అఫ్ఘాన్ లో అరాచకం
ABN, First Publish Date - 2022-12-23T03:59:19+05:30
అఫ్ఘానిస్థాన్ లో తాలిబాన్ పాలకులు క్రమంగా తమ పూర్వావతరాన్ని ప్రదర్శించడం ఆరంభించారు. ఇప్పుడు అఫ్ఘాన్ యూనివర్సిటీల్లో ఆడపిల్లలు చదువుకోవడాన్ని నిషేధించడం ద్వారా...
అఫ్ఘానిస్థాన్ లో తాలిబాన్ పాలకులు క్రమంగా తమ పూర్వావతరాన్ని ప్రదర్శించడం ఆరంభించారు. ఇప్పుడు అఫ్ఘాన్ యూనివర్సిటీల్లో ఆడపిల్లలు చదువుకోవడాన్ని నిషేధించడం ద్వారా అది తిరిగి 1990ల నాటి రోజుల్ని గుర్తుచేస్తున్నది. మొన్న మంగళవారం తాలిబాన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించగానే, కాలేజీలు, యూనివర్సిటీలు అమ్మాయిలను లోపలకు రానివ్వకుండా వెనక్కు తిప్పిపంపేయడం ఆరంభించాయి. యూనివర్సిటీల ముందు అమ్మాయిలంతా వెక్కివెక్కి ఏడుస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. గతంలో సెకండరీ స్కూళ్ళలో ఆడపిల్లలను నిషేధించిన తాలిబాన్ ఇప్పుడు దానిని ఉన్నత విద్యకు కూడా విస్తరించడంతో మహిళలకు విద్యాగంధం అంటనివ్వకూడదన్న దాని లక్ష్యం పరిపూర్తి అయినట్టే.
అఫ్ఘానిస్థాన్ లో ఇప్పటికే బహిరంగస్థలాల్లో మహిళల సంచారం బాగా తగ్గిపోయింది. పార్కులు, స్విమ్మింగ్ పూల్స్, జిమ్ ఇత్యాది చోట్ల వారిని తాలిబాన్ నిషేధించింది. ప్రభుత్వోద్యోగులైన మహిళలు నఖశిఖపర్యంతం కప్పుకోకపోతే ఉద్యోగాలు కోల్పోవలసి వస్తుందని ప్రభుత్వం హెచ్చరికలు చేసింది. ఇరాన్ మాదిరిగా అక్కడ కూడా నైతికపోలీసులు మహిళలను అదుపు ఆజ్ఞల్లో పెడుతున్నారనీ, అరెస్టులు చేస్తున్నారనీ, వారికి డ్రైవింగ్ లైసెన్సుల వంటివి ఇవ్వడం కూడా నిలిచిపోయిందని వార్తలు వస్తున్నాయి. కాలేజీల్లోకి, యూనివర్సిటీల్లోకి తమను నిషేధించినందుకు గురువారం కాబూల్ యూనివర్సిటీ ముందు ఓ వందమంది మహిళలు ‘చదువు మా హక్కు’ అన్న ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తంచేయడం తాలిబాన్ ఏలుబడిలో అదే పెద్దస్థాయి నిరసన కావచ్చు. తోటి వైద్యవిద్యార్థినులను నిషేధించినందుకు కొన్ని మెడికల్ కాలేజీల్లో మగపిల్లలు కూడా పరీక్షలు రాయకుండా వెళ్ళిపోయారట. మొన్న మార్చిలో ఆడపిల్లలకు స్కూళ్ళు తెరవకుండా తాలిబాన్ మాటతప్పినప్పుడు పాశ్చాత్యదేశాలు ఘాటుగానే స్పందించాయి. దీంతో గతనెలలో ఆడపిల్లలను కేవలం పరీక్షలు మాత్రమే రాసుకోనిచ్చిన తాలిబాన్ పాలకులు ఇప్పుడు ఏకంగా విద్యాసంవత్సరం మధ్యలో అమ్మాయిలను యూనివర్సిటీల్లోకి రాకుండా ఆపేశారు. దీనిపై ఐక్యరాజ్యసమితి కాస్తంత ఘాటుగానే స్పందించినా, అమెరికా మాత్రం ‘సగం జనాభాను వెనక్కునెట్టేస్తున్న ఏ దేశం బాగుపడదు’ అంటూ శపించి ఊరుకుంది.
మహిళలపై ఈ రకమైన అణచివేత విధానాలతో పాటు, నేరస్థులను కొరడాలతో కొట్టడం, కాల్చిచంపేయడం వంటి బహిరంగస్థలాల్లో శిక్షల అమలుకూడా తాలిబాన్ ఆరంభించింది. ఈ చర్యలన్నీ అంతర్జాతీయ సమాజానికి తనను దూరం చేస్తాయని దానికి తెలుసు. దాని గత పాలనను గుర్తించిన సౌదీ అరేబియా, ఎమిరేట్స్, పాకిస్థాన్ వంటివి కూడా ఇప్పుడు గుర్తించనిరాకరిస్తున్నాయి. అన్ని విలువలూ పాటిస్తూ అంతర్జాతీయ సమాజాన్ని కష్టపడి మెప్పించడం కంటే నొప్పించి గుర్తింపు సాధించవచ్చునని తాలిబాన్ అనుకుంటున్నదేమో తెలియదు. పాకిస్థాన్ తో గతంలో ఉన్న సయోధ్య కూడా ఇప్పుడు లేదు. అమెరికా ఉన్నపళంగా అఫ్ఘాన్ లో తన దుకాణం మూసివేసి వెళ్ళిపోయినప్పుడు భారత్ వెనకన ఉండిపోయి, పాకిస్థాన్ చక్రం తిప్పిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు అఫ్ఘాన్–పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉభయదేశాల మధ్యా నిత్యం ఘర్షణలు జరుగుతున్నాయి. తెహ్రీక్ ఇ తాలిబాన్ పాకిస్థాన్ (టీటీపీ) తిరిగి పాక్ సైన్యం మీద విరుచుకుపడుతున్నది. గురువారం ఈ సంస్థ పాకిస్థాన్ కౌంటర్ టెర్రరిజం కేంద్రంమీద దాడిచేసి కొంతమందిని నిర్బంధిస్తే ఆర్మీ వారిని కాల్చిచంపింది. ఇక, ఉక్రెయిన్ యుద్ధం సృష్టించిన సంక్షోభంలో పాశ్చాత్య ప్రపంచం మునిగిపోయి ఉన్నందున తాలిబాన్ ను ప్రశ్నించేవారే లేకపోయారు. దీనితో అది క్రమంగా ముప్పైయేళ్ళనాటి భయానకమైన పాలనవైపు మళ్ళిపోతున్నది. గత రెండు దశాబ్దాల్లో అఫ్ఘానిస్థాన్ సామాజికంగా సాధించుకున్న ప్రగతిని ధ్వంసం చేస్తున్నది. ‘దోహా’ చర్చల్లో చేసిన అన్ని ప్రమాణాలను, ఇచ్చిన హామీలను వమ్ముచేసింది. భారతదేశంతో సహా కనీసం ఓ డజను దేశాలు తాలిబాన్ పాలనను అధికారికంగా గుర్తించకపోయినా సంబంధాలు కొనసాగిస్తున్నాయి. పలురకాల సరఫరాలతో భారత్ ఇతోధికంగా సాయపడుతూ, పాకిస్థాన్ తో దానికి పెరిగిన దూరాన్ని సానుకూలంగా ఉపయోగించుకుంటున్నది. అఫ్ఘానిస్థాన్ ప్రజలను తాలిబాన్ కరుణాకటాక్షాలకు వదిలేయకుండా దారినపెట్టడానికి అంతర్జాతీయ సమాజంతో పాటు భారతదేశం కూడా విశేషంగా కృషిచేయాల్సిన అవసరం ఉన్నది. తాలిబాన్ అక్కడున్న కారణంగా, ఉభయదేశాల, ప్రజల మధ్య దశాబ్దాలుగా ఉన్న సత్సంబంధాలు నశించిపోవడం సరికాదు.
Updated Date - 2022-12-23T03:59:22+05:30 IST