నియామకాల్లో డొల్లతనం
ABN, First Publish Date - 2022-11-25T02:30:51+05:30
కేంద్రఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకంలో ప్రభుత్వం చూపిన అత్యుత్సాహం, అనూహ్యవేగం సుప్రీంకోర్టును ఆశ్చర్యపరచడం సహజం....
కేంద్రఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకంలో ప్రభుత్వం చూపిన అత్యుత్సాహం, అనూహ్యవేగం సుప్రీంకోర్టును ఆశ్చర్యపరచడం సహజం. గురువారం న్యాయస్థానంలో జరిగిన వాదోపవాదాల సందర్భంలో, కేవలం ఇరవైనాలుగుగంటల వ్యవధిలోనే గోయల్ నియామకం జరిగిన తీరును న్యాయమూర్తులు గట్టిమాటలతోనే ప్రశ్నించారు. భర్తీకి సంబంధించిన ఫైళ్ళను సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించడమే ప్రభుత్వానికి నిజానికి ఎదురుదెబ్బ. ఒకపక్క, సీఈసీ, ఈసీల నియామకాల ప్రక్రియపై దాఖలైన పిటిషన్లపై వారంరోజులుగా విచారణ కొనసాగుతున్న స్థితిలో, ప్రభుత్వం ఇలా ఓ ఎన్నికల కమిషనర్ ను నియమించడం న్యాయమూర్తులకు ఆగ్రహం కలిగించడం సహజం. పైగా, ఇప్పుడు ప్రభుత్వం భర్తీ చేసిన స్థానం ఆర్నెల్లుగా ఖాళీగా ఉంది. పంజాబ్ కేడర్ కు చెందిన ఈ ఐఎఎస్ అధికారి డిసెంబరు 31న రిటైర్ కావలసి ఉండగా, నవంబరు 18న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు, మరునాడు ఎన్నికల కమిషనర్ గా నియమితులైనారు. మరో నలభైరోజుల్లో రిటైర్ కావాల్సిన ఓ అధికారిని ఇంత హడావుడిగా తెచ్చి పదవిలో కూచోబెట్టడం న్యాయమూర్తులకే కాదు, సామాన్యులకు కూడా ఆశ్చర్యం కలిగించేదే.
‘నాకు తెలిసినంత వరకూ ఒక ప్రభుత్వ అధికారి వీఆర్ఎస్ అభ్యర్థనను ఆమోదించడానికే కనీసం మూడునెలలు పడుతుంది’ అని జస్టిస్ జోసెఫ్ ఆశ్చర్యపోయారు. ఎన్నికల సంఘంలో నియామకాలకు సంబంధించి ఒక విస్తృతమైన అంశం మీద విచారణ జరుగుతున్నప్పుడు, ప్రశాంత్ భూషణ్ ప్రస్తావనగా తెచ్చిన ఒక వ్యక్తిగత నియామకాన్ని పరిశీలనకు ఎలా తీసుకుంటారన్న అటార్నీ జనరల్ వాదన అర్థంలేనిది. తమకు నచ్చినవారిని అధికార పార్టీలు ఎన్నికల కమిషనర్లుగా నియమిస్తున్న ప్రస్తుత విధానాన్ని మార్చాలంటున్న అంశంమీద విచారణ సాగుతున్న దశలోనే ఈ నియామకం జరిగింది. కనుకనే, న్యాయమూర్తులు ఫైళ్ళు అడిగారు. నిబంధనలమేరకే నియామకం జరిగిందనీ, అక్రమాలు జరగలేదనీ వాదిస్తున్నప్పుడు ఫైళ్ళు సమర్పించడానికి ప్రభుత్వానికి భయమెందుకన్న న్యాయమూర్తుల ప్రశ్న సముచితమైనది.
కీలకమైన గుజరాత్, హిమాచల్ ఎన్నికల ముందు ఈ భర్తీ జరిగింది కనుక విపక్షాలు దీనిని ప్రశ్నించడం, సామాన్యుల్లోనూ అనుమానాలు రేగడం సహజం. కేసు నడుస్తున్నదంటూ నిరీక్షించడం ప్రస్తుత పాలకుల స్వభావానికి విరుద్ధమైనది. నియామకాలమీద మీరు స్టే విధించలేదు కదా అని అటార్నీ అమాయకంగా ప్రశ్నిస్తున్నారు కానీ, కేసు నడుస్తున్న కాలంలో తాము హడావుడిగా గోయల్ ను నియమించడం నైతికంగా సరైనది కాదనీ, న్యాయస్థానాన్ని సవాలు చేసినట్టు అవుతుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలకు తెలియకపోదు. కానీ, ఈ న్యాయాన్యాయాల కంటే ఇతరత్రా రాజకీయ అవసరాలు, కీలకమైన గుజరాత్ ఎన్నికల్లో విజయం వారికి ప్రధానం. ఒక విధంగా గోయల్ ను హడావుడిగా తెచ్చి కూచోబెట్టడం ద్వారా న్యాయస్థానాలకే కాదు, ప్రజలకు కూడా ఈ ఉన్నతమైన సంస్థలో ఖాళీల భర్తీ ఏ ప్రాతిపదికన జరుగుతుందో పాలకులు చెప్పకనే చెప్పారు. కొలీజియం తరహా వ్యవస్థ, ప్రధానన్యాయమూర్తికి కూడా భర్తీ ప్రక్రియలో భాగస్వామ్యం వంటివి తాము ఆమోదించేది లేదన్నది దీని సారాంశం. కొందరు అధికారులు కూచొని ఓ జాబితా తయారుచేయడం, దానిని న్యాయశాఖ పరిశీలించి వడబోయడం, అంతిమంగా ప్రధాని ఆమోదించడం ద్వారా సాగే ఈ నియామక ప్రక్రియలో అధికారపక్షాలు తమకు అనుకూలమైనవారిని నియమించుకొనేందుకు వీలుకల్పిస్తున్నందున దానిని మార్చాలన్నది పిటిషనర్ల అభ్యర్థన. ఎన్నికల కమిషనర్ల నియామకం కొలీజియం విధానంలో జరగాలని 25వ లా కమిషన్ సూచించింది కూడా. చాలా దేశాల్లో ఈ ప్రక్రియ ఎంత పటిష్టంగా, ఏయే వ్యవస్థల భాగస్వామ్యంతో జరుగుతున్నదో కూడా పిటిషనర్లు తెలియచేశారు. రాజకీయ, ప్రభుత్వ జోక్యాలకు అతీతంగా, ఒక చట్టబద్ధమైన ప్రక్రియద్వారా ఈ నియామకాలు జరగాలన్న పిటిషనర్ల, న్యాయమూర్తుల ఆలోచనకు తాను వ్యతిరేకినని ప్రభుత్వం గోయల్ హడావుడి భర్తీతో తేల్చేసింది.
వాదోపవాదాలు ముగించి తీర్పు రిజర్వుచేసిన ఈ కేసులో న్యాయస్థానం అంతమంగా ఏమి చెబుతుందన్నది అటుంచితే, వాదోపవాదాల కాలంలో న్యాయమూర్తులు వేసిన ప్రశ్నలు, చేసిన వ్యాఖ్యలు, అటార్నీ సమాధానాలతో నియామకాల ప్రక్రియలో డొల్లతనం ప్రజలకు బాగానే బోధపడింది. ‘యస్ బాస్’లను తెచ్చి కూచోబెడుతూ, ప్రజాస్వామ్యపరిరక్షణలో కీలకమైన, శక్తివంతమైన ఎన్నికల సంఘాన్ని అత్యంత బలహీనంగా ఉంచడానికి పాలకులు ఎంత గట్టిగా ప్రయత్నిస్తారో తెలుస్తూనే ఉంది.
Updated Date - 2022-11-25T02:30:59+05:30 IST