ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వేషవ్యూహం

ABN, First Publish Date - 2022-11-23T01:22:07+05:30

కర్ణాటకలోని మంగళూరులో ఈ మధ్య జరిగిన పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇతరత్రా అనేక సామాజిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, బాంబుపేలుళ్ల వంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో దేశంలో జరగడం లేదు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్ణాటకలోని మంగళూరులో ఈ మధ్య జరిగిన పేలుళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇతరత్రా అనేక సామాజిక ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, బాంబుపేలుళ్ల వంటి సంఘటనలు ఈ మధ్య కాలంలో దేశంలో జరగడం లేదు. అమాయకులకు హాని కలిగించే హింసాత్మక చర్యలు నిలిచిపోలేదని, ఇంకా అక్కడక్కడా తలెత్తుతూనే ఉన్నాయని తెలిసినప్పుడు కలవరం కలగడం సహజం. ఆ మధ్య తమిళనాడులో కోయంబత్తూరులో కారులో పేలుడు సంభవించి ఒకరు మరణించిన సంఘటనను కూడా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఎ కు అప్పగించారు. ఇవన్నీ ఇస్లామిక్ ఉగ్రవాదానికి సంబంధించిన సంఘటనలుగా భద్రతాసంస్థలు అనుమానిస్తున్నాయి. ప్రపంచమంతటా తగ్గుముఖం పట్టినా భారతదేశంలో ఇంకా ఉగ్రవాదాన్ని ఆశ్రయించేవారున్నారంటే, అందుకు కారణాలేమిటో శోధించి, మూలానికి తగిన చికిత్స చేయాలి. జరుగుతున్న సంఘటనల సందర్భం ఏమిటో కూడా దృష్టిలో పెట్టుకోవాలి.

దేశంలో ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూ ఉండడం, ఎన్నికల వాతావరణాన్ని ఈ హింసాత్మక ఘటనలు ప్రభావితం చేసే అవకాశం ఉండడం మరింత భయం పుట్టిస్తున్న పరిణామాలు. గత ఐదారేళ్లుగా సాధారణ ఎన్నికలుకానీ, రాష్ట్రాల ఎన్నికలు కానీ జరుగుతున్న సమయాల్లో, ఏదో ఒక సామాజిక ఉద్రిక్తతలకు సంబంధించిన అంశం, ముఖ్యంగా మతవిభేదాలను ప్రజ్వలింపజేసే అంశం చర్చలోకి రావడం, సామాజిక మాధ్యమాలలో అందుకు సంబంధించిన వేడి కొనసాగడం చూడవచ్చు. ఇదంతా పథకం ప్రకారం ఎవరో చేస్తున్నారని అనడం సరికాదు కానీ, అగ్నికి ఆజ్యం పోయడానికి తగిన అవకాశాలు మన సమాజంలోనే విరివిగా అందుబాటులో ఉన్నాయి. ఏదో ఒక సంఘటన జరుగుతుంది, అందులో దేశంలోని రెండు ప్రధానమతాలను వైరిపక్షాలుగా చూపించగలిగే అంశమేదో ఉంటుంది, దాన్ని గోరంతలు కొండంతలు చేసే పనిలో కొందరు ప్రత్యేకంగా నిమగ్నమవుతున్నారు. గతంలో మతపరమైన ఉద్రిక్తతలు, సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు, వాటిని అణచివేస్తూనే, సమాజంలో శాంతిసామరస్యాలను నెలకొల్పాలన్న సంకల్పాన్ని ప్రకటించేవి, అందుకు అనుగుణంగా కొన్ని చర్యలు కూడా తీసుకునేవి. ఇటీవలి ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం, ఉద్రిక్తతలనుంచి ప్రజల దృష్టి మళ్ళించేందుకు, సహజీవన, సామరస్యవిలువలను ప్రబోధించేందుకు ప్రయత్నమేమీ చేయడం లేదు. దానినొక విలువగా, ఆదర్శంగా కూడా భావించడం లేదు. ఇంత పెద్ద దేశంలో ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు, దాన్ని చిలవలు పలవలు చేయడానికి దుష్టశక్తులకు అందువల్ల సానుకూల వాతావరణం ఏర్పడుతున్నది.

మంగళూరు, కోయంబత్తూరు ఘటనలు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ ను కానీ, త్వరలో జరగబోతున్న కర్ణాటకను కానీ ప్రభావితం చేయడానికి జరిగినవని అనుకోలేము. కానీ, ప్రభావం వేయవని కూడా చెప్పలేము. ఇటువంటి సంఘటనలు ఇప్పటికే ఉనికిలో ఉన్న విభజనను మరింతగా కొనసాగించేట్టుగా వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. వీటిని చూపించి ఒక సామాజిక మత వర్గం మీద అయిష్టతను, శత్రుభావాన్ని పెంపొందించడానికి కొందరు ప్రయత్నిస్తారు. మరి ఉగ్రచర్యలకు పాల్పడేవాళ్లు ఎందుకు తమ మతస్థులకు హానిచేస్తున్నారు? విభజన కోరుకునేవారు మెజారిటీ మతస్థులైనా, మైనారిటీ మతస్థులైనా వారు ప్రజలకు జవాబుదారీలు కాదు. మతతత్వవాదులు ఒకరికొకరు సాయం చేసుకుంటారని అనేక ఉదాహరణల ద్వారా చెప్పవచ్చు. ఆ మతానికి చెందిన ప్రజలంతా తమ వెంటే ఉండేట్టుగా, అభద్రతాభావాన్ని వ్యాపింపజేస్తారు. అందరూ కలసి ఉండాలని, మతాలు వేరైనా మనుషులంతా ఒకటని చెప్పే పెద్దమనసులు, పెద్దమనుషులు లేకుండా పోతున్నాయి.

మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు సామాజిక ఆదర్శాలుగా చెప్పుకుంటాము. కులమతభేదాలు, మనుషుల సహజీవనానికి ఏ మాత్రం అవరోధం కాగూడదని, ప్రేమలకు ప్రతిబంధకం కాగూడదని బోధనలు వింటుంటాము. ఏ వివాహాలు అయినా విఫలం కావడం సాధారణమే కావచ్చు కానీ, కులాంతర, మతాంతర వివాహాలలో అవాంఛనీయ పరిణామాలు జరిగితే, అది ఆదర్శ వివాహాల భావనకే చెరుపు చేస్తుంది. అందుకని, ఆదర్శజీవనం గడిపేవారు ఆ ఆదర్శానికి మచ్చరాకుండా జీవించాలి. కానీ, అందరు భార్యాభర్తల మధ్య వచ్చినట్టే అనేక సమస్యలు కులాంతర, మతాంతర వివాహాలలో కూడా వస్తాయి. మంచీ చెడూ అన్ని కులాల, మతాల ఆడామగల్లో ఉంటాయి. ఒక్కోసారి తీవ్రమైన కుటుంబ హింస, నేరాలు కూడా మతాంతర, కులాంతర వివాహాలలో జరగడం అరుదుగానైనా వింటుంటాము. మతాంతర వివాహంలో ఉన్న ఇద్దరి మధ్య సంబంధం వికటించి, అందులో ఎవరో ఒకరు మరొకరిపై దారుణమైన హింసకు, అఘాయిత్యానికి పాల్పడినప్పుడు, అందుకు కారణాలను భార్యాభర్తల సంబంధంలోనో, పురుషాధిక్యంలోనో చూడాలి తప్ప, వేర్వేరు మతాలలో, కులాలలో చూడడం అన్యాయం. హిందూ, ముస్లిమ్, క్రైస్తవ, తదితర మతాల యువతీయువకుల మధ్య పరస్పర అనురాగం ఏర్పడి వివాహబంధానికి దారితీస్తే, అందుకు సామాజిక భేదాలను కూడా అధిగమించగలిగిన మానవసంబంధమే కారణమని గుర్తించాలి. కానీ, మానవసంబంధం ఏ కారణం చేత అయినా విఫలమయిన పక్షంలో, తిరిగి సామాజిక అంతరాలో, పురుషాధిక్యతో, ధనాధిక్యతో ఏదో ఒకటి పైచేయి అయి, నేరాలకు దారితీస్తోంది. అట్లా జరుగుతున్నంత మాత్రాన, మతాంతర వివాహాల ఆదర్శాన్ని నిరాకరించగలమా? ఒక మతానికి, కులానికి చెందిన వారితో వివాహాలనే ప్రమాదాలుగా, అవాంఛనీయాలుగా ప్రచారం చేయడం ఎంత దుర్మార్గం? ఇప్పుడు దేశంలో అనేక రాష్ట్రాలలో రాజకీయ కార్యక్రమాలు ఉధృతమవుతున్న సమయంలో, సామాజిక మాధ్యమాలు ఒక దారుణమైన నేరాన్ని ఉదాహరణగా చూపిస్తూ్ మతద్వేషాన్ని ప్రచారం చేయడం చూస్తున్నాము.

రాజకీయ సంవాదం ఉధృతంగా సాగుతున్న సమయాల్లో, ప్రజలు జాగరూకతతో ఉండాలి. జనం మనసులను, ఆలోచనలను చాపకింద నీరులాగా ప్రభావితం చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంటాయి. వ్యతిరేకతలను, అనుకూలతలను బలవంతంగా మెదళ్లలోకి జొప్పించే కుట్రలూ జరుగుతాయి. ఎప్పుడూ ఒక ద్వేషభావం నిరంతరంగా ఆలోచనల్లో ప్రవహింపజేసే వ్యూహం అమలు జరుగుతూ ఉంటుంది. ఉగ్రవాద పేలుళ్ల కంటె ప్రమాదకరమైన చర్యలు ఇవి.

Updated Date - 2022-11-23T01:22:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising