ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసాధ్యుడు!

ABN, First Publish Date - 2022-11-16T01:04:06+05:30

కొన్ని పదాల మధ్య బంధం దృఢమైనది. కృష్ణ-–సాహసం అన్న మాటలు ఆ కోవకే చెందుతాయి. సినీనటుడు కృష్ణ మరణంతో సాహసం చిన్నబోయింది. ధైర్యం మూగపోయింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని పదాల మధ్య బంధం దృఢమైనది. కృష్ణ-–సాహసం అన్న మాటలు ఆ కోవకే చెందుతాయి. సినీనటుడు కృష్ణ మరణంతో సాహసం చిన్నబోయింది. ధైర్యం మూగపోయింది. కృష్ణ సినీ జీవితం సాహసాల మాలిక. తొలి సినిమా నుంచి ఆయనది ఎదురీత ప్రయాణమే. ఆర్టిస్ట్‌గా పనికి రావనీ, సినిమాలు మానేసి వేరే ఏదన్నా వృత్తి చూసుకోమనీ ఆదిలోనే నిరుత్సాహపరిచినవారు ఉన్నారు. అయినా, ఆయన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగారు, సినీరంగంలో ఒక వెలుగువెలిగి, చిరస్థాయిగా నిలిచిపోయారు.

కెరీర్‌ పరంగా కృష్ణకు తగిలినన్ని ఎదురు దెబ్బలు మరో హీరో ఎవరికైనా తగిలి ఉంటే పరిశ్రమ వదిలి వెళ్లిపోయేవారేమో! కృష్ణలో ఓ విధమైన తెగింపు ఉండేది. మొండితనంతో పాటు మంచితనమూ ఉంది. ఆ మంచితనమే కృష్ణను కాపాడుతోందని నిర్మాతలు కూడా అనేవారు. శత్రువుని కూడా ప్రేమగా పలకరించే స్వభావం ఆయనది. అందుకే మిత్రులతో పాటు శత్రువులు కూడా ఆయన మాటకు తలొగ్గేవారు. సినీ జీవితంలో ఒడుదుడుకులకు ఆయన ఎప్పుడూ భయపడలేదు, ఖాతరు చెయ్యలేదు. జీవితంలో వాటిని అంతర్భాగంగా భావించారు ఆయన. జయాపజయాలకు ఓ పరిమితిని మించి ప్రాధాన్యం ఇవ్వలేదు. విజయాలకు పొంగిపోలేదు, పరాజయాలకు కుంగిపోలేదు. ఆ లక్షణమే ఆయనను నిత్యపోరాటశీలిగా కడవరకూ నిలబెట్టింది.

ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావులకు రెగ్యులర్‌ ప్రొడ్యూసర్స్‌ ఉండేవారు. వీరు వాళ్లతోనే సినిమాలు చేస్తుండేవారు. అటువంటి పరిస్థితుల్లో కొత్తగా చిత్ర పరిశ్రమలోకి వచ్చే నిర్మాతలకు హీరో కృష్ణ కామధేనువులా ఉండేవారు. ఆ నిర్మాతలందరినీ సంతృప్తి పరచడం కోసం రోజుకి 18 గంటలు పనిచేసేవారు కృష్ణ. ఒక సినిమా తీయడానికి నెలలు పడుతున్న రోజులివి. ఆ రోజుల్లో కృష్ణ నటించిన సినిమాలు ఏటా 15 నుంచి -18 వరకూ విడుదల అయ్యేవి. కాలంతో పరిగెడుతూ పని చేయడం అంటే ఏమిటో ఆయనకు తెలుసు. ఉదయం ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ రోజుకి మూడు నాలుగు సినిమాలు చేసేవారు కృష్ణ. అన్ని సినిమాలు చేయడం ద్వారా ఎంతో మంది చిన్న నటులకు, సినీకార్మికులకు పరోక్షంగా ఎంతో లబ్ధిచేకూర్చారు కూడా.

తన ఎదుగుదలతో పాటు, సినీ పరిశ్రమ ఎదుగుదల గురించి కూడా ఆయన ఆలోచించారు. నిర్మాతగా తెలుగు సినిమాను సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చేశారు. నిర్మాణపరంగా ఆయన ప్రతీ అంశంలోనూ ఓ ట్రెండ్‌ సృష్టించారు. తెలుగు సినిమాలో తొలి కౌబాయ్, తొలి జేమ్స్ బాండ్, మొదటి సినిమాస్కోప్, తొలి ఈస్ట్‌మన్ కలర్, మొదటి 70 ఎంఎం వంటి సాహసాలనేకం చేయగలిగేది ఆయనే. దర్శకుడిగానూ, నిర్మాతగానూ కూడా ఆయన డేరింగ్ అండ్ డాషింగే.

కొత్తదనాన్ని స్వాగతించడమే కాదు, దానిని ప్రేక్షకులకు వారిని సమ్మోహనపరిచేరీతిలో ఎలా అందివ్వాలన్నది కూడా ఆయనకు తెలుసు. తొలి కౌబాయ్‌ చిత్రం ‘మోసగాళ్లకు మోసగాడు’ కలర్‌లో తీస్తున్నట్లు కృష్ణ ప్రకటించగానే అందరూ ఆశ్చర్యపోయారు, ఎగతాళి చేశారు. ఆత్మీయులనుకున్నవారు హితవు చెప్పారు. అయినా కృష్ణ కాలానికి ఎదురీది మరీ తాను అనుకున్న విధంగా ఆ చిత్రాన్ని తీశారు. ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రం విషయంలోనూ అంతే. ‘సీతారామరాజు’ తీస్తున్నాడట, తనే టైటిల్‌ పాత్ర పోషిస్తున్నాడట, ఎంత ధైర్యం అని ఎన్ని పెదవి విరుపులూ విమర్శలూ ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. అనుకున్నది చేసి చూపించారు. తన నిర్ణయాన్ని అమలుపరచడం కోసం కొండను ఢీ కొనడానికి కూడా వెనుకాడని మనిషి ఆయన. ఎన్టీఆర్‌తో పోటీగా ‘కురుక్షేత్రం’ తీయడం, అక్కినేని చేసిన దేవదాసును మళ్లీ తీయడం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సాహసాలు ఎన్నో. జై ఆంధ్రా ఉద్యమ సమయంలోనూ అదే స్వభావం. ఆ ఉద్యమం పట్ల ఎన్టీఆర్‌, ఏయన్నార్‌ తటస్థ వైఖరితో, నిశ్శబ్దంగా ఉండిపోతే, ఈయన ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తూ, ఏకంగా పత్రికా ప్రకటన ఇవ్వడంలోనూ దూకుడు కనబరిచారు. అది అగ్ర హీరోలకు ఆగ్రహం తెప్పిస్తుందని ఆయనకు తెలియనిదేమీ కాదు.

నిర్మాతలనుంచి భారీ పారితోషికాలు తీసుకుంటూ, వారిని అన్ని విధాలుగా పీల్చిపిప్పిచేసే నటులకు సినీరంగంలో కొదవేమీ లేదు. కానీ, పెట్టుబడిపెడుతున్న నిర్మాత పట్ల కృష్ణ ఎంతో సానుభూతితో, బాధ్యతగా ఉండేవారు. అనుకున్న బడ్జెట్‌ కంటే తక్కువ ఖర్చుతో సినిమా పూర్తిచేయించి, నిర్మాతకు ఎంతోకొంత మిగల్చాలని తాపత్రయపడేవారు. తదనుగుణంగానే తనతో సినిమాలు తీసిన నిర్మాతలకు ఎంతోకొంత మిగిలేలా జాగ్రత్తలు తీసుకొనేవారు. తన నిర్మాత కష్టాల్లో ఉన్నాడంటే పరుగున పోయి ఆదుకోవడానికి కూడా వెనుకాడేవారు కాదు. నష్టాల్లోకి జారుకున్న నిర్మాతను తిరిగినిలబెట్టేందుకు తన కాల్షీట్లు సర్దుబాటు చేసుకొని మరీ, వారికో కొత్తచిత్రం చేసిచ్చిన సంఘటనలు అనేకం. ముందుగా రెమ్యూనరేషన్ తీసుకోకుండా ఎంతోమంది నిర్మాతలను పరిశ్రమలో నిలబెట్టారాయన.

‘తేనెమనసులు’ కోసం కృష్ణను ఎంపిక చేస్తున్న సందర్భంలో, కొందరు అభ్యంతరపెట్టినప్పుడు ‘ఈ కుర్రాడు తెలుగు సినిమాను ఏలుతాడు’ అని ఆదుర్తి సుబ్బారావు అన్నారట. అదే నిజమైంది. తెలుగు సినిమా చరిత్రలో సుదీర్ఘకాలం నిలిచివెలిగిన హీరో కృష్ణ అసాధ్యుడు.

Updated Date - 2022-11-16T01:04:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising