చమురు మాయ
ABN, First Publish Date - 2022-12-06T00:32:55+05:30
రష్యానుంచి ఎగుమతి అయ్యే చమురుపై జీ–౭ దేశాలు విధించిన ఆంక్షలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా చమురు బ్యారెల్ ధర గరిష్ఠంగా...
రష్యానుంచి ఎగుమతి అయ్యే చమురుపై జీ–౭ దేశాలు విధించిన ఆంక్షలు సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. రష్యా చమురు బ్యారెల్ ధర గరిష్ఠంగా అరవైడాలర్లు మాత్రమే ఉండాలని ఇటీవల ఈ గ్రూపు నిర్ణయించడం, ఆ నిర్ణయాన్ని సమర్థించే దేశాలకు తాను చమురు ఎగుమతులు నిలిపివేస్తానని రష్యా హెచ్చరించడం తెలిసిందే. అయితే, భారతదేశం తన ఇంధన ప్రాధాన్యతలకు అనుగుణంగానే నడుచుకుంటుందని విదేశాంగమంత్రి జయశంకర్ చేసిన వ్యాఖ్యలను బట్టి, జీ–౭ విధించిన గరిష్ఠ ధరకు భారత్ కట్టుబడదనీ, రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో రాజీపడబోదనీ అర్థం చేసుకోవాలి.
ఉక్రెయిన్ యుద్ధంలో ఉన్న రష్యాను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు యత్నిస్తున్న పాశ్చాత్యదేశాలు, దాని భారీ చమురు ఎగుమతి ఆదాయాన్ని దెబ్బకొట్టేందుకు ఈ అరవై డాలర్ల గరిష్ఠధరను నిర్ణయించాయి. ఇది ట్రేడ్ అవుతున్న ధరకంటే ముప్పైశాతం తక్కువ. యూరోపియన్ దేశాలు తమ ఇంధన అవసరాలు చక్కగా నెరవేర్చుకుంటూ, భారతదేశానికి మాత్రం మరో విధంగా నడుచుకోమని చెప్పడం సరికాదని జర్మనీ విదేశాంగమంత్రి సమక్షంలో జయశంకర్ ఘాటుగానే వ్యాఖ్యానించారు. భారతదేశం కంటే యూరప్ అనేకరెట్లు అధికంగా రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నదని ఆయన గుర్తుచేశారు. రష్యా చౌక చమురు భారతదేశాన్ని ఈ కష్టకాలంలో ఆదుకుంటున్నదని ఆయన ఇప్పటికే పలుమార్లు మిగతా ప్రపంచానికి స్పష్టంచేశారు. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైనప్పటినుంచీ, రష్యానుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురు భారీగా హెచ్చుతూ వస్తున్నది. అక్టోబర్ లో ఇది రికార్డుస్థాయికి చేరింది. బ్యారెల్స్ లెక్కన చూస్తే ఇప్పుడు రష్యా చమురే ప్రథమస్థానంలో ఉంది.
రకరకాల ఆంక్షలతో రష్యాను లొంగదీసుకోవాలన్న పాశ్చాత్యదేశాల ప్రయత్నాలు యుద్ధం ఆరంభమైన గత ఎనిమిదినెలల్లో ఫలించిందీ లేదు, రష్యా వెనక్కుతగ్గిందీ లేదు. ఆంక్షలు ఆహారకొరత వంటి కొత్తసమస్యలు తెచ్చిపెట్టి, రష్యన్లను పీల్చిపిప్పిచేస్తున్నాయి తప్ప పుతిన్ ను మార్చలేకపోయాయి. ఆంక్షలు విధించడం ద్వారా ఒక దేశాన్ని నాశనం చేయడం తప్ప, పాలకులను దారికి తెచ్చిన చరిత్ర ఎన్నడూ లేదు. ఇక, యుద్ధకాలంలో ఎవరి ఒత్తిళ్ళకు లొంగకుండా రష్యా నుంచి చమురు దిగుమతి విషయంలో మనదేశం పట్టుదలగా ఉన్నందువల్ల చమురు చౌకగా దేశానికి దక్కుతున్నది. మరోపక్క, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. ప్రస్తుతం క్రూడాయిల్ ధర పదినెలల కనిష్ఠంలో ఉంది. ఈ కారణంగానే, ముడిచమురు ధరలకు అనుగుణంగా సవరిస్తే పెట్రోల్ ధర లీటరుకు కనీసం పదిరూపాయలు, డీజిల్ పద్నాలుగు రూపాయల వరకూ తగ్గించవచ్చునని విపక్షాలు గుర్తుచేస్తున్నాయి. గత ఆర్నెల్లలో ముడిచమురుధరలు నాలుగోవంతు పడిపోయినా, అధికధరలతో, ద్రవ్బోల్బణంతో సామాన్యులు బాధలుపడుతున్నా, ఓ రూపాయి తగ్గించడానికి మీకు చేతులు రావడం లేదేమీ అని కాంగ్రెస్ అగ్రనేతలు ట్వీట్లు చేస్తున్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన గత ఎనిమిదేళ్ళలో, అంతర్జాతీయ మార్కెట్ ధరల పతనంతో నిమిత్తంలేకుండా, రాష్ట్రాలకు కూడా పంచనక్కరలేని రీతిలో అనేకరెట్లు కొత్తరకం సుంకాలు విధిస్తూ లక్షలకోట్లు అదనంగా సంపాదించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు, గత పదేళ్ళలో రష్యాకు ఇచ్చినదానికంటే అధికంగా, ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైనప్పటినుంచి భారతదేశం చవుకైన రష్యా ముడిచమురుకోసం కేవలం ఏడునెలల కాలంలో ఇరవై బిలియన్ డాలర్లు ఖర్చుచేసినందున సహజంగానే ప్రజలకు మరింత లబ్ధి చేకూరాలి. కానీ, చవుకైన రష్యన్ ముడిచమురు దిగుమతి చేసుకొని, రిఫైన్ చేసి, తిరిగి యూరోపియన్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నవి మూడు అస్మదీయ బడా ప్రైవేటు రిఫైనరీలే. రష్యా చమురు దిగుమతులతో అత్యధికంగా లబ్ధిపొందుతున్నవి అవే. యుద్ధానికి ముందు రష్యా చమురు జోలికే పోని రెండు ప్రైవేటు కంపెనీలు ఈ యుద్ధకాలంలో మూడువంతుల రష్యన్ చవుక చమురు కొనుక్కొని భారీగా లాభపడ్డాయి. దేశ ప్రజల ఇంధన అవసరాలను 90శాతం తీర్చుతున్న ప్రభుత్వరంగ కంపెనీలకు రష్యా చమురులో వాటా అతితక్కువ కనుక, ప్రజలకు దక్కుతున్నదేమీ లేకపోయింది. దేశప్రయోజనాలు, ఇంధనభద్రత, సార్వభౌమత్వం, స్వతంత్రతల పేరుతో దేశప్రజలను నిలువునా దగా చేస్తున్న మరో అద్భుత విన్యాసం ఇది.
Updated Date - 2022-12-06T00:33:10+05:30 IST