ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్‌లో ఊహించని ప్రధాని

ABN, First Publish Date - 2022-12-28T01:16:02+05:30

స్వార్ధమా, ద్రోహమా అన్న ప్రశ్నలను అటుంచితే, నేపాల్‌ పరిణామాలు అమితాశ్చర్యాన్ని కలిగించేవే. ఎవరూ ఊహించని రీతిలో నేపాల్‌ ప్రధానిగా కమ్యూనిస్టుపార్టీ ఆఫ్‌ నేపాల్‌–మావోయిస్టు సెంటర్‌..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వార్ధమా, ద్రోహమా అన్న ప్రశ్నలను అటుంచితే, నేపాల్‌ పరిణామాలు అమితాశ్చర్యాన్ని కలిగించేవే. ఎవరూ ఊహించని రీతిలో నేపాల్‌ ప్రధానిగా కమ్యూనిస్టుపార్టీ ఆఫ్‌ నేపాల్‌–మావోయిస్టు సెంటర్‌ అధ్యక్షుడు పుష్పకుమార్‌ దహల్‌ ‘ప్రచండ’ ప్రమాణం చేశారు. ఆయనతో పాటు ఎనిమిది మందితో ఏర్పడిన మంత్రివర్గంలో ముగ్గురు ఉపప్రధానులైనారు. మొన్నటివరకూ ప్రధానిగా ఉన్న నేపాలీ కాంగ్రెస్‌ అధినేత షేర్‌ బహదూర్‌ దేవ్‌బా మారోమారు ప్రధాని అవుతారనుకుంటున్నదశలో, ఎన్నికల్లో ఆయనతోపాటు నడిచిన భాగస్వాములందరినీ తన్నుకుపోయి ప్రచండ మూడోమారు ప్రధాని కావడం ఊహించని పరిణామం. దేవ్‌బాను మళ్ళీ ప్రధానిగా ప్రతిష్ఠించాలని ఆశపడ్డ భారతదేశం, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ నేపాల్‌ –యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ (సీపీఎన్‌–యుఎంఎల్‌) అధినేత, చైనా వీరవిధేయుడైన మాజీ ప్రధాని ఖడ్గప్రసాద్‌ శర్మ ఓలీ ఎత్తుల ముందు చిత్తయిందని రాజకీయ విశ్లేషకుల వాదన. నేపాల్‌ ప్రధాని అయిన ప్రచండను మొట్టమొదటగా అభినందించింది భారత ప్రధాని నరేంద్రమోదీయే. గతాన్ని పూర్తిగా పక్కనబెట్టి, భారతదేశంతో అత్యంత సన్నిహిత సంబంధాలు నెరపబోతున్నట్టు ప్రచండ కూడా ప్రకటించారు.

ప్రధాని పదవికోసం ప్రచండ తన బద్ధశత్రువుతో చేతులు కలుపుతారని ఎవరూ అనుకోలేదు. ఇటీవల జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకున్నా, నేపాలీ కాంగ్రెస్‌ నాయకత్వంలోని ఆరు పార్టీల అధికారకూటమి అధిక స్థానాలు సాధించుకుంది. అందులోనూ, నేపాలీ కాంగ్రెస్‌ ఎక్కువస్థానాలు గెలుచుకుంది కనుక, ఈ కూటమే తిరిగి అధికారంలో కూచుంటుందని, అమెరికా, భారత్‌, యూరోపియన్‌ దేశాలు కోరుతున్నట్టుగా షేర్‌బహదూర్‌ దేవ్‌బా తిరిగి ప్రధాని అవుతారని అందరూ అనుకున్నారు. కానీ, చివరకు నేపాలీలు కూడా ఊహించనిరీతిలో, వారి ఓట్లకు విలువలేకుండా చేసే ఎన్నికల అనంతర రాజకీయం అక్కడ నడిచింది. ఎన్నికలకు ముందు ప్రధాని పదవిని చెరిసగం కాలం పంచుకుందామని దేవ్‌బా–ప్రచండల మధ్య ఒప్పందం కుదిరినా, ముందుగా ప్రచండను ప్రతిష్ఠించడానికి నేపాలీ కాంగ్రెస్‌ అధినేత అంగీకరించలేదని, దీనివెనుక భారతదేశం ఒత్తిడి ఉన్నదని అంటారు. కానీ, 275 స్థానాల పార్లమెంటులో ముప్పైస్థానాలు కూడా లేని ప్రచండ, ప్రధాని పదవికోసం తిరిగి కేపీ శర్మ ఓలితో చేతులు కలిపారు. ఐదేళ్ళక్రితం నేపాల్ ప్రజలు పట్టంకడితే, ఓలి, ప్రచండ వర్గాలు పరస్పరం కత్తులు దూసుకున్నాయి. తానే సర్వాధికారాలూ అనుభవించాలన్న కేపీ శర్మ ఓలీ అధికారదాహం ఇరువురి మధ్యా అగ్గిరాజేసింది. దీనితో, తన రాజకీయ ప్రత్యర్థి నేపాలీ కాంగ్రెస్‌తో ప్రచండ చేతులు కలిపి ఓలీని తూర్పారబడుతూ ఎన్నికలకు వెళ్ళారు.

ఇప్పుడు దేవ్‌బా–ప్రచండ మధ్య ప్రధాని పదవివిషయంలో రేగిన విభేదాన్ని ఓలీ చక్కగా వినియోగించుకొని, ప్రచండకు ప్రధాని పదవిని ఇచ్చి, ప్రతిఫలంగా స్పీకర్‌, రాష్ట్రపతి పదవులు అందుకోబోతున్నారు. మంత్రివర్గంలో తనవారికి చోటు సంపాదించుకున్నారు. తనను అధికారం నుంచి దించడానికి గత ఏడాది ప్రత్యర్థితో చేతులు కలిపిన వ్యక్తికే ప్రధాని పదవిని ఎరవేసి ఓలీశర్మ పరోక్షంగా సర్వాధికారాలూ చెలాయించబోతున్నారు. ప్రచండను ఎలా బుట్టలోవేసుకోవాలో దేవ్‌బాకంటే ఓలీకే ఎక్కువ తెలుసు.

అంతర్యుద్ధాన్ని దాటి, రాజరికాన్ని దించి, నేపాలీలు ప్రజాస్వామ్యవ్యవస్థను ప్రతిష్ఠించుకొని ఎంతోకాలమైనా, నేపాల్‌లో ఇప్పటివరకూ ఒక్క ప్రధాని కూడా పూర్తికాలం పదవిలో ఉండలేదు. పరస్పరం కత్తులు దూసుకున్న ఉభయకమ్యూనిస్టు పక్షాలూ ఒక్కటైనందున, నేపాల్‌ రాజకీయాల్లో ఆఖరునిముషంలో చైనాదే పైచేయి అయిందన్న విశ్లేషణలు అటుంచితే, పార్లమెంటులో వచ్చేనెలలో ప్రచండ తన బలం నిరూపించుకొనేలోగా అక్కడ ఏమైనా జరగవచ్చు. ఒకవేళ ఆ పరీక్షలో నెగ్గినా కూడా, కేవలం అధికారమే పరమావధిగా కొత్త ఎత్తుల మధ్య ఏర్పడిన ఈ పొత్తు ఎక్కువకాలం నిలిచే అవకాశాలు లేవు. నేపాల్‌ తిరిగి రాజకీయ సంక్షోభంలోకి జారిపోవడంతో పాటు, ప్రచండ ప్రధానికావడం, తెరవెనక్కుపోయారనుకున్న చైనా విధేయ ఓలీశర్మ తిరిగి కింగ్‌మేకర్‌గా అవతరించడం భారతదేశానికి శుభసూచనలైతే కావు. నేపాల్‌ పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే, ఉభయదేశాల మధ్యా ఉన్న బలమైన చారిత్రక బంధం పునాదిగా, ఎవరు అధికారంలో ఉన్నా సయోధ్యతో, సహకారంతో వ్యవహరించడం భారత్‌ బాధ్యత.

Updated Date - 2022-12-28T01:16:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising