ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RK : కేసీఆర్‌ వెనుకడుగేస్తే!

ABN, First Publish Date - 2022-10-30T03:15:50+05:30

భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కొందరు మధ్యవర్తులు ప్రయత్నించి ఆడియో, వీడియోల సాక్షిగా దొరికిపోయిన సంఘటన ప్రకంపనలు సృష్టించిందో లేదో...

RK
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కొందరు మధ్యవర్తులు ప్రయత్నించి ఆడియో, వీడియోల సాక్షిగా దొరికిపోయిన సంఘటన ప్రకంపనలు సృష్టించిందో లేదో తెలియడం లేదు. కానీ ఈ వ్యవహారంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మూడు రోజులుగా అనుసరిస్తున్న మౌనం మాత్రం మెదళ్లను చిదిమేస్తున్నది. బుధవారం ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే బీజేపీ నేతల జుట్టు కేసీఆర్‌ చేతికి చిక్కిందని పలువురు భావించారు. అయితే ఆత్మరక్షణలో పడాల్సిన బీజేపీ నాయకులు ఎదురుదాడిని ఎంచుకున్నారు. టీఆర్‌ఎస్‌లో 2014 నుంచి ఇతర పార్టీల ఎమ్మెల్యేలను పెద్ద సంఖ్యలో చేర్చుకొని ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్‌కు బీజేపీ గురించి మాట్లాడే నైతికత లేదని తేల్చిపారేశారు. ముందస్తు సమాచారం మేరకు పకడ్బందీ వ్యూహంతో మొత్తం వ్యవహారాన్ని ఆడియో, వీడియో సైతంగా రికార్డింగ్‌ చేయించిన కేసీఆర్‌, ఈ ఉదంతాన్ని బ్లాస్ట్‌ చేస్తారని అందరూ భావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి బీజేపీని ఎండగడతారని తొలుత లీకులిచ్చారు. అయితే కేసీఆర్‌ నోరు విప్పకపోగా ఈ వ్యవహారంపై పార్టీ నాయకులు ఎవరూ స్పందించకూడదని ఆర్డర్‌ జారీ చేయించారు. ఆ తర్వాత శుక్రవారం ఢిల్లీ వెళ్లి జాతీయ స్థాయిలో బీజేపీని ఎండగడతారని లీకులిచ్చారు. అది కూడా జరగలేదు. అయితే ఫాంహౌస్‌ సంఘటనకు ముందు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి, బీజేపీ తరఫున రంగంలోకి దిగారని ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ మధ్య జరిగిన ఫోన్‌కాల్‌ సంభాషణల ఆడియోలను రెండు దఫాలుగా బయటపెట్టారు. అదే సమయంలో నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరచగా, అవినీతి నిరోధక చట్టం నిబంధనలు పాటించలేదంటూ రిమాండ్‌కు పంపడం కుదరదని ఏసీబీ కోర్టు స్పష్టంచేసింది.

దీనిపై పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను హైకోర్టు తోసిపుచ్చింది. ఈలోపు ఆడియో–వీడియో టేపులను కేసీఆర్‌ నేరుగా విడుదల చేయకుండా లీకులు చేయించారు. క్లుప్తంగా జరిగింది ఇది! కాగా ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆశించిన రాజకీయ లబ్ధి చేకూరుస్తున్నదా? లేదా? అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో నాలుగు రోజుల్లో మునుగోడుకు ఉప ఎన్నిక జరగనున్నందున ఈ దెబ్బతో బీజేపీ నాయకుల నైతికస్థైర్యం దెబ్బతింటుందని టీఆర్‌ఎస్‌ నాయకులు ఆశించారు. బీజేపీ రాష్ట్ర నాయకులు మాత్రం ఎదురుదాడినే ఎంచుకున్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఫిరాయింపునకు ప్రోత్సహించడం తప్పు కాదని గతంలో కేసీఆర్‌ చేసి చూపించారు కనుక ఇప్పుడు జరిగినదాన్ని కూడా ఆ కోణంలోనే చూడాలని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. అదే సమయంలో ఈ వ్యవహారంపై సీబీఐ లేదా సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తితో విచారణ జరిపించాలని బీజేపీ తరఫున హైకోర్టును ఆశ్రయించారు. గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ ఎన్నికలతో బిజీగా ఉన్న బీజేపీ కేంద్ర నాయకులు మాత్రం దీన్ని పట్టించుకోనట్టుగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ వ్యూహం ఏమిటో తెలియక టీఆర్‌ఎస్‌ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. తన మనసులో ఏముందో ఆయన ఎవరికీ చెప్పడంలేదు. ‘‘ఈ వ్యవహారాన్ని ఎలా డీల్‌ చేయాలో నాకు వదిలేయండి’’ అని మాత్రమే కేసీఆర్‌ అంటున్నారట. ఫాంహౌస్‌ సమావేశానికి వెళ్లిన నలుగురు ఎమ్మెల్యేలు బుధవారం రాత్రి నుంచి ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారు. వారిని ప్రగతిభవన్‌కు మాత్రమే ఎందుకు పరిమితం చేశారో తెలియదు. నిజానికి ఈ వ్యవహారం బయటకు పొక్కగానే తెలంగాణలోనైనా ప్రకంపనలు సృష్టిస్తుందని పలువురు భావించారు.

ఓటుకు నోటు కేసులో ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఇరికించిన ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పెట్టుకుంటే మామూలుగా ఉండదని విశ్లేషణలు చేశారు. అయితే అప్పటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును లొంగదీసుకున్నంత ఈజీ కాదు– బీజేపీ అధినేతల జుట్టు దొరికించుకోవడం అని కేసీఆర్‌ అండ్‌ కోకు తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు. ఓటుకు నోటు కేసులో డబ్బుతో వెళ్లి రేవంత్‌ రెడ్డి దొరికిపోయారు. ఆ వ్యవహారంలో తన పాత్రపై ప్రత్యక్ష ఆధారాలు లేకపోయినా చంద్రబాబు పిరికితనంతో కేసీఆర్‌కు లొంగిపోయారు. నిజానికి ఒక పార్టీ అధ్యక్షుడిగా నామినేటెడ్‌ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌ ఓటును కోరే హక్కు చంద్రబాబుకు ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న తన ఫోన్‌ను కూడా ట్యాప్‌ చేయడం ఏమిటి? అని ఎదురుదాడికి దిగకుండా రాజీపడిపోయారు. దీంతో అప్పట్లో కేసీఆర్‌ది పైచేయి అయిపోయింది. ఇప్పుడు అలా కాదు. బీజేపీ కేంద్ర నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మించిన రాజకీయ గండరగండులు. ఆడియో, వీడియోలో ‘నంబర్‌ 2’ అని రామచంద్ర భారతి పరోక్షంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను ప్రస్తావించినప్పటికీ నేరుగా ఆయనకు సంబంధం ఉందనడానికి ఆధారాలు లేవు. ఈ కారణంగా అమిత్‌ షాను కానీ, మరొకరిని కానీ న్యాయపరంగా కేసీఆర్‌ చేయగలిగింది ఏమీ లేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మన దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టం అమలులో ఉన్నప్పటికీ అవకాశం లభించినప్పుడల్లా దాదాపుగా ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఫిరాయింపుల చట్టాన్ని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. చట్టసభల్లో ఏకంగా పార్టీలను విలీనమే చేసుకుంటున్నారు. అదెలా అంటే, అలా జరిగిపోతున్నదంతే! ఒక పార్టీ మరో పార్టీలో విలీనమైందని చట్టసభలో ప్రకటించినప్పుడు విలీనమైన పార్టీకి అస్తిత్వం ఉండకూడదు. ఎన్నికల కమిషన్‌ వద్ద సదరు పార్టీకి గుర్తింపు ఉండకూడదు. ఎన్నికల చిహ్నం కూడా రద్దు చేయాలి. ఉదాహరణకు రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ బీజేపీలో విలీనమైనట్టు ప్రకటించారు గానీ, ఎన్నికల కమిషన్‌ వద్ద తెలుగుదేశం పార్టీ గుర్తింపు అలాగే ఉంది. అంతేకాదు, రాజ్యసభలో మిగిలిన టీడీపీ ఏకైక ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ను రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడిగానే గుర్తిస్తున్నారు. అలాంటప్పుడు విలీనానికి అర్థం ఉందా? తెలంగాణ విషయానికే వద్దాం. శాసనసభ, శాసనమండలిలో కాంగ్రెస్‌–తెలుగుదేశం పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం అయినట్టుగా ప్రకటించేశారు. అయినప్పటికీ శాసనసభలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీ సభ్యులుగానే కొనసాగుతున్నారు.

135 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఈ దేశాన్ని సుదీర్ఘ కాలం పరిపాలించింది. జాతీయ పార్టీగా ఆ పార్టీకి ఎన్నికల కమిషన్‌ వద్ద గుర్తింపు ఉంది. అయినా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్‌ను తెలంగాణ శాసనసభలో ప్రాంతీయ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌లో విలీనం చేసుకున్నట్టుగా ప్రకటించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి తూట్లు పొడిచే క్రమంలో విలీనం అనే నాటకానికి బీజేపీ–టీఆర్‌ఎస్‌ తెరలేపాయి. ఈ విషయంలో రెండు పార్టీలూ నైతికతను కోల్పోయాయి. అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలు కూడా దాదాపుగా ఇదే విధంగా వ్యవహరించాయి. ఈ కారణంగా పార్టీ ఫిరాయింపుల పాపం అంటని పార్టీ అంటూ ఏదీ మిగల్లేదు. బహుశా అందుకే కాబోలు ప్రస్తుతం నలుగురు ఎమ్మెల్యేలకు ఫిరాయించడానికి డబ్బు ఆఫర్‌ చేసిన అంశాన్ని ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజానికి తాజా వ్యవహారంలో చిక్కుకున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎన్నికైన వారు కారు. ఆ ముగ్గురూ కాంగ్రెస్‌ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించారు. అధికార పార్టీ నుంచి ఏమీ ఆశించకుండానే వారు పార్టీ మారారని నమ్మే అమాయక స్థితిలో ప్రజలు లేరు. కాంగ్రెస్‌– తెలుగుదేశం పార్టీలను అంతం చేయడం కోసం ఆ పార్టీ తరఫున ఎన్నికైన వారికి కేసీఆర్‌ భారీ ఆఫర్లు ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే ప్రస్తుత ఫాంహౌస్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటికీ బ్రహ్మాండం బద్దలు కాలేదు.

ట్యాపింగ్‌కు వెనుకా.. ముందు!

చంద్రబాబును భయపెట్టినట్టు అమిత్‌ షానో లేక నరేంద్ర మోదీనో భయపెట్టడం సాధ్యం కాదు కనుక కేసీఆర్‌ కూడా వ్యూహాత్మక మౌనాన్ని ఆశ్రయించి ఉంటారు. ఏదైనా అత్యవసర పరిస్థితో, ప్రజాభద్రతకు ప్రమాదమో సంభవిస్తుంటే తప్ప ఎవరి ఫోన్‌ అయినా ట్యాప్‌ చేయడానికి టెలిగ్రాఫ్‌ చట్టం అంగీకరించదు. అయినా తెలుగు రాష్ర్టాల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ నిత్యకృత్యం అయింది. అధికార పార్టీ నాయకులు కూడా తమ ఫోన్లలో స్వేచ్ఛగా మాట్లాడగలిగే పరిస్థితి లేదన్నది అందరికీ తెలిసిందే. రాష్ర్టాలలో ప్రత్యర్థుల ఫోన్లను ట్యాప్‌ చేస్తున్నవారే కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్‌ చేస్తోందన్న భయంతో బతుకుతున్నారు. ముఖ్యమంత్రులు కూడా స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడుకోలేని పరిస్థితి ప్రస్తుతం ఉంది.

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుమతితో లీక్‌ చేసిన ఆడియోలు చట్టవిరుద్ధంగా ట్యాప్‌ చేసినవిగా కేంద్రం పరిగణించవచ్చు. ట్యాపింగ్‌ చేయడం ద్వారా సదరు ఆడియోలను రికార్డు చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు కూడా ఇబ్బందుల్లో పడతారు. తాజా వ్యవహారంలో ఇలాంటి చిక్కుముడులు ఎన్నో ఉన్నాయి. సంఘటనా స్థలంలో డబ్బు దొరకలేదు కనుక కేవలం సంభాషణల ఆధారంగానే అవినీతి నిరోధక చట్టం కింద కేసు పెట్టడం సాధ్యం కాదని కూడా న్యాయ నిపుణులు చెబుతున్నారు. అదే నిజమైతే బయటకు వచ్చిన ఆడియో టేపులు గానీ, ఇకపై విడుదలయ్యే టేపులు గానీ.. టైం పాస్‌ వ్యవహారం మాత్రమే అవుతాయి. పోలీసుల వద్ద మాత్రమే ఉండాల్సిన ఆడియో, వీడియో టేపులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎలా చేరాయన్న ప్రశ్న వస్తుంది కనుక కేసీఆర్‌ సదరు టేపులను అధికారికంగా రిలీజ్‌ చేయడంలేదు. అంతేకాదు, ఈ వ్యవహారం న్యాయ సమీక్షకు నిలబడదన్న అభిప్రాయం కూడా ఉంది. బహుశా ఈ కారణంతోనే కేసీఆర్‌ ఎక్కువ హడావిడి చేయకుండా మౌనంగా ఉంటున్నారేమో! తన ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుటిల ప్రయత్నాలకు పాల్పడుతోందని చెప్పుకొని ప్రజలలో సానుభూతి పొందడానికి కేసీఆర్‌ పరిమితం అవుతారేమో తెలియదు. టీఆర్‌ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని అనుకుంటున్న కేసీఆర్‌, బీజేపీపై తీవ్రస్థాయిలో యుద్ధం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫాంహౌస్‌ వ్యవహారం కేసీఆర్‌కు అందివచ్చిన అవకాశంగానే పరిగణించాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుమార్తె కవిత ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ‘నువ్వు నా జోలికి రావొద్దు–నేను నీ జోలికి రాను’ అని కేసీఆర్‌–బీజేపీ పెద్దల మధ్య రాజీ కుదిరిపోయిందని ప్రచారం కూడా ఊపందుకుంది.

సంఘటన జరిగి మూడు రోజులవుతున్నప్పటికీ కేసీఆర్‌ మౌనంగా ఉండిపోవడం ఇందుకు ఊతమిస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన మంత్రి కేటీఆర్‌ కూడా ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది’ అంటూ ముక్తసరిగా మాట్లాడి పై అనుమానాలకు మరింత బలం చేకూర్చారు. ఫాంహౌస్‌ వ్యవహారంపై తాము నోరు కట్టేసుకున్నామని చెప్పకనే చెప్పారు. కారణం ఏమైనప్పటికీ తెలంగాణ సమాజం కూడా ఈ వ్యవహారంలో కేసీఆర్‌కు అండగా నిలవడం లేదు. 2018 ఎన్నికల్లో తగినంత మెజారిటీ వచ్చినప్పటికీ కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తన పార్టీలో చేర్చుకున్న కారణంగా కేసీఆర్‌కు ఆశించిన మేరకు మద్దతు లభించకపోతుండవచ్చు. వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తమ ఎమ్మెల్యేలు నిప్పు అని టీఆర్‌ఎస్‌ ప్రచారం చేసుకుంటున్నది. తెలంగాణ నాట్‌ ఫర్‌ సేల్‌ అని కూడా సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకున్నారు. ఇందులో కూడా హిపోక్రసీ ఉంది. ఎమ్మెల్యేలు నిప్పు అయితే కాంగ్రెస్‌ తరఫున గెలిచి టీఆర్‌ఎస్‌లోకి ఎందుకు ఫిరాయించారో ఆ ముగ్గురూ చెప్పాల్సి ఉంటుంది. ఒకసారి పార్టీ ఫిరాయించిన వారికి మరోసారి పార్టీ ఫిరాయించడం కష్టం కాదు కదా! వచ్చే ఎన్నికల తర్వాత బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందనుకుంటే టీఆర్‌ఎస్‌కు చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు ఇప్పటికిప్పుడు పార్టీ ఫిరాయించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. రాజకీయాలే కలుషితం అయినప్పుడు ఎమ్మెల్యేలు మాత్రమే నిప్పులా ఎలా ఉండగలరు? ఫిరాయించిన వాళ్లు, ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్లు నిప్పయితే వాళ్లను ఎన్నుకున్న ప్రజలే దోషులా?

అసలేం జరిగింది?

నిజానికి తాజా వ్యవహారంలో కూడా జరిగింది వేరే అని చెబుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేలు ఫిరాయింపునకు సిద్ధపడుతున్నారని ట్యాపింగ్‌ ద్వారా తెలుసుకున్న కేసీఆర్‌ వారిని భయపెట్టి తన దారిలోకి తెచ్చుకున్నారని ప్రచారం జరుగుతోంది. రిలీజైన ఆడియో సంభాషణల ప్రకారం పార్టీ ఫిరాయించాలని రోహిత్‌ రెడ్డిపై అవతలివారు ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. పార్టీ ఫిరాయించడానికి తాను సిద్ధమేనని రోహిత్‌ అంగీకరించినట్టు స్పష్టమవుతోంది. ముందస్తు పథకం ప్రకారమే పార్టీ ఫిరాయించడానికి తాను సిద్ధమేనని రోహిత్‌ రెడ్డి చెప్పారా? అన్నది కూడా తేలాల్సి ఉంది. ఈ వ్యవహారం న్యాయస్థానం పరిశీలనలో ఉన్నందున భవిష్యత్‌ పరిణామాల కోసం వేచి చూడాల్సిందే. బీజేపీ రాష్ట్ర నాయకులు కోరినట్టు హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఆ నలుగురు ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది పోలీసు అధికారులు కూడా నిందితులుగా మారిపోవచ్చు. ఏది ఏమైనా ఈ వ్యవహారంలో కేసీఆర్‌ వేయబోయే అడుగులను బట్టి జరగబోయేది ఏమిటన్న విషయంపై స్పష్టత వస్తుంది. ప్రస్తుతానికి పోలీసుల వద్ద ఉన్న ఆడియో, వీడియో టేపుల్లోని సమాచారాన్ని బట్టి చూస్తే, ఢిల్లీ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టబోతున్నట్టు రామచంద్ర భారతి ప్రభృతులు చెప్పినట్టు తెలుస్తోంది. అదే నిజమైతే బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లి కేజ్రీవాల్‌ తదితరులను కలుపుకొని విలేకరుల సమావేశం పెట్టి బీజేపీని ఎండగట్టవచ్చు. అయితే ఇప్పటివరకు కేసీఆర్‌ అటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనిపించడంలేదు. బీజేపీ బిగ్‌షాట్స్‌ అమిత్‌ షా, సంతోష్‌ జీ పేర్లు బయటకు వచ్చినందున ఇప్పుడు కేసీఆర్‌ ఒక్క అడుగు వెనక్కి వేసినా రాజకీయంగా ఆయనే నష్టపోతారు. ఈ వ్యవహారంలో మౌనంగా ఉంటే నష్టం జరుగుతుందని పార్టీ ముఖ్యులు చెబుతున్నప్పటికీ ‘నాకు వదిలేయండి’ అని చెబుతున్న కేసీఆర్‌, తన మనసులో ఏముందో మాత్రం చెప్పడంలేదు. నిజానికి వివాదంలో చిక్కుకున్న రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్‌ పేర్లు ఇప్పటివరకు ఎవరికీ తెలియవు. రామచంద్ర భారతి అనే ఆయన బీజేపీ అగ్ర నాయకులకు ఏజెంట్‌ అనడానికి కూడా ప్రస్తుతానికి ఆధారాలు లేవు. రాజ్‌నాథ్‌ సింగ్‌, యోగి ఆదిత్యనాథ్‌ వంటి వారితో ఫొటోలు దిగినంత మాత్రాన బీజేపీలో ఆయన ప్రముఖుడని తీర్మానించలేం. అలా అయితే నందు అనే వ్యక్తి టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌తో కూడా ఫొటోలు దిగారు. ప్రజా జీవితంలో ఉన్న వారితో ఎవరెవరో ఫొటోలు దిగుతుంటారు. అంతమాత్రాన వారితో ముడిపెట్టలేం. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో మాట్లాడ్డానికి రామచంద్ర భారతి ప్రయత్నించాడని మాత్రమే వీడియోలో ఉందని అంటున్నారు. అమిత్‌ షాతో మాట్లాడలేదు కనుక ఈ వ్యవహారంతో కేంద్ర మంత్రికి సంబంధం ఉందని రుజువు చేయలేరు. బీజేపీ తరఫున బేరసారాలు చేశారని చెబుతున్న వారెవరూ ప్రముఖులు కాకపోవడంతో ఈ కేసు దూదిపింజలా తేలిపోవచ్చు. బహుశా ఈ కారణంగానే కేసీఆర్‌ మౌనంగా ఉంటూ ఉండవచ్చు. అయితే ఒకటి మాత్రం నిజం. ఎమ్మెల్యేల కొనుగోళ్లు, అమ్ముడుపోవడాలు తెలంగాణ సమాజానికి కొత్తకాదు. అలాంటి వాటికి అలవాటు పడిపోయినందునే ప్రస్తుత వ్యవహారం కూడా ప్రకంపనలు సృష్టించడంలేదు. అందరూ అందరే అన్న భావనలో ప్రజలున్నారు. అయితే బీజేపీ అగ్ర నాయకుడైన అమిత్‌షాను ఈ వివాదంలోకి తీసుకురావడంతో రాబోయే పరిణామాలు ఎలా ఉంటాయన్న అంశంపై రాజకీయ విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొంది. ఎవరిని ఎవరు లొంగదీసుకుంటారన్న విషయమై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు కేసీఆర్‌ ఏకంగా బీజేపీ అగ్రనాయకులతోనే పెట్టుకుని, కొరివితో తలగోక్కున్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేసీఆర్‌ కుమార్తె కవితపై ఇప్పటికే ఆరోపణలున్నాయి. మరోవైపు ఇటీవలి కాలంలో ఆదాయపు పన్ను శాఖ, ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలపై జరిపిన దాడుల్లో కొంత కీలక సమాచారాన్ని సేకరించారని చెబుతున్నారు. అయితే బీజేపీ పెద్దలను ఇరకాటంలో పెట్టడానికి ఇంత మంచి అవకాశం లభించినా, జాతీయ స్థాయిలో ఒక్క ముఖ్యమంత్రి కూడా కేసీఆర్‌కు అనుకూలంగా స్పందించకపోవడం మాత్రం ఆశ్చర్యంగా ఉంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్‌ కూడా స్పందించలేదు. మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన ఉద్ధవ్‌ ఠాక్రే ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్న కేసీఆర్‌కు ఒక్కరు కూడా సంఘీభావం తెలపకపోవడం ఆశ్చర్యంగా ఉంది. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించినా ఆయనకు జాతీయ స్థాయిలో గుర్తింపు లేదు. సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టుగా ఈ వ్యవహారం చివరికి టీ కప్పులో తుఫానుగా మిగిలిపోతుందా? అన్న అనుమానం కలుగుతోంది. ఈ సంఘటనకు సంబంధించిన ప్రధాన పార్టీలు టీఆర్‌ఎస్‌, బీజేపీలకు ఫిరాయింపుల మకిలి అంటుకున్నందున అనుకూలంగా, వ్యతిరేకంగా ఒక్క గొంతు కూడా వినిపించలేదు. ఇప్పటిదాకా నువ్వు చేసిందేమిటి? అని కాంగ్రెస్‌ పార్టీ కూడా కేసీఆర్‌నే ప్రశ్నిస్తోంది. ఏది ఏమైనా చంద్రబాబును దారిలోకి తెచ్చుకున్నంత ఈజీ కాదు బీజేపీతో పెట్టుకోవడం అని కేసీఆర్‌కు ఈపాటికే బోధపడి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆయనకు అంతగా విశ్వసనీయత లేకపోవడం, తెలంగాణలో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బాధితులుగా మిగలడం వల్ల కేసీఆర్‌కు రాజకీయ ప్రయోజనం కూడా పెద్దగా లభిస్తున్నట్టుగా లేదు. మామూలుగా అయితే ఈ వ్యవహారంతో బీజేపీ ఆత్మరక్షణలో పడిపోయి, మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో దాని ప్రభావం కనిపించి ఉండాల్సింది. పోలింగ్‌కు మరో నాలుగు రోజుల గడువు ఉంది. అప్పటి వరకు నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియోలను ఇలాగే లీక్‌ చేస్తుండవచ్చు. ఫిరాయింపులను ప్రోత్సహించారన్న మట్టి కేసీఆర్‌ చేతికి అంటి ఉండకపోతే ఈ సంఘటన వల్ల మునుగోడులో టీఆర్‌ఎస్‌ విజయం ఏకపక్షమై ఉండేది. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడంలేదు. ప్రధాన పోటీలో ఉన్న రెండు పార్టీలకూ నైతికత లేనందున మునుగోడు ప్రజలు డబ్బును బట్టి ఓటు వేసే అవకాశమే కనిపిస్తోంది. ఏదేమైనా రాజకీయాల్లో ఒక ప్రయోగం ఒకసారే ఫలితం ఇస్తుంది. ఓటుకు నోటు కేసు వల్ల కేసీఆర్‌కు కలిగినంత రాజకీయ ప్రయోజనం ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంలో దక్కలేదని చెప్పవచ్చు. ఇప్పుడు తేలాల్సింది పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసం ఈ ఉదంతాన్ని ఆయా పార్టీలు వాడుకుంటాయా? ఉభయ కుశలోపరి అనుకుంటాయా? లేక కత్తులు దూసుకుంటూనే ఉంటాయా? అన్నది వేచి చూద్దాం!

ఆర్కే

Updated Date - 2022-10-30T06:37:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising