ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాతీల విజయ రహస్యం

ABN, First Publish Date - 2022-12-14T01:26:13+05:30

గతమూడు దశాబ్దాలుగా గుజరాత్ లో ప్రతీ సార్వత్రక, శాసనసభా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి ప్రవాస గుజరాతీలు అందించిన తోడ్పాటు అవిస్మరణీయమైనది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతమూడు దశాబ్దాలుగా గుజరాత్ లో ప్రతీ సార్వత్రక, శాసనసభా ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ విజయానికి ప్రవాస గుజరాతీలు అందించిన తోడ్పాటు అవిస్మరణీయమైనది. ఒక్క గుజరాత్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా కమలం వికాసంలో ప్రవాసులు నిర్వహించిన పాత్ర ప్రశంసనీయమని బిజెపి అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఇటీవల గుజరాత్, హిమాచల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా పాల్గొంటూనే ప్రవాస గుజరాతీలతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. బిజెపికి సహాయ సహకారాలను అందిస్తున్న ప్రవాసులను అమిత్ షా అభినందించారు. అమెరికాలోని ప్రతీ నలుగురు భారతీయులలో ఒకరు గుజరాతీ కాగా, గల్ఫ్ దేశాలలో విజయవంతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిలో అత్యధికులు గుజరాతీలే. ప్రస్తుతం దేశంలోకెల్లా అగ్రగామి వ్యాపారవేత్తగా వెలుగొందుతున్న గౌతమ్ అదానీ సైతం గల్ఫ్ నుంచే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.

అసలు దేశంలోని మిగిలిన ప్రాంతాల కంటే గుజరాతే మొదటి నుంచీ వలసలకు పెట్టింది పేరు. అరేబియా సముద్ర తీరాన ఉండడంతో ఓడలెక్కి విదేశాలకు వెళ్ళడం అక్కడి నుండే మొదలయింది. ఒక గుజరాతీ నిలదొక్కుకోవడానికి యావత్ గుజరాతీ సమాజం ముందుకు వస్తుంది. ఇంగ్లాండ్ లో న్యాయవిద్యనభ్యసించినా ఒక న్యాయవాదిగా విఫలమై చివరకు స్ధానికంగా చదివిన మరో న్యాయవాది వద్ద గుమాస్తాగిరి చేసిన మోహన్ దాస్ కరంచంద్ అనే ఒక అనామక యువకుడిని ఆఫ్రికా ప్రవాసం, అక్కడి గుజరాతీ సమాజం మహాత్ముడిగా చేసింది. అదే విధంగా, తన అన్న ప్రోద్బలంతో అరబ్బు దేశమైన యమన్ కు వెళ్ళిన ధీరూభాయి అంబానీకి అక్కడి ప్రవాస గుజరాతీలు సహకరించిన కారణంగానే రిలయన్స్ కంపెనీ ఆవిర్భవించి, ప్రస్తుత స్ధాయికి చేరింది. అమెరికా గడ్డపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగత సత్కారాల సభ ఒక చరిత్రాత్మక ఘటనగా చెప్పవచ్చు.

ఇలా ప్రవాస నేపథ్యం ఉన్న గుజరాతీలు తమ స్వంత గడ్డ గురించి పట్టించుకోవడం సహజం. బిజెపికి విరాళాలు ఇవ్వడం తమ కనీస కర్తవ్యమని ప్రవాస గుజరాతీలు భావిస్తారు. బిజెపి విస్తృతంగా ప్రచా రం చేసే ‘గుజరాత్ అభివృద్ధి నమూనా’ నినాదం కూడా ప్రవాస గుజరాతీల సృష్టి. ఎట్టి పరిస్థితులలోనైనా అమెరికాకు వెళ్ళి స్థిరపడడం మాత్రమే జీవిత లక్ష్యంగా గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల యువతలో ఉన్నది. ఆ లక్ష్య సాధనకు సక్రమ లేదా అక్రమ మార్గాలతో సంబంధం లేదు. 2007లో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలుగా ఉన్న కాసీపేట లింగయ్య, సోడెం బాపురావుల కుటుంబసభ్యుల పేర పాస్ పోర్టులు పొంది అమెరికాకు వెళ్ళే ప్రయత్నంలో పట్టుబడ్డ గుజరాతీలు మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. అభివృద్ధిలో సమానవకాశాలు ఉంటే అడ్డదారిలో అమెరికాకు వెళ్ళడానికి యువత ఎందుకు ప్రాధ్యాన్యమిస్తుందనేది అంతుపట్టని విషయం. సూరత్, అహ్మదాబాద్ నగరాల నుంచి విదేశాలకు వచ్చి వ్యాపారాలు చేసే వారి గురించి గొప్పగా చెప్పుకుంటారు. అయితే దంగ్, మహెసనా ఇత్యాది ప్రాంతాల నుంచి వచ్చి, చాలీచాలనీ జీతాలతో వెట్టి చాకిరీ చేసే వారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారనే వాస్తవాన్ని మాత్రం విస్మరిస్తారు.

ఆర్థికంగా వ్యాపారవర్గాలకు ప్రయోజనం చేకూర్చే అభివృద్ధి గుజరాత్ లో జరిగింది కానీ సగటు ప్రజాభివృద్ధి ఇప్పటికీ దేశంలోని పలు ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉన్న విషయాన్ని విస్మరించరాదు. 1990 దశకంలో బేగంపేటలోని విమానాశ్రయంతో పోల్చితే అహ్మదాబాద్ విమానాశ్రయం చాలా వెనుకబడి ఉన్నది. హైదరాబాద్ నుంచి కువైత్, ఒమన్ దేశాలకు అహ్మదాబాద్ మీదుగా విమానాలు రాకపోకలు సాగించేవి. మొదటిసారిగా గుజరాత్ లో మకాం వేసిన అప్పటి బిజెపి ప్రధాన కార్యదర్శి వెంకయ్యనాయుడు ఈ రకంగా నడిచే విమానం ద్వారా ఒకసారి హైదరాబాద్ నుంచి పచ్చళ్ళను తెప్పించుకొన్నారు. ఆ కాలంలో అహ్మదాబాద్ లో ఆగే మన తెలుగు ప్రవాసులు విమానాశ్రయాన్ని లేదా నగరాన్ని చూసి ముక్కున వేలేసుకోనేవారు.

ఆర్థికాభివృద్ధి క్రమంలో సామాజిక సమతుల్యత దెబ్బతిన్నది. సోమనాథ్ మందిరం విధ్వంసం మొదలు స్వతంత్ర భారతదేశ చరిత్రలో తొలిసారి రక్తం ఏరులై ప్రవహించిన 1969 అహ్మదాబాద్ మతకలహాలు, ఆ తర్వాత గోధ్రా అల్లర్లతో దేశ రాజకీయాలను సమూలంగా మార్చింది గుజరాత్ నేల. మతం ఆధారంగా దేశ విభజనకు పట్టుబట్టిన మహమ్మద్ అలీ జిన్నా స్వయాన ఒక గుజరాతీ. ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా విదేశాలలోని గుజరాతీల పట్ల ప్రత్యేక అభిమానాన్ని వ్యక్తం చేసే నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక వారితో పాటు ఇతర ప్రవాస భారతీయులను రాజకీయంగా తన వైపు ఆకర్షించుకోవడంలో సఫలీకృతులయ్యారు. భావోద్వేగ రాజకీయాల ఆధారంగా దేశవిదేశాలలో ఉన్న ఎవరినైనా బిజెపి వదలడం లేదు. అగ్రనాయకత్వంలో ఈ రకమైన ప్రబల ఆకాంక్ష, చిత్తశుద్ధి, దృఢసంకల్పం ఉన్నప్పుడు కమలం వికసించడం సహజమే కదా.

మొహమ్మద్ ఇర్ఫాన్

(ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి)

Updated Date - 2022-12-14T01:26:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising