్రయోగించాలని కేసీఆర్ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ శాఖలకు చెందిన కొంత మందిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేయడానికి రంగం సిద్ధమవుతోంది. అదే జరిగితే తెలంగాణలో అధికారం కోసం మొదలైన పోరు వికృత రూపం సంతరించుకొనే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసీఆర్ ప్రభుత్వం దూకుడు పెంచి ఉండకపోతే ప్రస్తుత ఉద్రిక్త వాతావరణం ఏర్పడి ఉండేది కాదు. భారతీయ జనతా పార్టీలో అత్యంత పలుకుబడి కలిగిన బి.ఎల్.సంతోష్‌జీపై తెలంగాణ పోలీసులు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కేసు నమోదు చేయడాన్ని బీజేపీ కేంద్ర పెద్దలు చాలా సీరియస్‌గా తీసుకున్నారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి బీజేపీ ప్రయత్నిస్తున్నదని జాతీయ స్థాయిలో ప్రచారం చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సఫలమయ్యారు. దీంతో కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకొని తీరతామని బీజేపీ నాయకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆదాయపు పన్ను శాఖ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులపై కేంద్రం నుంచి ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. ‘మీరు ఏం చేస్తారో తెలియదు. కేసీఆర్‌ను ఉక్కిరిబిక్కిరి చేయాల్సిందే’ అని పై నుంచి ఆదేశాలు అందుతున్నాయని ఆయా ఏజెన్సీల అధికారులు చెబుతున్నారు.
ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో భారతీయ జనతా పార్టీ మొదటిసారిగా ఆత్మరక్షణలో పడింది. ఆ విషయం తెలుసు కనుకే కేంద్ర ప్రభుత్వ పెద్దలైన నరేంద్ర మోదీ, అమిత్ షాలు దీనిపై నోరు విప్పడంలేదు. అదే సమయంలో కేసీఆర్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ మధ్య మొదలైన పోరు ఏ మలుపు తీసుకుంటుందో తెలియని పరిస్థితి! ఈ రెండు పార్టీల మధ్య నెలకొన్న వైరం వల్ల తెలంగాణ రాష్ట్రం, ముఖ్యంగా హైదరాబాద్ ఆగమాగం అవుతోంది. తెల్లవారితే ఎవరి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు దాడికి దిగుతారోనని వ్యాపార, పారిశ్రామిక వర్గాలు హడలిపోతున్నాయి. ఇప్పుడు టీఆర్‌ఎస్ ముఖ్యులు కూడా ఈ జాబితాలో చేరిపోయారు. వ్యాపారాలు చేసుకుంటున్న టీఆర్‌ఎస్ ముఖ్యులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వైరం ఏర్పడిన సందర్భాలలో రాష్ర్టాలే నష్టపోవడాన్ని మనం చూశాం. హైదరాబాద్ మహానగరం తెలంగాణలో భాగమైనందున కేంద్ర ఏజెన్సీలు ఇక్కడే చురుగ్గా ఉంటాయి. ఇదే మల్లారెడ్డికి చెందిన సంస్థల్లో ఆదాయపు పన్నుశాఖ అధికారులు గతంలో రెండు మూడు పర్యాయాలు సోదాలు నిర్వహించారు. అప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం లేదు కనుక ఆ సోదాలకు ప్రాధాన్యం ఏర్పడలేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలకు విధేయుడిగా ఉంటున్నందున ఆ రాష్ట్రంలో కేంద్ర ఏజెన్సీలు నిస్తేజంగా ఉంటున్నాయి. కేంద్ర పెద్దలతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సంధి కుదిరే అవకాశాలు కనుచూపు మేరలో లేనందున దాడులు, ప్రతిదాడులు నిత్యకృత్యమయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ అధికారులపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ అధికారులు నిజంగా కేసులు పెడితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. తెలంగాణలో పనిచేస్తున్న అధికారులను ఇబ్బంది పెట్టకూడదు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు చెందిన అధికారులను దాడులకు పంపించే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వ్యాపారాలు అన్నాక ఏవో కొన్ని లొసుగులు ఉంటాయి. కేసీఆర్‌ను నమ్ముకొని కేంద్ర ఏజెన్సీలతో తలపడటానికి ఎంతమంది సిద్ధపడతారు? ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ అధికారులు మంత్రి మల్లారెడ్డిని పకడ్బందీగా ఇరికించగలిగితే మిగతావారు భయపడిపోతారు. అయితే బి.ఎల్.సంతోష్‌జీ చిక్కుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తమకు లడ్డూలా దొరికినందున కేంద్ర ఏజెన్సీల దూకుడుకు విరుగుడుగా ఈ కేసును వాడుకోవాలని కేసీఆర్ ప్రభుత్వం భావిస్తోంది. మొత్తానికి ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పోరుతో తాము నలిగిపోతున్నామని తెలంగాణకు చెందిన వ్యాపార, పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. టీఆర్‌ఎస్, బీజేపీ మధ్య నెలకొన్న రాజకీయ ఘర్షణ వల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోతుందని చాలా రోజుల క్రితం నేను చెప్పిన విషయం ఇప్పుడు రుజువవుతోంది. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించడం ఎవరికీ మంచిది కాదు. ఇది ఒక దుష్ట సంప్రదాయం అవుతుంది!
తాతలు తాగిన నేతులు..
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల విషయానికి వద్దాం. ‘వినేవాడుంటే చెప్పేవాడికి లోకువ’ అని అంటారు. ఈ నానుడిని బాగా వంట పట్టించుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను అదే దృష్టితో చూస్తున్నట్టుగా ఉంది. తన పూర్వాపరాలు తెలుసుకోకుండా తాను చెప్పిన మాటలన్నీ నమ్మి తనకు ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన ప్రజలంటే ఆయనకు లోకువగా ఉండటం సహజమే. తనలాంటి వాణ్ణి కూడా ముఖ్యమంత్రిని చేసిన పిచ్చి ప్రజలకు ఏమైనా చెప్పవచ్చునన్న ధీమా జగన్మోహన్ రెడ్డిలో పెరిగిపోయింది. ఈ కారణంగానే శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన సభలో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీని బూతుల పార్టీగా, జనసేనను రౌడీసేనగా ఆయన అభివర్ణించారు. నిజానికి రాజకీయాలలో బూతులను ప్రవేశపెట్టించిన ఘనత జగన్‌కే దక్కుతుంది. శ్రీకాకుళం జిల్లాకే చెందిన మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ల భాష గురించి ప్రజలకు తెలిసిందే. మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్ తదితరులు వాడే భాష గురించి చెప్పాల్సిందేమీ లేదు. బట్టలు విప్పుకొని తిరిగిన ఎంపీ గోరంట్ల మాధవ్ తనను తప్పుబట్టిన వారిని ఏ భాషలో తిట్టారో విన్నాం. శాసనసభలో కూడా తన పార్టీ వారు బూతులు తిట్టడాన్ని ఆస్వాదించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీని బూతుల పార్టీగా పేర్కొనడం కలికాల మహత్యం కాక మరేమిటి? విప్పుకొని తిరిగితే తప్పు కాదు! చెప్పు చూపించడమే తప్పు అని బుకాయిస్తున్న ముఖ్యమంత్రి ఇందుకు భిన్నంగా ఎలా ఉంటారులే! రాష్ట్ర ప్రజలను వెర్రివెంగళప్పలుగా జగన్మోహన్ రెడ్డి పరిగణిస్తున్నట్టుంది. అందుకే ఆయన నోటి నుంచి పచ్చి అబద్ధాలు అలవోకగా ప్రవహిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలను మర్చిపోయిన ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రజలను మరోమారు వంచించే ప్రయత్నాలు మొదలెట్టారు.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి నోటికొచ్చిన అబద్ధాలు చెబుతున్నారు. ఉత్తుత్తి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సొంత సోషల్ మీడియా ద్వారా అభూత కల్పనలు ప్రచారం చేయించడం మొదలుపెట్టారు. తాను చెబుతున్న కల్లబొల్లి కబుర్లను ప్రజలు మౌనంగా వింటున్నందున వాటిని జనం నిజంగానే నమ్ముతున్నారన్న భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టున్నారు. అధికారంలో ఉన్నవాళ్లు, ముఖ్యంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవాళ్లు చెబుతున్నవి అసత్యాలు, అర్ధ సత్యాలు అని తెలిసినా కూడా ప్రజలు ప్రశ్నించరు. అంత మాత్రాన వాటన్నింటినీ నమ్ముతున్నట్టు కాదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు రుణమాఫీ జరిగిపోయినట్టుగా చెప్పేవారు. నిజానికి యాభై వేల రూపాయలలోపు రుణం తీసుకున్న వారికే పూర్తి రుణమాఫీ జరిగింది. అంతకంటే ఎక్కువ రుణం తీసుకున్న వారికి పాక్షికంగానే రుణమాఫీ జరిగింది. అయినా తమ రుణాలు పూర్తిగా మాఫీ కాలేదని ఎక్కడా రైతులు నిలదీయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెబుతున్న కబుర్లను కూడా నమ్మకపోయినా మౌనంగా వింటున్నారు. దీంతో ఆయన అబద్ధాల డోసును పెంచుకుంటూ పోతున్నారు. రాజకీయం చెడిపోయిందని కూడా ఆయన ఇటీవల ఆవేదన వ్యక్తంచేశారు. పగలు, ప్రతీకారాలు తీర్చుకోవడానికి అధికారం అన్నట్టుగా పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాలు చెడిపోయాయని అనగలుగుతున్నారంటే కలికాలం అని సరిపెట్టుకోవాల్సిందే. నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ అందరి గౌరవ మర్యాదలు పొందుతున్న మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు విషయంలో జగన్ అనుసరిస్తున్న వైఖరే ఆయన అధికారాన్ని ఎందుకు వాడుతున్నారో చెప్పకనే చెబుతున్నది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ సాగించిన అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కాంగ్రెస్‌కు చెందిన డాక్టర్ శంకర్ రావు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో అశోక్ గజపతిరాజు కూడా ఇంప్లీడ్ అయ్యారు. దశాబ్దం క్రితంనాటి ఈ సంఘటనను మనసులో పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అశోక్ గజపతిరాజుపై ప్రతీకారం తీర్చుకుంటున్నారు.
హవ్వ.. వాళ్లతో పోలికా?
జగన్‌పై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్లలో సహ నిందితులుగా ఉన్న హెటిరో డ్రగ్స్ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. హెటిరో వ్యవహారంలో క్విడ్ ప్రో కో జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోందని, సీబీఐ రూపొందించిన చార్జిషీటులో తగిన ఆధారాలు ఉన్నాయని సైతం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అయినా జగన్‌లో వెరపు ఉండదు. అవినీతి అంటే ఎలా ఉంటుందో, ఎలా చేస్తారో కూడా తెలియనట్టుగా ఆయన నటిస్తారు. అంతేకాదు మరో అడుగు ముందుకేసి ఎంజీఆర్, ఎన్టీఆర్ సరసన తనను తాను కూర్చోబెట్టుకున్నారు. ‘సొంతంగా పార్టీ పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన వారిని ఎంజీఆర్, ఎన్టీఆర్, జగన్ అని అంటారు’ అని ఆయన తనకు తాను కితాబిచ్చుకున్నారు. ఎంజీఆర్, ఎన్టీఆర్ తండ్రులు ముఖ్యమంత్రులు కారు. హెలికాప్టర్ ప్రమాదాల్లో వారు మరణించడం వల్ల ప్రజల్లో సానుభూతి పెల్లుబకలేదు. కరుణానిధితో తలెత్తిన విభేదాల కారణంగా ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెంది ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటుచేసి అధికారంలోకి వచ్చారు. అప్పుడు జగన్ చెడ్డీలు వేసుకొని తిరిగేవారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో హఠాన్మరణం చెందడంతో ప్రజల్లో సానుభూతి పెల్లుబికింది. ఈ సానుభూతిని సొమ్ము చేసుకోవడం కోసం రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి తెర మీదకు వచ్చారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు కాకపోయి ఉంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏమిటి? నందమూరి బాలకృష్ణ అభిమాన సంఘం కడప జిల్లా అధ్యక్షుడిగా మాత్రమే ఉండేవారేమో! చిన్న చిన్న సబ్ కాంట్రాక్టులు చేస్తూ ఉండేవారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తండ్రి మిగిల్చి వెళ్లిన ఖ్యాతిని వాడుకొని ముఖ్యమంత్రి అయ్యారు. ఈ విషయం మరచిపోయిన ఆయన తనను తాను ఎంజీఆర్, ఎన్టీఆర్‌లతో పోల్చుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడ?, రాజకీయాల్లో నిప్పులా బతికిన ఎంజీఆర్, ఎన్టీఆర్ ఎక్కడ? నక్కకూ నాక లోకానికీ ఉన్నంత తేడా ఉంది. అయినా ప్రజలకు ఇవేవీ తెలియదన్నట్టుగా ఆయన ప్రవర్తిస్తారు. పరుల ఆస్తిని కాజేసే వాళ్లను కబ్జాదారులు అంటారని చెబుతున్న జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీనీ, ఆ పార్టీ ఓటు బ్యాంకునూ కబ్జా చేయడం నిజం కాదా? కాంగ్రెస్ పార్టీ లేకపోతే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేవారా? కాంగ్రెస్ పార్టీలో తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న దుగ్ధతో ఒక దశలో సొంత పార్టీ పెట్టుకోవడానికి ప్రయత్నించిన రాజశేఖర్ రెడ్డిని ఆప్త మిత్రుడైన కేవీపీ రామచంద్రరావు నివారించడం నిజం కాదా? కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు అందరూ కాలం చేయడంతో రాజశేఖర్‌రెడ్డికి మంచి రోజులు వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మరణించడంతో వారసుడిగా జగన్మోహన్ రెడ్డి తనను తాను ప్రకటించుకున్నారు. తండ్రిని మించిన తనయుడిని అవుతానని చెప్పి తన నాయకత్వంపై ప్రజల్లో భ్రమలు కలిగించగలిగారు. ఇప్పుడు గతమే గుర్తులేదన్నట్టుగా అంతా తన ఖ్యాతే అని జగన్ ప్రచారం చేసుకుంటున్నారు. పరిపాలన అంటే బటన్లు నొక్కి ప్రజలకు పంచడమే అని ముఖ్యమంత్రి పదవికి సరికొత్త నిర్వచనం ఇచ్చారు.
రాష్ర్టాన్ని అప్పులపాలు చేస్తూ డబ్బు పంచుతున్న జగన్ రెడ్డి అదేదో తన సొంత సొమ్ము పంచుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బు తీసుకున్న వాళ్లందరూ తనకే ఓటు వేయాలని కోరుతున్నారు. ముఖ్యమంత్రి అనేవాడు ధర్మకర్త మాత్రమే. ఇందులో ఇచ్చేవాడు, పుచ్చుకొనేవాడు ఉండరు. సుదీర్ఘ పాదయాత్ర చేసి జనంలో కలిసిపోయిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆ జనాలను కలుసుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు. పొలాల్లో కూలీనాలీ చేసుకొనే వారిని కూడా బెరుకు లేకుండా ఆలింగనం చేసుకొని ముద్దులు పెట్టిన మనిషే ఇప్పుడు తన పర్యటనల సందర్భంగా ప్రజల కళ్లకు కనపడకుండా పరదాలు కట్టిస్తున్నారు. సామాన్య జనం తన దరిదాపుల్లోకి రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేయిస్తున్నారు. తన సభలో నిరసన ధ్వనులు వినిపించకూడదని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్ సభకు వచ్చిన వారు పొరపాటున కూడా నలుపు రంగు దుస్తులు ధరించలేని పరిస్థితి కల్పించారు. చివరకు మహిళలు నల్లటి చున్నీలు ధరిస్తే వాటిని కూడా పోలీసులు తొలగిస్తున్నారు. మరి ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియదని నమ్మాలంటే మహిళల శరీరంపై కప్పుకొనే చున్నీలను తొలగింపజేసిన పోలీసు అధికారులపైన చర్యలు ఉండాలి కదా? అయినా జగన్మోహన్ రెడ్డికి నలుపు రంగు మీద ఇంత యావగింపు ఎందుకో తెలియదు. మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఇదివరకు జుట్టుకు రంగు వేసుకొని యువకుల్లా కనపడేవారు. ఇప్పుడు వారు జుట్టుకు రంగు వేసుకోవడం మానేశారు. జగన్‌కు నలుపు రంగు ఇష్టం ఉండదు కనుక వాళ్లు జుట్టుకు రంగు వేసుకోవడానికి భయపడుతున్నారేమో! అని నెటిజన్లు జోకులేస్తున్నారు. కాగా, తన గొప్ప పాలనపై జగన్మోహన్ రెడ్డికి కూడా నమ్మకం సడలుతున్నట్టు ఉంది. అందుకే జనాన్ని చూసి ఆయన భయపడుతున్నట్టు ఉన్నారు. నిజానికి నిన్నమొన్నటి వరకు జగన్‌ను తలచుకొని జనం భయపడేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. కర్నూలు పర్యటన సందర్భంగా చంద్రబాబు సభలకు జనం విరగబడి రావడమే ఇందుకు నిదర్శనం. చంద్రబాబు కర్నూలు సభలను కూడా గ్రాఫిక్స్ మాయాజాలంగా ప్రజలను నమ్మించడానికి జగన్ నీలి మీడియా ప్రయత్నించి విఫలమైంది. ‘దాల్ మే కుచ్ కాలా హై’ అన్నట్టుగా జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పతాక స్థాయికి చేరుతున్నదన్న అభిప్రాయానికి అధికార పార్టీ నాయకులు కూడా వచ్చారు. పార్టీ కోసం నిర్వహించే సర్వేలలో ఈ విషయం స్పష్టమవుతోందని ఒక మంత్రి అంగీకరించారు. కొద్ది రోజుల క్రితం వరకు జగన్ ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తోందని చెప్పేవారి సంఖ్య అధ్వానంగా ఉందని చెప్పేవారి సంఖ్య కంటే ఎక్కువగా ఉండేదని, ఇప్పుడది రివర్స్ అయిందని పార్టీ ముఖ్యులు ఒకరు విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డిని గుడ్డిగా సమర్థించే వారి సంఖ్య తగ్గిపోవడం పార్టీకి ప్రమాదకర సంకేతమని ఆయన అన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత కాస్తా కసిగా మారుతోందని, ఈ దశలో ఎన్ని దిద్దుబాటు చర్యలు తీసుకున్నా ఫలితం ఉంటుందన్న నమ్మకం కూడా లేదని మరో మంత్రి చెప్పుకొచ్చారు. ఎన్నికలకు ముందు వేసిన ఎత్తుగడలన్నీ ఇప్పుడు వికటిస్తున్నాయని, ఏ వర్గాలపై జగన్ నమ్మకం పెట్టుకున్నారో ఆ వర్గాలు కూడా వాస్తవం తెలుసుకొని దూరం అవుతున్నాయని అధికార పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కమ్మ–కాపు సామాజిక వర్గాలను బూచిగా చూపించి మిగతా సామాజిక వర్గాలను ఆకర్షించడం కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు కూడా వికటిస్తున్నాయి. తమను కూరలో కరివేపాకులా వాడుకుంటున్నారని దళితులు, బీసీలు గుర్తించారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. సంక్షేమ పథకాల పేరిట క్రమం తప్పకుండా డబ్బు పంచుతున్నందున ప్రజలు తమతోనే ఉంటారని భావించామని, అయితే క్షేత్ర స్థాయి పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయని ఒక సీనియర్ మంత్రి వ్యాఖ్యానించారు. జగన్ అందుకున్న దుష్టచతుష్టయం నినాదం కూడా పనిచేయడం లేదని అధికార పార్టీ తరఫున నిర్వహిస్తున్న సర్వేలలో వెల్లడవుతోంది. దీంతో జగన్‌లో అసహనం పెరిగిపోయి మీడియాను కూడా రాక్షసులుగా అభివర్ణిస్తున్నారు. మరో నెల రోజుల తర్వాత 2023 సంవత్సరంలోకి ప్రవేశిస్తాం. అప్పటి నుంచి ప్రజల్లో వ్యతిరేకత విషయంలో మరింత స్పష్టత వస్తుంది అని వైసీపీ శాసనసభ్యులు అభిప్రాయపడుతున్నారు. పోలీసు అధికారుల వైఖరిలో కూడా మార్పు వస్తోందని చెబుతున్నారు. ఈ ప్రభుత్వ అరాచకాలను ఇంకెంత కాలం మోయాలని పోలీసు అధికారులు చర్చించుకుంటున్నారు. మొత్తానికి జనంలో జగన్ మీద ఉన్న భ్రమలు తొలగిపోవడం మొదలైంది. అంతిమంగా రాష్ట్రంలో అధికార మార్పిడికి ఈ పరిణామాలు దారితీస్తాయా? లేదా? అన్నది స్పష్టంకావాలంటే మరికొంత కాలం వేచి చూడాలి. ఇప్పటిదాకా గ్రామాలలో ప్రజలు అధికార పార్టీకి అనుకూలంగా ఉండేవారు. ఇప్పుడు గ్రామాల్లో సైతం వ్యతిరేక గాలి వీస్తోందని వైసీపీ నాయకులు అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో మున్ముందు జగన్మోహన్ రెడ్డి తన నిజస్వరూపాన్ని మరింతగా బయటపెట్టుకొనే అవకాశం ఉంది. ఇకపై ఆయన నోటి నుంచి అసత్యాలు, అర్ధ సత్యాలు మాత్రమే వెలువడతాయి కాబోలు!
ఆర్కే
Updated Date - 2022-11-27T08:34:45+05:30 IST