బుల్డోజర్ నీతి
ABN, First Publish Date - 2022-11-15T01:07:38+05:30
తమకు ఏది నొప్పి కలిగిస్తుందో, అదే పనిచేసి ఎదుటివారికి నొప్పి కలిగించకూడదని భారతం చెబుతుంది. తాను విమర్శించే చెడును తానే ఆచరించడం దుర్మార్గమని మానవసమాజం తరతరాలుగా నమ్ముతోంది...
తమకు ఏది నొప్పి కలిగిస్తుందో, అదే పనిచేసి ఎదుటివారికి నొప్పి కలిగించకూడదని భారతం చెబుతుంది. తాను విమర్శించే చెడును తానే ఆచరించడం దుర్మార్గమని మానవసమాజం తరతరాలుగా నమ్ముతోంది. అధికారం ఎవరిచేతిలో ఉంటే వారు దౌర్జన్యం చేయవచ్చునని, అధికారం లేనివారు అణగారిపోవలసిందేనని నమ్మితే తప్ప, దేశంలో ఇప్పుడు నడుస్తున్న బుల్డోజర్ల రాజ్యానికి ఎటువంటి సహేతుకత కనిపించదు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నానని ప్రకటనలు చేస్తున్న తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కూడా అవే బిజెపి ప్రభుత్వాలు అనుసరిస్తున్న దౌర్జన్య పద్ధతులనే అనుసరిస్తున్నది. ఈడీ, సిబిఐ,ఎన్ఐఎ, ఐటి వంటి సమస్త విభాగాలను రాజకీయ ప్రత్యర్థుల మీద, వారి బంధుమిత్రుల మీద, వారి ఆర్థిక వనరుల మీద ప్రయోగిస్తూ, బిజెపి భీతావహం సృష్టిస్తున్నదని, అధికార దుర్వినియోగంతో అధర్మయుద్ధం చేస్తున్నదని ఆరోపణలు చేస్తున్నవారు, అటువంటి దుశ్చర్యలకు పాల్పడకుండా ఉండాలి. ఆదివారం నాడు, హైదరాబాద్ లో ఒక హోటల్ ఆవరణలో నగరపాలక సంస్థ అధికారులు జరిపిన కూల్చివేతలు, రాజకీయమైన కారణాలతో జరిగినవని ప్రజలు సులభంగానే అర్థం చేసుకోగలిగారు, అంతేకాదు, అట్లా సులువుగా సందేశం అందడం కోసమే ఆ చర్యలను ఉద్దేశించారు.
ఇక్కడ ఆ హోటల్ ఎవరిది అన్న ప్రశ్న ప్రభుత్వానికి ముఖ్యం కావచ్చు. ఎవరిదైనా సరే అటువంటి పద్ధతి సరికాదు అని నమ్మేవారికి అది ముఖ్యం కాదు. హోటల్ నిర్వాహకుడు నందకుమార్, ఇటీవలి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడుగా నిర్బంధంలో ఉన్నవ్యక్తే అయి ఉండవచ్చు. టిఆర్ఎస్ ప్రభుత్వం చెబుతున్నట్టు, కొనుగోలుకుట్ర అంతా నిజమే అయి ఉండవచ్చు, అందుకు ఈ నందకుమార్ సంధానకర్త కూడా అయి ఉండవచ్చును. అయినప్పటికీ, కూల్చివేత సక్రమం కాదు. ఆ హోటల్ స్థల యజమానికి, నిర్వాహకులకు మధ్య వివాదం ఉండవచ్చు. కొత్తగా నిర్మాణాలపై నోటీసులు ముందే జారీ అయి ఉండవచ్చు. అయినా, జరిగిన సమయసందర్భం రీత్యా, కూల్చివేత చర్యకు రాజకీయ అర్థమే కనిపిస్తుంది. న్యాయజోక్యం కష్టతరమైన ఆదివారంనాడు, హడావిడిగా జరిగిన బుల్ డోజర్ చర్య ప్రభుత్వానికి అప్రియమైనవారందరికీ ప్రతీకారంగానో, హెచ్చరికగానో ఉద్దేశించినదే. బహుశా, ఇదొక పద్ధతిగా కొనసాగవచ్చును కూడా.
