ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RK KOTHAPALUKU: నిగ్గదీసి అడుగు.. సిగ్గులేని...

ABN, First Publish Date - 2022-12-18T00:26:52+05:30

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఏ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రాశారో కానీ తెలుగునాట చోటుచేసుకుంటున్న కొన్ని పరిణామాలను చూసిన తర్వాత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని అనే పాటను స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్ర్తి ఏ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని రాశారో కానీ తెలుగునాట చోటుచేసుకుంటున్న కొన్న పరిణామాలను చూసిన తర్వాత ఎవరికైనా ఇదే భావన కలుగుతుంది. అవినీతి, అక్రమాలకు సంబంధించిన కేసులతోపాటు హత్యానేరంపై జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన వారికి స్వాగత సత్కారాలు చేయడం చూస్తుంటే సీతారామ శాస్ర్తి గారి పాట గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా ‘ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌’ పేరిట ఘనంగా ఉత్సవాలు జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ 75 ఏళ్లలో మనం నైతికంగా ఎంత పతనమయ్యామో పాలకులు ఆలోచించకపోవడం విచారకరం. స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో భరతమాత దాస్య శృంఖలాలు తెంచడానికి పోరాడిన యోధులు జైలుకు వెళ్లి విడుదలైనపుడు ప్రజలు వారికి సాదర స్వాగతం పలికారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. త్యాగధనుల కోసం వెతుక్కోవలసిన పరిస్థితి. అధికారాన్ని చెరబట్టి అవినీతి, అక్రమాలకు పాల్పడడంతోపాటు హత్యలు చేయడానికి సైతం వెనుకాడని వారు నాయకులుగా చలామణి అవుతున్నారు. అవినీతి కేసులలో విచారణ ఎదుర్కొంటున్నవారు, జైలుకు వెళ్లిన వారికి స్వాగత సత్కారాలకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. మొదట్లో ఉత్తరాదికే పరిమితమైన ఈ సంస్కృతి ఇప్పుడు తెలుగునాట విస్తృతంగా వ్యాపించింది. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అవినీతి కేసులలో జైలుకెళ్లి 16మాసాల తర్వాత విడుదలై బయటకు వచ్చినపుడు వేలాదిమందితో ఊరేగింపు నిర్వహించారు. డజనుకు పైగా కేసులలో విచారణ ఎదుర్కొంటున్న ఆయనను ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం ప్రజాస్వామ్యంలో విషాదం కాదా? ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా బెయిల్‌పై విడుదలైనప్పుడు భారీగా స్వాగతం పలికారు. ప్రస్తుతం ఆయన ఎంపీగా ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఈ కేసులో ఆమెను విచారించడానికి గత ఆదివారంనాడు సీబీఐ అధికారులు వచ్చినప్పుడు భారత రాష్ట్ర సమితికి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో గుమికూడి ఆమెకు సంఘీభావం ప్రకటించారు. కవితకు మద్దతుగా హైదరాబాద్‌లో పలుచోట్ల హోర్డింగ్స్‌ ఏర్పాటుచేశారు. తాజాగా తన కారు డ్రైవర్‌ను హత్యచేసి శవాన్ని డోర్‌ డెలివరీ చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిలుపై విడుదలైనప్పుడు వేలాది మంది రాజమండ్రి జైలు నుంచి ఆయనను ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ సంఘటన చూసిన వారికి సిరివెన్నెల రాసిన పాట మళ్లీ గుర్తుకొచ్చింది. రాష్ట్రం కోసం లేదా ప్రజలకోసం పోరాడి అనంతబాబు జైలుకు వెళ్లలేదు. తన దగ్గర పనిచేసే దళిత వర్గానికి చెందిన డ్రైవర్‌ను చంపి శవాన్ని డోర్‌ డెలివరీ చేసినట్టు కేసు నమోదైంది. పోలీసులు అతడ్ని అరెస్టు చేసి దాదాపు ఆరు నెలలు జైల్లో నిర్బంధించారు. సుప్రీంకోర్టు తాజాగా ఆయనకు బెయిలు మంజూరు చేసింది. దీంతో స్వాతంత్య్ర ఉద్యమకారుడు మహాత్మాగాంధీకి కూడా లభించనంతగా భారీగా అనంతబాబుకు స్వాగత సత్కారాలు జరిగాయి. జై బాబు – జైజై బాబు అంటూ నినాదాలు మార్మోగాయి. ఈ రోత కార్యక్రమంలో మహిళలు కూడా పాల్గొనడం విశేషం. రాజకీయ కక్షతో తమపై కేసులు నమోదు చేసి వేధిస్తున్నారని చెప్పుకొంటూ నేరం చేసి కూడా తప్పించుకోవడం రాజకీయ నాయకులకు అలవాటుగా మారిపోయింది. అధికారంలో ఉన్నవారి చర్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. రాజకీయ ప్రత్యర్థులను కేసులలో ఇరికించి వేధించడంతోపాటు అప్పటి వరకు మౌనంగా ఉంటూ వచ్చిన ఏజెన్సీలు హఠాత్తుగా పాత కేసులకు బూజు దులిపి చర్యలకు ఉపక్రమించడం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విషయమే తీసుకుందాం. తండ్రి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ ఏమి చేశాడో కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి అప్పుడు తెలియదా? తమకు విధేయులుగా ఉంటున్నారు కదా అని ఏం చేసినా, ఎంత అవినీతి జరిగినా నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రి పదవి దక్కకపోవడంతో కాంగ్రెస్‌ అధిష్ఠానాన్ని జగన్మోహన్‌ రెడ్డి ధిక్కరించారు. సొంత పార్టీ పెట్టుకున్నారు. దీంతో సీబీఐ కేసులు వచ్చిపడ్డాయి. జగన్మోహన్‌ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నప్పుడే చట్టం తన పని తాను చేసి ఉంటే ఆయనపై అప్పుడే కేసులు నమోదై జైలుకు వెళ్లి ఉండేవాడు. అలా జరగకపోవడంతో పార్టీని ధిక్కరించినందుకే తనపై సీబీఐ కేసులు పెట్టారని ఒక వర్గం ప్రజలను జగన్‌ నమ్మించగలిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూశాం. గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా జగన్‌పై కేసులు పుష్కరం దాటినా విచారణకు నోచుకోవడం లేదు. కేంద్రంలో అనుకూల ప్రభుత్వం ఉండడమే ఇందుకు కారణమంటే కాదని ఎవరైనా ఎలా చెప్పగలరు? ఈ దిక్కుమాలిన రాజకీయాలవల్ల ఏజెన్సీలు స్వతంత్రత కోల్పోయి అధికారంలో ఉన్నవారి అడుగులకు మడుగులొత్తడంవల్లనే... అవినీతిపరులు, నేరస్థులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికవడంతోపాటు అధికారం కూడా చలాయించగలుగుతున్నారు. ఈ పరిస్థితిని సంస్కరించడానికి సిరివెన్నెల జీవించి ఉంటే మరో పాట రాసివుండేవారు. నిజానికి జగన్మోహన్‌ రెడ్డి అవినీతికి పాల్పడ్డారని అత్యధికులు నమ్ముతున్నారు. విచారణ ఏజెన్సీలు, న్యాయ వ్యవస్థలకు కూడా ఆ విషయం తెలుసు. కొంతమంది మాత్రం ఎవరు మాత్రం అవినీతికి పాల్పడలేదు అంటూ దీర్ఘాలు తీస్తుంటారు. అవినీతిపరుడు అని ప్రజలకూ తెలిసినా జగన్‌ ముఖ్యమంత్రి కాగలిగారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అవినీతికి వ్యతిరేకంగా ఆయన ఇప్పుడు మాట్లాడగలుగుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున మంత్రులు అవినీతికి దూరంగా ఉండాలని ఆయన తాజాగా సెలవిచ్చారు. ఆ వెంటనే ‘‘నేను మాత్రమే అవినీతి చేస్తాను! మీకు ఆ చాన్స్‌ లేదు’’ అంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేలాయి. ముఖ్యమంత్రిగా కూడా జగన్రెడ్డి అవినీతికి పాల్పడుతున్న విషయం అందరికీ తెలుసు. అవకాశాన్ని బట్టి మంత్రులు, శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్‌లో ఎలా రెచ్చిపోతున్నారో కూడా బహిరంగ రహస్యమే. జగన్‌పై సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులలో త్వరితగతిన విచారణ పూర్తయి శిక్ష పడివుంటే ఈ పరిస్థితి ఉండేదా? వ్యవస్థలో ఉన్న వారిలో భయం ఏర్పడేది కదా! అలా జరగకపోవడంవల్లనే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా కూడా జగన్మోహన్‌ రెడ్డి తప్పులు చేయగలుగుతున్నారు. ఈ పరిస్థితికి ఎవరిని నిందించాలి? చట్టం తన పని తాను చేసుకుపోయే పరిస్థితి లేకుండా చేయడంవల్లనే జగన్‌ వంటి వారు చెలరేగి పోతున్నారు. రేవంత్‌ రెడ్డి విషయమైనా, కవిత విషయమైనా ఇదే పరిస్థితి. నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సఖ్యత ఉండి ఉంటే ఓటుకు నోటు కేసే ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్‌ ఘర్షణకు దిగి ఉండకపోతే ఢిల్లీ లిక్కర్‌ కుంభకోణంలో కవిత ఇరుక్కుని ఉండేవారు కారు. నిజానికి ఈ లిక్కర్‌ కుంభకోణంలో నిందితుడుగా అరెస్టయి తీహార్‌ జైల్లో ఉన్న శరత్‌ చంద్రారెడ్డికి చేకూరిన లబ్ధి కూడా ఏమీ లేదు. ఆయనకు మూడు వందల యాభై కోట్లకు పైగా నష్టం జరిగింది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వంతో కేంద్రానికి జగడం ఉన్నందున ఈ వ్యవహారాన్ని తవ్వి తీశారు. శరత్‌ చంద్రారెడ్డి, కవిత వంటి వారు దురాశకు పోయి ఇరుక్కుపోయారు. ఈ కారణంగానే కవిత కూడా ఎదురుదాడికి దిగారు. భారత రాష్ట్ర సమితి శ్రేణులు ఆమెకు మద్దతుగా నిలిచాయి. ఇలాంటి పెడధోరణులు ప్రబలడం వల్లనే అవినీతిని ప్రజలు కూడా పట్టించుకోవడంలేదు. అవకాశాలు లేని వారు మాత్రమే అవినీతి గురించి మాట్లాడతారు అని ఛలోక్తులు విసురుతున్నారు.

అందరికీ... అన్నీ తెలిసినా...

రాజకీయ నాయకుల పోకడలు, వారిపై నమోదవుతున్న కేసులలో చోటుచేసుకుంటున్న పక్షపాత వైఖరి కారణంగా హత్యానేరాలకు పాల్పడుతున్న వారు కూడా రెచ్చిపోతున్నారు. అనంతబాబు ఉదంతమే ఇందుకు నిదర్శనం. తన దగ్గర పనిచేసే డ్రైవర్‌ను ఆయన దారుణంగా చంపడమో, చంపించడమో చేశాడని స్థానిక ప్రజలందరికీ తెలుసు. అయినా దర్జాగా బెయిలుపై విడుదలై ఊరేగింపుగా ఇంటికి చేరాడు. అనంతబాబుపై నమోదైనది హత్య కేసు. కోడి కత్తి కేసులో దాదాపు నాలుగు ఏళ్లుగా జైలులో మగ్గుతున్న శ్రీనివాస్‌పై నమోదైంది హత్యాయత్నం కేసు. హత్య కేసులో జైలుకెళ్లిన వ్యక్తికి ఆరు నెలల్లో బెయిలు వచ్చినప్పుడు, హత్యాయత్న నేరాభియోగం ఎదుర్కొంటున్న వ్యక్తికి నాలుగేళ్లవుతున్నా బెయిలు కూడా లభించకపోవడానికి కారణం ఏమిటి? ఎవరు కారకులు? ఎన్నికల సందర్భంగా కోడి కత్తి కేసు వల్ల రాజకీయ ప్రయోజనం పొందినది జగన్మోహన్‌ రెడ్డి మాత్రమే! రాజకీయాల కారణంగానే ఈ కేసు విచారణను ఎన్‌ఐఏకు అప్పగించారు. ఎన్‌ఐఏ దర్యాప్తు ఇప్పుడు ఏ దశలో ఉన్నదో? దర్యాప్తులో ఏమి తేల్చారో కూడా ఎవరికీ తెలియదు. ఎన్నికల్లో లబ్ధికోసం జగన్మోహన్‌ రెడ్డి తనపై దాడి డ్రామా ఆడించారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఈ కేసు గురించి కనీసం ఆరా కూడా తీయకపోవడం గమనార్హం. నిందితుడు నిరుపేద దళితుడు కావడంతో అతడిని ఎవరూ పట్టించుకోరు. ఫలితంగా నేరానికి మించిన శిక్ష అనుభవిస్తున్నాడు. కేసు విచారణ ఎప్పుడు పూర్తవుతుందో, ఎప్పుడు బెయిలు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి! ఇంచుమించుగా కోడికత్తి సంఘటన జరిగిన సమయంలోనే వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య జరిగింది. చిన్నాన్న హత్యను రాజకీయ ప్రయోజనాల కోసం గరిష్ఠంగా వాడుకున్న జగన్మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏం చేస్తున్నారో అందరికీ తెలిసిందే. వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్‌ సునీత పట్టుదలగా పోరాడటం వల్లే కేసు దర్యాప్తు బాధ్యతను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ దర్యాప్తు దాదాపుగా పూర్తయింది. ప్రధాన నిందితులు ఎవరో కూడా గుర్తించారు. అయినా వారిని అరెస్టు చేయకుండా అదృశ్య శక్తులు అడ్డుపడుతున్నాయి. కోడి కత్తి కేసులో హత్యాయత్నం ఆరోపణలు మాత్రమే ఎదుర్కొంటున్న యువకుడు జైల్లోనే మగ్గుతుండగా వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారు. డ్రైవర్‌ హత్య కేసులో కొద్ది కాలం మాత్రమే జైలుకు వెళ్లిన అనంతబాబు దొరబాబువలె బాజాబజంత్రీలతో స్వాగత సత్కారాలు అందుకున్నారు. ఈ మూడు కేసులను విశ్లేషిస్తే – సామాజిక నేపథ్యంతోపాటు అధికారం, డబ్బు ఉంటే ఎంతటి నేరానికి పాల్పడినా శిక్ష పడకుండా తప్పించుకోవచ్చునన్న అభిప్రాయం కలగకుండా ఉంటుందా? ఈ నేపథ్యంలో ఈ సిగ్గు లేని సమాజాన్ని నిగ్గదీసి అడగాలా? లేక రాజకీయ, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలను నిగ్గదీసి అడగాలా అన్న మీమాంస ఏర్పడుతుంది. ఈ ప్రశ్నకు ఎవరు సమాధానం చెప్పాలి? పరిస్థితిలో మార్పు రాని పక్షంలో నేరస్థులే రాజ్యమేలుతారు.

న్యాయ వ్యవస్థపైనా నజర్‌...

దేశంలో వ్యవస్థలన్నీ కుప్పకూలుతున్నాయి. ఇప్పుడు న్యాయ వ్యవస్థ వంతు వచ్చింది. మన న్యాయ వ్యవస్థ పులు కడిగిన ముత్యమని చెప్పలేంగానీ మిగతా వ్యవస్థలతో పోల్చితే ఎంతో కొంత స్వతంత్రంగానే పనిచేస్తోంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కన్ను దానిపై పడింది. కొలీజియం వ్యవస్థ పోవాలని అధికారంలో ఉన్నవారు కోరుకుంటున్నారు. ప్రస్తుత కొలీజియం వ్యవస్థలో లోపాలు లేవని కాదు. అలా అని న్యాయమూర్తుల నియామకం ప్రభుత్వం చేతిలోకి వెళితే ఇపుడున్న పరిస్థితులలో ఎలాంటి వారు న్యాయ వ్యవస్థలోకి వస్తారో ఊహించుకోవచ్చు. కొలీజియం వ్యవస్థలోని లోపాలను సరిదిద్దడానికి సహకరించవలసిన పాలకులు ఆ వ్యవస్థే ఉండకూడదని కోరుకోవడంలోనే దురుద్దేశం ఉంది. అస్మదీయుల విషయంలో ఒకలా, తస్మదీయుల విషయంలో మరోలా నడుచుకొనే పరిస్థితికి ఏజెన్సీలను దిగజార్చిన రాజకీయ నాయకుల చేతుల్లోకి న్యాయ వ్యవస్థ కూడా పోతే దేశంలో సంపూర్ణ, శాశ్వత సూర్యగ్రహణం ఏర్పడినట్టే! అంటే ఇక మిగిలేది చీకటే! చట్టం తన పని తాను చేసుకుపోయే వెసులుబాటును కల్పించకపోవడం వల్లనే నేరస్థులకు వెసులుబాటు లభిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం బయటకు రావడంలో ప్రధాన పాత్ర పోషించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డికి ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. పాత కేసులను తిరగేసి ఇప్పుడు నోటీసు ఇచ్చారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో రోహిత్‌ రెడ్డి ఫిర్యాదుదారు అయివుండకపోతే ఇప్పుడు ఈ నోటీసులు వచ్చివుండేవి కాదన్నది జనాభిప్రాయం. ఈ అభిప్రాయం కలగడానికి కూడా పాలకులే కారణం. రోహిత్‌ రెడ్డి నిజంగా తప్పు చేసి ఉంటే ఈడీ అధికారులు ఇంతకాలం ఏమి చేశారు? ఇలాంటి ప్రశ్నలకు అవకాశం ఇవ్వడం వల్లనే తప్పుచేసిన వారు కాలర్‌ ఎగరేసుకుంటూ దర్జాగా తిరగగలుగుతున్నారు. ప్రజలు కూడా తాత్కాలిక ప్రయోజనాలకోసం వారికి జై కొడుతున్నారు. అందరూ శాకాహారులే! బుట్టలో రొయ్యలు మాత్రం మాయమయ్యాయి అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. సమాజాన్ని సిగ్గు లేకుండా మార్చివేస్తున్న రాజకీయ వ్యవస్థను ముందుగా ప్రక్షాళన చేయకుండా ఆజాదీకా అమృత్‌ మహోత్సవాలు జరుపుకొనే అర్హత మనకుందా? 250 సంవత్సరాలు పాలించిన తెల్లవాడి ఏలుబడిలో కూడా జరగనంతగా 75 ఏళ్ల స్వీయ పాలనలో నైతిక విలువల ధ్వంసం జరిగింది. అయినా మేరా భారత్‌ మహాన్‌ అని గర్వపడటం ఆత్మవంచన అవదా? ఇప్పుడు నిగ్గదీసి అడగాల్సింది జనాన్ని కాదు– జనాన్ని అలా సిగ్గు లేకుండా చేసిన రాజకీయ నాయకులను! ఈ మార్పు ప్రతిపాదించినందుకు సిరివెన్నెల సీతారామ శాస్ర్తిగారి ఆత్మ మన్నిస్తుందని ఆశిస్తున్నాను!

విషం చిమ్మే వ్యూహాలు

ఈ విషయం అలా ఉంచితే, కాంగ్రెస్‌ పార్టీ వ్యూహకర్త కనుగోలు సునీల్‌ కార్యాలయంపై తెలంగాణ పోలీసులు దాడి చేసి... ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కించపరిచే విధంగా పోస్టులు పెడుతూ దుష్ప్రచారం చేస్తున్నందుకు కేసులు పెట్టారు. నిజానికి ఇదొక శుభపరిణామం. ప్రస్తుత రాజకీయాలు భ్రష్టుపట్టి పోవడానికీ, అనర్హులు అందలమెక్కడానికి ఈ ‘సో కాల్డ్‌’ వ్యూహకర్తలు సాగించిన, సాగిస్తున్న దుష్ప్రచారమే కారణం. 2014కు ముందు కేంద్రంలో అధికారంలో ఉన్న యుపీఏ ప్రభుత్వంపై ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున సాగిన విష ప్రచారమే నేటి పరిణామాలకు శ్రీకారం చుట్టాయి. న్యాయ సమీక్షలో వీగిపోయిన 2జీ స్పెక్ట్రమ్‌ స్కాం వగైరాల విషయంలో నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంపై, ప్రస్తుతం దేశంలోనే నంబర్‌ వన్‌ వ్యూహకర్తగా పేరు గడించిన ప్రశాంత్‌ కిశోర్‌ ఆధ్వర్యంలో జరగని దుష్ప్రచారమంటూ లేదు. ప్రశాంత్‌ కిశోర్‌ ‘వ్యూహం’ అనే విష ప్రచారం ఫలించి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పదవిని అలంకరించారు. అంతే, అప్పటి నుంచి రాజకీయ పార్టీలన్నీ వ్యూహకర్తలను నియమించుకోవడానికి పోటీ పడ్డాయి. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగివున్న నాయకులు సైతం తమకు రాజకీయ ఎత్తుగడలే తెలియదన్నట్టుగా వ్యూహకర్తలకోసం అర్రులు చాచారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ కూడా 2014కు ముందు ప్రశాంత్‌ కిశోర్‌ వద్ద పనిచేసిన కనుగోలు సునీల్‌ను వ్యూహకర్తగా నియమించుకుంది. వ్యూహకర్తలు చేసింది, చేస్తున్నదీ ఏమిటంటే– నెగెటివ్‌ ప్రచారం చేయడమే. నరేంద్ర మోదీకి అనుకూలంగా, మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో సాగిన ఈ ప్రచారం ఆ తర్వాత రాష్ర్టాలకు విస్తరించింది. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌ రెడ్డి కోసం పనిచేసిన ప్రశాంత్‌ కిశోర్‌ నాటి చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల మెదళ్లను కలుషితం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కుల వైషమ్యాల విషబీజాలు నాటారు. ఆయన బృందం చేయని దుష్ప్రచారం అంటూ ఏదీ లేదంటే అతిశయోక్తి కాదు. ఫలితంగా జగన్మోహన్‌ రెడ్డి భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత మమతా బెనర్జీ, స్టాలిన్‌ వంటివారు ప్రశాంత్‌ కిశోర్‌ను చేరదీసి అందలం ఎక్కారు. దీంతో దేశ రాజకీయాల్లో సరికొత్త శకం మొదలైంది. దుష్ప్రచారమే రాజకీయ పార్టీలకు ప్రధాన ప్రచారాస్త్రం అయింది.

దేశవ్యాప్తంగా వ్యూహకర్తలు పుట్టుకొచ్చారు. ప్రశాంత్‌ కిశోర్కు చెందిన ఐ ప్యాక్‌ సంస్థకు చేతి నిండా పని దొరికింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రశాంత్‌ కిశోర్‌ సేవలను వాడుకోవాలని అనుకున్నారుగానీ ఎక్కడో తేడా వచ్చి అది ముందుకు సాగలేదు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున వ్యూహకర్తగా నియమితుడైన కనుగోలు సునీల్‌ తెలంగాణలో కూడా ఆ పార్టీకి పనిచేయడం మొదలుపెట్టారు. రాజకీయ వ్యూహాలను రచించడంలో కేసీఆర్‌ మిగతావారికన్నా ఒక అడుగు ముందుకే ఉంటారు. అలాంటి వ్యక్తి కూడా ప్రశాంత్‌ కిశోర్‌ గురించి ఆలోచించారంటే వ్యూహకర్తల ప్రాధాన్యం ఎంతగా పెరిగిపోయిందో ఆలోచించుకోవచ్చు. తత్వం బోధపడటం, లేదా మరో కారణం వల్ల కాబోలు కేసీఆర్‌ వ్యూహకర్తలను పక్కన పెట్టి సొంత వ్యూహాలతో ముందుకు వెళుతున్నారు. అంతటితో ఆగకుండా తన ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న కనుగోలు సునీల్‌ కార్యాలయంపైకి పోలీసులను ఉసిగొల్పారు. రాజకీయాల్లో విపరీత పోకడలను వ్యతిరేకించేవారు ఈ చర్యను స్వాగతించాల్సిందే. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో వ్యతిరేక ప్రచారం ఆరంభమైనప్పుడే మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకొని ఉంటే దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల బెడద తప్పిపోయి ఉండేది. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా ఈ పని చేసి ఉంటే ప్రశాంత్‌ కిశోర్‌ ఆట కట్టివుండేది. తమ మెదళ్లకు పదును పెట్టాల్సిన అవసరం లేకుండా, ప్రజల కోసం ఆలోచించకపోయినా 500 కోట్ల రూపాయలు తమవి కావనుకుంటే ముఖ్యమంత్రి అయిపోవచ్చునన్న ఆలోచన జగన్మోహన్‌ రెడ్డిని చూసిన తర్వాత చాలా మంది రాజకీయ నాయకులకు వచ్చింది. ఇంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉంటుందా? వ్యూహకర్తలు అనబడేవారు విషప్రచారంతో అనర్హులను అందలం ఎక్కించుకుంటూ పోతే రాష్ర్టాలు, దేశం ఏమి కావాలి? ఎన్నికల్లో ఎవరికి పార్టీ టికెట్‌ కేటాయించాలో కూడా ఈ వ్యూహకర్తలే నిర్ణయించడాన్ని మించిన దౌర్భాగ్యం ఉంటుందా? ఆయా పార్టీల్లోని సీనియర్‌ నాయకులు సైతం వ్యూహకర్తల చుట్టూ తిరగాల్సి రావడం ఏమిటి? రాజకీయ పార్టీ నడపలేనివాడు, సొంత ఆలోచనలతో ప్రజాభిమానం పొందలేనివాడు ముఖ్యమంత్రి అయి రాష్ర్టాన్ని ఎలా పరిపాలించగలడు? రాజకీయాలు కొంచెమైనా బాగుపడాలంటే వ్యూహకర్తల సంస్కృతి పోవాల్సిందే. ప్రజల నాడి తెలుసుకోవడానికి, సర్వేలు వగైరా చేపట్టడానికి ఏజెన్సీలు ఏర్పాటు చేసుకుంటే తప్పులేదు. ప్రత్యర్థి పక్షంపై కేవలం దుష్ప్రచారం చేయడానికి మాత్రమే వ్యూహకర్తలను నియమించుకోవడం, సోషల్‌ మీడియా సైన్యాలను నియమించుకోవడం ఏమిటి? సోషల్‌ మీడియా ద్వారా ప్రస్తుతం సాగుతున్న దుష్ప్రచారంలో ఏది నిజం? ఏది అబద్ధం? అన్న అయోమయం నెలకొంది. ఫలితంగా ప్రజలు తప్పుదోవ పడుతున్నారు. ప్రజల మెదళ్లు వాస్తవాలను గ్రహించలేనంతగా విషపూరితం అవుతున్నాయి. అందుకే కేసీఆర్‌ చర్యలను ఈ దుష్ట సంస్కృతి అంతానికి ఆరంభంగా చూడాలి. దుష్ప్రచారం ఆయుధంగా అధికారంలోకి వచ్చిన జగన్మోహన్‌ రెడ్డి, ఆ దుష్ప్రచారం వల్ల జరిగే నష్టం బాగా తెలిసినందునే తన ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టిస్తున్నారు. ఇదే ప్రాతిపదికన ఎన్నికలకు ముందు చంద్రబాబు ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసిన, చేయించిన జగన్‌ రెడ్డికి ఏ శిక్ష విధించాలి? బెటర్‌ లేట్‌ దేన్‌ నెవర్‌ అని అంటారు. ఇప్పటికైనా కేసీఆర్‌ పిల్లి మెడలో గంట కట్టారు. దేశంలో ఇకనైనా ఈ వ్యూహకర్తలు సాగించే దుష్ప్రచారం అనే బెడద తొలగిపోవాలని, పోతుందని ఆశిద్దాం!

ఆర్కే

Updated Date - 2022-12-18T07:59:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising