RK: ఏపీకి లాస్ట్ చాన్స్!
ABN, First Publish Date - 2022-11-20T00:56:00+05:30
2024లోజరిగే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అవుతాయని, ఆ విషయం దృష్టిలో ఉంచుకొని ప్రజలు తీర్పు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు..
2024లోజరిగే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అవుతాయని, ఆ విషయం దృష్టిలో ఉంచుకొని ప్రజలు తీర్పు ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్య చేశారో గానీ అధికార వైసీపీ నాయకులు సంబరపడిపోతున్నారు. తన రాజకీయ జీవితానికి ఇవే చివరి ఎన్నికలు అని చంద్రబాబే స్వయంగా ఒప్పుకొన్నారు కనుక ఆయన ఇప్పుడే విశ్రాంతి తీసుకుంటే మంచిదనే ధోరణిలో సకల శాఖా మంత్రి సజ్జలతో పాటు కొంత మంది మంత్రులు అభిలషించారు. నిజానికి చంద్రబాబు యాదృచ్ఛికంగా ఆ వ్యాఖ్యలు చేశారో? లేక ఉద్దేశపూర్వకంగా అన్నారో తెలియదు గానీ వాస్తవం కూడా అదే. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి రాకపోతే ఆ తర్వాత 2029లో జరిగే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయనకు వయసు సహకరించకపోవచ్చు. అప్పటికి ఆయనకు 80 ఏళ్లు వస్తాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు అవసరం ఉందా? లేదా? రాజకీయాల నుంచి ఆయన తప్పుకొంటే ఇక తమకు తిరుగు ఉండదని వైసీపీ నాయకులు ఎందుకు సంబరపడిపోతున్నారు? చంద్రబాబును చూసి అధికార పార్టీ భయపడుతోందా? ఆయన రాజకీయాల్లో లేకపోతే రాష్ట్రంలో రాజకీయ శూన్యతను భర్తీచేసే వారే ఉండరా? వంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతాయి. పద్నాలుగేళ్లపాటు ముఖ్యమంత్రిగా, దాదాపు పదిహేనేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు రికార్డును ఎవరూ తుడిచెయ్యలేరు. ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరుకుంటున్నట్టు ఆయన సుదీర్ఘకాలం ఆ పదవిలో కొనసాగినా ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా, పదేళ్లు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నెలకొల్పిన రికార్డును ఆయన చెరిపేయలేరు. దీన్నిబట్టి తెలుగునాట చంద్రబాబుకు రాజకీయాలలో సమవుజ్జీలు ఎవరూ లేరు.. ఉండబోరు.. అని చెప్పవచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా చంద్రబాబు సభలకు జనం పోటెత్తారు. జిల్లాలోని పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి బలమైన అభ్యర్థులు కూడా లేరు. అయినా ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ప్రజలలో వచ్చిన, వస్తున్న మార్పునకు ఇది సంకేతం కావొచ్చు. అనూహ్యంగా తండోపతండాలుగా పూనకం వచ్చినట్టు తరలివచ్చిన జనాన్ని చూసి వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అవుతాయి కనుక ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు అని ఉంటారు. ఇందులో వైసీపీ నాయకులు సంబరపడిపోవడానికి ఏముందో తెలియడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు అవసరం ఉందా? చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ అవసరం ఉందా? అంటే ఆంధ్రప్రదేశ్‌కే చంద్రబాబు అవసరం ఉంది! అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటూ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్న రాష్ర్టానికి చంద్రబాబు అవసరం ఉందని చెప్పడం పక్షపాతం కాబోదు. ఈ అభిప్రాయంతో కులపిచ్చి, మతపిచ్చితో ఊగిపోతున్నవారు ఏకీభవించకపోవచ్చు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వల్ల ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన మేలు ఏమిటి? అంటే ఠక్కున చెప్పలేని పరిస్థితి ఉంది.
రాష్ర్టాన్ని అప్పులపాల్జేస్తూ బటన్లు నొక్కడం ద్వారా ప్రజలకు డబ్బు పంచడం బాధ్యత గల ప్రభుత్వం చేయాల్సిన పని కాదు. అభివృద్ధి–సంక్షేమం మధ్య సమతూకం పాటించకపోవడం జగన్‌రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అతి పెద్ద తప్పు. అందుకే ప్రభుత్వం ఎంతగా అణచివేతకు పాల్పడుతున్నా, వలంటీర్ వ్యవస్థ ద్వారా నిఘా పెడుతున్నప్పటికీ ప్రజల్లో అసంతృప్తి పెల్లుబుకుతోంది. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని, రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటినా రాజధాని కూడా లేని పరిస్థితి తలెత్తిందని, దుర్బుద్ధితో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భవిష్యత్తు అగమ్యగోచరం అవుతోందని ప్రజలు గుర్తించారు. ఈ నేపథ్యంలో రానున్న ఎన్నికలు చంద్రబాబుకు కాదు–ప్రజల భవిష్యత్తుకు సంబంధించి అత్యంత కీలకం. మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే చంద్రబాబుకు వ్యక్తిగతంగా జరిగే నష్టం ఏమీ లేదు. రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ విధంగానూ సరితూగలేరు గనుక ఆంధ్రప్రదేశ్ మాత్రమే నష్టపోతుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు జరిగే నష్టం ఏమిటి? పోలవరం ప్రాజెక్టుకు, రాజధానికి ఏ గతి పడుతుందో 2019 ఎన్నికల సమయంలోనే వివరిస్తూ ‘ఆంధ్రజ్యోతి’ ప్రజలను హెచ్చరించింది. అయితే దురదృష్టవశాత్తు మేం చెప్పిన హితవాక్యాలు ప్రజలు పట్టించుకోలేదు. యువకుడు, రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇస్తే చంద్రబాబు కంటే గొప్పగా పాలిస్తాడని ప్రజలు భావించారు. అయితే ప్రజలు తనకు ఇచ్చిన మహదావకాశాన్ని కుత్సిత మనస్తత్వంతో జగన్మోహన్ రెడ్డి చేజార్చుకుంటున్నారు. సంక్షేమం మాటున దోపిడీకి తెర తీశారు. రాష్ట్ర ఆదాయం పెరగకపోగా తగ్గుతోందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి స్వయంగా అంగీకరించడాన్ని బట్టి జగన్ పాలన ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్పులు చేయడం మినహా ఫలానా రంగంలో జగన్ ప్రభుత్వం పనితీరు గొప్పగా ఉందని చెప్పలేని పరిస్థితి. అయినా జగన్ అండ్ కోకు తమ పాలన బ్రహ్మాండంగా ఉన్నట్టుగానే అనిపిస్తోంది. అందుకే వచ్చే ఎన్నికల గండం గట్టెక్కగలిగితే ఇక తమకు తిరుగుండదని, చంద్రబాబు బెడద తప్పిపోతుందని వారు సంబరపడుతుండవచ్చు. నిజమే! వచ్చే ఎన్నికల్లో కూడా గెలిస్తే జగన్ సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగవచ్చు. అయితే దానివల్ల రాష్ర్టానికి ఒనగూరే ప్రయోజనం ఏమిటి? జగన్మోహన్ రెడ్డి ఏళ్ల తరబడి అధికారంలో కొనసాగడమా? రాష్ట్రం బాగుపడటమా? ఏది ముఖ్యం అన్నది ప్రజలే నిర్ణయించుకోవాలి. ఈ ఉద్దేశంతోనే ఇవే తనకు చివరి ఎన్నికలు అని చంద్రబాబు అని ఉంటారు. ప్రజా నాయకుడికి, రాజకీయ నాయకుడికి మధ్య ఉండే తేడాను బహమాస్ దేశానికి చెందిన ప్రముఖ ఎవాంజలిస్ట్ మైల్స్ మున్రో చాలా ఏళ్ల క్రితమే చెప్పారు. 2014లో జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందిన మున్రో అసలైన నాయకులను ఎలా గుర్తించాలో కూడా చెప్పారు. తదుపరి జరిగే ఎన్నికల గురించి ఆలోచించేవాడు పొలిటీషియన్ అని, భావితరాల గురించి ఆలోచించేవాడు నాయకుడని ఆయన వివరించారు. ఎన్నికల సందర్భంగా తమ వద్దకు వచ్చే వారిని మీరు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు? ఇప్పటికిప్పుడు మాకు వ్యక్తిగత లబ్ధి చేకూర్చడం కాదు, మా పిల్లల భవిష్యత్తు మెరుగ్గా ఉండటానికి ఏం ఆలోచిస్తున్నారు? మీ వద్ద ఉన్న ప్రణాళికలు ఏమిటి? అని ప్రశ్నించాలని మైల్స్ మున్రో స్పష్టంగా వివరించి చెప్పారు. నాయకులు అనుచరులను కోరుకోరు, నాయకులను చూసి అనుచరులే ఆకర్షితులవుతారని కూడా ఆయన చెప్పారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోవచ్చు గానీ ఆయన చెప్పిన మాటలు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కచ్చితంగా వర్తిస్తాయి. తాను సుదీర్ఘకాలం అధికారంలో ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలి. తాను అధికారంలో కొనసాగితే భావితరాల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని ఆయన చెప్పగలరా? ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత దుస్థితిని గమనిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలో కొనసాగడం వల్ల రాష్ర్టానికి మేలు జరుగుతుందని నమ్మే పరిస్థితి లేదు. సంక్షేమం మాటున దోపిడీకి మాత్రమే అధికారం అనేది జగన్‌కు ఉపయోగ పడవచ్చు గానీ ప్రజల జీవితాలను బాగు చేసే దిశగా ఆయన ఉన్నతంగా ఆలోచిస్తారని చెప్పలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూడటం కోసం తమ భవిష్యత్తును బలి చేసుకోవడమా? లేదా? అన్నది తేల్చుకోవాల్సింది ఇప్పుడు ప్రజలే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ప్రకటనను చూడాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబును వదులుకుంటే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రమే. చంద్రబాబు రాజకీయాలతో చాలా మంది విబేధించవచ్చు గానీ, అభివృద్ధి విషయంలో ఆయన చిత్తశుద్ధిని శంకించలేని పరిస్థితి.
ప్రజా జీవితంలో అప్రతిష్ఠను మూటగట్టుకోకూడదన్న పట్టింపుతో ఉండటం వల్ల రాజకీయంగా ఆయన తీసుకొనే నిర్ణయాలు పిరికితనంతో కూడుకున్నవిగా కనిపిస్తాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా వ్యక్తిగతంగా తనకు చెడ్డపేరు రాకూడదన్న ఉద్దేశంతో భయం భయంగా ఉంటారు. చంద్రబాబు కూడా అవసరానికి మించి జాగ్రత్తలు తీసుకుంటారు. తెగింపుతో నిర్ణయాలు తీసుకోవడం ఆయనకు అలవాటు లేదు. అదే అభివృద్ధికి సంబంధించిన విషయాలలో ఎన్ని విమర్శలు ఎదురైనా ఖాతరు చేయరు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మాణానికి అంకురార్పణ చేసినప్పుడు విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. అప్పడు భయపడి ఉంటే సైబరాబాద్ నిర్మితమై ఉండేది కాదు. అయితే తన అభివృద్ధి మోడల్ వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యేలా వివరించడంలో విఫలం అవడం వల్ల రాజకీయంగా చంద్రబాబు నష్టపోతున్నారు. ప్రజలను తనతోపాటు ముందుకు నడిపించాల్సిన చంద్రబాబు తాను మాత్రమే పరిగెత్తారు. దీంతో ఆయన ఆలోచనలను అర్థం చేసుకోలేక ప్రజలు దూరమవుతున్నారు. అయితే ఆయన ఆలోచనలు మాత్రం అభివృద్ధి రూపంలో ఎప్పటికీ సాక్షాత్కారమిస్తాయి. వాటి ఫలాలను తర్వాతి తరం అనుభవిస్తోంది. హైదరాబాద్‌లో జీఎంఆర్ అంతర్జాతీయ విమానాశ్రయం గానీ, ఔటర్ రింగ్ రోడ్డు గానీ, సైబరాబాద్ గానీ ఆయన ఆలోచనలే. రాష్ట్రం విడిపోయినా హైదరాబాద్‌లో నెలకొల్పిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో జరుగుతున్న కార్యక్రమాలకు చంద్రబాబును ముఖ్య అతిథిగా ఆహ్వానించారంటే ఆయనకు అంతకంటే సంతృప్తి ఏముంటుంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కూడా తాను కన్న కలలను ప్రజలకు వివరించడంలో ఆయన విఫలమయ్యారు. అందుకే అమరావతితో ప్రజలు కనెక్ట్ కాలేదు. అదే సమయంలో ప్రతిపక్షం అమరావతిని రాజకీయంగా వాడుకుంది. రాయలసీమలో పరిశ్రమలు, వ్యాపార సంస్థలు ఏర్పాటు చేయడం ద్వారానే అభివృద్ధి చేయగలమని నమ్మిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఆ దిశగా అడుగులు వేశారు. అయితే తమవాడు అధికారంలో లేకుండా పోయాడన్న బాధతో కొంతమంది ఎప్పటికప్పుడు రాయలసీమ వెనుకబాటుతనాన్ని తెర మీదకు తెస్తూ వచ్చారు. పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు రాకపోయినా ఫర్వాలేదు కర్నూలుకు హైకోర్టు వస్తే చాలు అభివృద్ధి జరిగినట్టేనని ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే వారు ఆ ప్రాంతీయ విద్వేషాలకే బలవుతారని నీలం సంజీవ రెడ్డిని ఉద్దేశించి నాటి ప్రతిపక్ష నేత తరిమెల నాగిరెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడ–గుంటూరు మధ్య ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని అప్పుడు నాగిరెడ్డి బలంగా వాదించారు. తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులును రాజకీయంగా దెబ్బతీయడం కోసమే కర్నూలును నీలం సంజీవరెడ్డి తెర మీదకు తెస్తున్నారని నాగిరెడ్డి అప్పుడు విమర్శించారు. సంజీవరెడ్డికి నాగిరెడ్డి స్వయంగా బావమరిది కావడం విశేషం. వర్తమానానికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో ఆంధ్రప్రదేశ్ భ్రష్టు పట్టి పోతున్నదని మెజారిటీ ప్రజలు అంగీకరిస్తారు. అయితే వివిధ కారణాల వల్ల చంద్రబాబుతో విభేదించేవారు ఆయన నాయకత్వాన్ని మాత్రం స్వాగతించలేకపోతున్నారు. ఉమ్మడి ప్రయోజనాలను వ్యక్తిగత వైషమ్యాలు డామినేట్ చేస్తున్నాయి. ఫలితంగా ఆంధ్రప్రదేశ్ కునారిల్లుతోంది. ఈ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కే చంద్రబాబు అవసరం ఉందని చెప్పడానికి వెనుకాడ్డం లేదు. ఇవే తనకు చివరి ఎన్నికలని చంద్రబాబు నోరుజారి అన్నారని భావించడానికి కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన, బీజేపీలతో పొత్తు ఉంటుందో లేదో కూడా తెలియదు. ఆ పార్టీలతో పొత్తు ఉన్నా లేకపోయినా సొంతంగా తెలుగుదేశం పార్టీని విజయ తీరాలకు చేర్చడం కోసం సెంటిమెంటును జోడించి ఆయన ఈ వ్యాఖ్య చేసి ఉంటారు.
బీజేపీ.. ఎందుకు ఎలా?
ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, కొంతమంది భారతీయ జనతా పార్టీ నాయకుల ధోరణుల గురించి చర్చించుకుందాం. తెలంగాణలో మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఎందుకు బలపడటం లేదని ప్రధాని నరేంద్ర మోదీ తమ పార్టీ నాయకులను ప్రశ్నించారు. నిజానికి కారణం తెలిసి కూడా ప్రధాని ఆ ప్రశ్న వేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చార్జిషీటు తయారు చేయవలసిందిగా బీజేపీ కోర్ కమిటీ సభ్యులకు ప్రధాని దిశానిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డిపై అవినీతి కేసులలో దాఖలైన చార్జిషీట్లకే దిక్కు లేకుండా ఉంది. ఇప్పుడు ప్రభుత్వంపై చార్జిషీటు రూపొందిస్తే ప్రయోజనం ఏమిటి? అన్న వ్యాఖ్యలు ఆ వెంటనే వినిపించాయి. ప్రధానితో తనకు ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకొన్నారు. బీజేపీ కోర్ కమిటీలోని మెజారిటీ సభ్యులు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండాలని కోరుకుంటున్నారు. అయితే ఆ పార్టీ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభృతులు తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండనే ఉండదని ప్రకటిస్తున్నారు. ప్రధాని విశాఖ పర్యటనను విజయవంతం చేయడానికి అధికార వైసీపీ సర్వశక్తులూ ఒడ్డిన విషయం అందరికీ తెలిసిందే. ప్రధాని కన్నెర్ర చేస్తే తన రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందో జగన్‌కు స్పష్టంగా తెలుసు కనుక అందుకు అనుగుణంగానే ఆయన నడుచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వాన్ని ఉపేక్షించవద్దని ప్రధాని చెప్పిన మాటలను పార్టీ రాష్ట్ర నాయకులు సీరియస్‌గా తీసుకోవడం లేదు. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు శకం ముగుస్తుందని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా దెబ్బకొట్టి రాష్ట్రంలో జెండా పాతుదామని నరేంద్ర మోదీ భావిస్తున్నారు. అయితే 2029 వరకు వేచి ఉండే పరిస్థితిలో రాష్ట్ర నాయకులు లేరు. 2029 నాటికి ప్రధాని మోదీకి కూడా 80 ఏళ్లు వస్తాయి. అప్పటికి ఆయన పరిస్థితి ఏమిటో తెలియదు. తమకు కూడా వయసు మీదపడుతోంది కనుక 2024 ఎన్నికలు కాదనుకుంటే 2029 వరకు వేచి ఉండే పరిస్థితిలో తాము లేమని బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీలోని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీ అవసరం లేదు. జనసేన పార్టీతో పొత్తు ఉంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు సునాయాసం అవుతుంది. అయితే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ అక్రమాలకు పాల్పడకుండా నిరోధించడం కోసం బీజేపీ సహకారం అవసరం అన్న అభిప్రాయంతో తెలుగుదేశం ముఖ్యులు ఉన్నారు. దీన్ని బలహీనతగా తీసుకొని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వంటి వారు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోబోమని అంటూ ఉంటారు. వీర్రాజు వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలో లేదో తెలియని పరిస్థితి. ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా సహకరించాల్సిందిగా తెలుగుదేశం నాయకులను బీజేపీ కేంద్ర పెద్దలు కోరడం గమనార్హం. ఒక్క మాటలో చెప్పాలంటే రాష్ట్రంలో ప్రధాన పార్టీలు అయిన వైసీపీ, తెలుగుదేశం పార్టీలతో ఏ మాత్రం బలం లేని బీజేపీ ఆడుకుంటోంది. రాష్ర్టానికి సంబంధించిన ప్రధాన సమస్యల గురించి విశాఖ పర్యటన సందర్భంగా ప్రధాని మాట మాత్రంగానైనా ప్రస్తావించలేదు. అయినా ఈ రెండు పార్టీలూ నోరు ఎత్తలేదు. అదే సమయంలో తెలంగాణలో పర్యటించిన ప్రధాని మోదీ సింగరేణిని ప్రైవేటీకరించే విషయంలో సంజాయిషీతో కూడిన ధోరణిలో మాట్లాడారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడంలో వెనుకాడని ప్రధాని మోదీ, సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచన కూడా తమకు లేదని, ఆ సంస్థలో మెజారిటీ వాటా రాష్ట్ర ప్రభుత్వానిదే అయినప్పుడు కేంద్రం ఎలా నిర్ణయం తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. అదే విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే విషయంలో ప్రధాని నోరు విప్పి మాట్లాడకపోయినా అదే వేదికపై ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవసరానికి మించి యుద్ధం చేస్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి సొంత అవసరాల కోసం అవసరానికి మించి విధేయత ప్రకటించుకుంటున్నారు. చంద్రబాబుది కూడా ఇదే పరిస్థితి. అయితే కర్నూలు పర్యటనలో ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో చంద్రబాబులో ఆత్మవిశ్వాసం ఏర్పడి ఉంటుంది. అందుకే మూడు రాజధానుల గురించి ఆదోని వచ్చి మాట్లాడే దమ్ము ముఖ్యమంత్రికి ఉందా అని జగన్‌ను సవాలు చేశారు. పొత్తు విషయంలో బీజేపీ పెద్దలు దాగుడుమూతలు ఆడటంపై కినుకతో ఉన్న చంద్రబాబు, ఆ పార్టీకి కూడా హెచ్చరిక పంపాలన్న ఉద్దేశంతోనే వచ్చే ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అని సెంటిమెంట్ అస్ర్తాన్ని వదిలారని చెబుతున్నారు. పొత్తుల తకరారు తేలినా తేలకపోయినా జగన్మోహన్ రెడ్డి కావాలో, చంద్రబాబు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వచ్చింది. తమ భవిష్యత్తు గురించి ప్రజలు సరైన నిర్ణయం తీసుకోవడానికి వచ్చే ఎన్నికలే చివరి అవకాశం. 2024లో కూడా జగన్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను దేవుడు కూడా బాగుచేయలేడు. వేంకటేశ్వరస్వామి, అల్లా, ఏసుక్రీస్తు ఒక్కటై ముఖ్యమంత్రిగా అవతరించినా ఆంధ్రప్రదేశ్‌ను మరమ్మతు చేయలేరు. ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు ఉన్నంత మాత్రాన రాజకీయంగా కూడా మిత్రత్వం ఉంటుందని భావించవద్దని ప్రధాని మోదీ విశాఖలో తమ పార్టీ నాయకులకు చెప్పడం వినడానికి బాగానే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత అవసరమే. అయితే కట్టు తప్పిన రాష్ట్ర ప్రభుత్వాలను ఆ విషయం తెలిసి కూడా ప్రోత్సహిస్తే కేంద్రం కూడా బాధ్యతారహితంగా వ్యవహరించినట్టే అవుతుందని ప్రధాని మోదీ గమనించాలి. అడ్డగోలు అప్పులకు సహకరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అధోగతిపాలు కావడంలో కేంద్రం పాత్ర కూడా ఉందని జరుగుతున్న ప్రచారానికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాల్సి ఉంది. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చకపోయినా అడిగేవారు లేరన్న భరోసాతో రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి తోసేస్తే వాటిని జగన్ లేదా నరేంద్ర మోదీ తీర్చరు కదా? సంకుచిత రాజకీయ అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం కూడా పాకులాడితే దేశం కూడా అధోగతిపాలవుతుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జనసేనాని పవన్ కల్యాణ్‌ది కూడా కీలక పాత్ర. విశాఖలో ప్రధానమంత్రిని కలిసి ఏమి మాట్లాడారో తెలియదు. ప్రధానిని కలిసి వచ్చిన తర్వాత విలేకరులతో మాట్లాడుతున్నప్పుడు పవన్ కల్యాణ్ ముఖకవళికలను గమనించిన వారికి మాత్రం ఆ సమావేశం జనసేనానికి సంతృప్తిని ఇవ్వలేదన్న అభిప్రాయం కలిగింది. చంద్రబాబుపై ప్రధాని మోదీ ఆగ్రహంగా ఉంటే ఉండవచ్చు. నరేంద్ర మోదీ చెప్పినంత మాత్రాన, ఆయన సూచించిన వారికి ఓట్లు వేసే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరు. కేంద్రంలో అధికారంలో ఉండి ఉండకపోతే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి? అన్నది ఆ పార్టీ నాయకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. అందరూ అనుకుంటున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ నిజంగానే జగన్ పాలనలో భ్రష్టుపట్టి పోయి ఉంటే ప్రజల భవిష్యత్తు కోసమైనా విభేదాలు, వైషమ్యాలు వీడి అందరూ ఒక్క తాటిపైకి రావడం ఇప్పటి అవసరం. అదీ సాధ్యం కాని పక్షంలో ప్రజలే సంఘటితమై తమకు ఏది మంచిది, ఎవరు అధికారంలోకి వస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందో గుర్తించి అందుకు అనుగుణంగా ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాలి. చంద్రబాబు, జగన్, పవన్ కల్యాణ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్నది ముఖ్యం కాదు. రాష్ర్టాన్ని ఎవరి చేతిలో పెడితే రాష్ట్ర భవిష్యత్తు మెరుగ్గా ఉంటుందో ప్రజలే నిర్ణయించుకోవాలి. రానున్న ఎన్నికలు చంద్ర బాబుకు మాత్రమే కాదు, ప్రజలకు కూడా చివరి అవకాశం వంటిదే. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని పక్షంలో ఆ తర్వాత ఎంతగా చింతించినా ప్రయోజనం ఉండదు!
ఆర్కే
Updated Date - 2022-11-20T07:21:50+05:30 IST