ఉత్తరాది బిజెపి ప్రభుత్వాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మైనారిటీల మీద బుల్ డోజర్లను గురిపెట్టడం మొదలుపెట్టింది. అది ఢిల్లీకి పాకింది. మధ్యప్రదేశ్ లోనూ సంధించింది. ఆందోళనలో, నిరసనలో ఏవో జరిగిన సందర్భాలలో, గుడిసెలు, ప్రభుత్వమే కట్టించి ఇచ్చిన సంక్షేమ గృహాల వంటి ఆందోళనకారుల ఆస్తుల మీద బుల్ డోజర్లు నడిచాయి. అన్ని సందర్భాలలోనూ ఏవో పెండింగ్ నోటీసులు ఉన్నాయి. అక్రమనిర్మాణాలు అంటూ స్థానిక సంస్థలు ఏవో కారణాలు చూపిస్తూనే కూల్చివేతలు చేశాయి. అంతా చట్టబద్ధంగా కనిపించినా, అందులో ప్రభుత్వాలు, ఆందోళనకారులకు, ముఖ్యంగా మైనారిటీలకు ఒక హెచ్చరికను అందించాయి. బుల్డోజర్ విజృంభణలపై చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. ఈ పద్ధతి తప్పు అని చెప్పాక కాస్త ఆ ధోరణి వెనక్కి తగ్గింది. ఈ లోపల, బిజెపి అభిమానులు, బుల్ డోజర్ ను ఒక సానుకూల ప్రతీకగా పరిగణిస్తూ, దేశమంతా బుల్ డోజర్ ప్రభుత్వాలు రావాలని మాట్లాడడం మొదలుపెట్టారు. బుల్ డోజర్ విధానాన్ని కనిపెట్టిన పార్టీ తన రాష్ట్రంలో విస్తరించకూడదు కానీ, బుల్డోజర్ ప్రవేశానికి అడ్డేమీ లేదని టిఆర్ఎస్ ప్రభుత్వం భావిస్తున్నట్టుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ విచికిత్సే అవసరం లేదు. అక్కడ బిజెపిపై పోరాటమూ నియంతృత్వమూ వంటి పదజాలాలేమీ లేవు. అందువల్ల, యోగి ఆదిత్యనాథ్ కంటె ముందే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూల్చివేతల ఉద్యమం మొదలుపెట్టింది. అధికారంలోకి రావడంతోటే చంద్రబాబు హయాంలో కట్టిన ప్రజావేదిక కూల్చివేతతో ఎపిలో బుల్డోజర్ పాలన మొదలయింది. మునుపటి ప్రభుత్వం ఆనవాళ్లు ఏమీ ఉండకూడదంటూ, నలభైకి పైగా నిర్మాణాలను కూల్చివేసిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి. మొన్నటికి మొన్న భూ ఆక్రమణల ఆరోపణలు సాకుగా తీసుకుని, మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి మీదకు మూడువందల మంది పోలీసులతో, జెసీబీలతో దాడి చేసి, ఇంటి ప్రహరీని కూల్చివేశారు. వంటింటి దాకా పొక్లెయిన్ రాకాసిపార వెళ్లింది కానీ, ఆఖరినిమిషంలో ఆగిపోయింది. గీతం యూనివర్సిటీలో ప్రభుత్వ భూమి ఉన్నదన్న ఆరోపణలతో ప్రధాన ప్రవేశద్వారం కూల్చివేత కూడా ఇట్లాగే జరిగింది. మాజీ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు, పీలా గోవింద్ వంటివారి వాణిజ్య ఆస్తుల మీద కూల్చివేత అస్త్రాలు ప్రయోగించారు. వీరందరి మీదా ఏవో ఆరోపణలు, కేసులు ఉండి ఉండవచ్చు. కానీ, ఆయా స్థానిక సంస్థల కూల్చివేతల బృందాలను కదిలించింది మాత్రం అధికార రాజకీయాల దుర్మార్గమే.
ఈ యంత్రభూతాలను ప్రయోగించడం తెలంగాణలో కూడా మొదటిసారేమీ కాదు. సమాజంలో గౌరవాదరాలు కలిగినవిమర్శకుల ఇళ్లను బద్దలు కొట్టి, అరెస్టులు చేయడం వంటి విధానాలను అనుసరించే అధికారులు, సామాన్యప్రజల విషయంలో, అందులోనూ ఆదివాసీల విషయంలో ఎంత నాగరికంగా ఉంటారో ఊహించుకోవచ్చు. భద్రాద్రి కొత్తగూడెంలోని కొన్ని ఆదివాసీ గూడేలలో గొత్తి కోయలను అదుపు చేసేందుకు, ఈ మధ్య అధికారులు జెసీబీలు ప్రయోగించారు. తాము వ్యవసాయం చేస్తున్న పొలాల వైపు ఆదివాసులను వెళ్లకుండా చేయడానికి జేసీబీలతో కందకాలు తవ్వారు.
విలువల పోరాటం, ధర్మయుద్ధం చేస్తున్నామని చెప్పుకునేవారు ముందు తాము ఆదర్శంగా నిలబడాలి. తమ మనుషులను కొంటున్నారని బాధపడేవారు, తాము స్వయంగా ఎవరినీ కొనవద్దు, తాము అమ్ముడుపోవద్దు. కేంద్రంలోను, అనేక రాష్ట్రాలలోను బిజెపి ప్రభుత్వాలు అనుసరించిన కొన్ని పద్ధతులు అన్యాయమైనవి. కానీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అవే తానులోని ముక్కలని చెప్పుకోకతప్పదు.
Updated Date - 2022-11-15T01:07:44+05:30 IST