ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారంతో సరి!

ABN, First Publish Date - 2022-11-22T02:37:14+05:30

ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో రెండువారాలుగా జరుగుతున్న వాతావరణ సదస్సు (కాప్) చెప్పుకోదగ్గ ఓ అంశంలో ముందడుగువేసి, ముగిసింది. వాతావరణ మార్పల వల్ల దెబ్బతిన్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈజిప్టులోని షర్మ్ ఎల్ షేక్‌లో రెండువారాలుగా జరుగుతున్న వాతావరణ సదస్సు (కాప్) చెప్పుకోదగ్గ ఓ అంశంలో ముందడుగువేసి, ముగిసింది. వాతావరణ మార్పల వల్ల దెబ్బతిన్న పేదదేశాలను ఆదుకొనేందుకు ‘విపత్తు పరిహార నిధి’ని ఏర్పాటుచేయడానికి సంపన్నదేశాలు ఈ సదస్సులో అంగీకరించాయి. వాతావరణ మార్పులతో తక్షణ తీవ్ర ప్రభావాలను చవిచూస్తున్న పేదదేశాలను ఆదుకోవడంకోసం ఈ నిధిని వినియోగించాలన్నది ఉద్దేశం. ముప్పైయేళ్ళుగా ‘లాస్ అండ్ డామేజస్’ ఒప్పందంమీద చర్చను సైతం ప్రతిఘటిస్తూ వచ్చిన ధనికదేశాలు, ఇన్నేళ్ళకు ఇలా దిగిరావడం, ఒప్పందం కుదర్చుకోవడం స్వాగతించవలసిన విషయం. గ్లోబల్ వార్మింగ్ వల్ల సంభవించే విపత్తులను ఎదుర్కోవడం కోసం సహాయం చేయమంటూ ధనికదేశాలపై పేదదేశాలు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ఫలించినప్పటికీ, ఆచరణ ఏమేరకు ఉంటుందో చూడాలి.

తుదిచర్చల సమయంలో తీవ్ర తర్జనభర్జనల మధ్య కొన్ని గంటలపాటు చర్చలు నిలిచిపోయి, ప్రతిష్ఠంభన ఏర్పడి, చివరకు ఆదివారం తెల్లవారుజామున ఈ ఒప్పందంతో కాప్ సదస్సు ముగిసింది. అత్యధిక కాలుష్య ఉద్గారాలతో భూ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడానికి ప్రధానంగా ధనికదేశాలు కారణమవుతున్న విషయం తెలిసిందే. ఉద్గారాల్లో తమ వాటా తక్కువగా ఉన్నప్పటికీ, ధనికదేశాల పాపానికి తాము కరువులు, వరదలు, తుపానులు ఇత్యాది ప్రకృతిబీభత్సాలకు బలైపోవలసి వస్తున్నదని పేదదేశాలు బాధపడుతున్నాయి. తమకు జరుగుతున్న ఈ నష్టాన్ని తీర్చాలన్న వాటి వాదనకు ఇంతకాలానికి ఫలితం దక్కింది. అభివృద్ధి చెందినదేశాలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు మార్గాల ద్వారా ధనాన్ని సమకూర్చి ఈ నిధిలో జమచేస్తారట.

నిధిని సమకూర్చడానికి ధనికదేశాలు సిద్ధపడటం మంచిదే కానీ, అవి దశాబ్దాలుగా కాలుష్య ఉద్గారాలను నియంత్రించడంలో, నివారించడంలో విఫలం చెందినందువల్లనే ఇప్పుడు డబ్బుతో ఆ పాపాన్ని కడిగేసుకోవడానికి సిద్ధపడ్డాయని అర్థం చేసుకోవాలి. వినాశనం దిశగా మానవాళి పోతున్నదశలో ఈ మాత్రం సహాయాన్ని సాధించడం కూడా ఎంతో కష్టమైపోయిందని ఐరాస ఎగ్జిక్యుటివ్ సెక్రటరీ వ్యాఖ్య గమనించదగ్గది.

ఒక గీతదాటితే పుడమి ఉష్ణోగ్రతలను నియంత్రించడం, తగ్గించుకోవడం కష్టమవుతుందనీ, అందువల్ల 2030 కల్లా కాలుష్య ఉద్గారాలను సగానికి తగ్గించి, 2050 కల్లా నెట్ జీరో లక్ష్యాన్ని సాధించాలని ఇంటర్ గవర్నమెంటల్ ప్యానెల్ ఇటీవల హెచ్చరించింది. విషవాయువులైన కార్బన్ డయాక్సయిడ్, మీథేన్, నైట్రస్ ఆక్సయిడ్లు వాతావరణంలో రికార్డుస్థాయికి చేరాయని మరో నివేదిక హెచ్చరించింది. పారిస్ ఒప్పందంలో గ్లోబల్ ఉష్ణోగ్రత సగటు పెరుగుదలను రెండు డిగ్రీల లోపు ఉంచాలని సంకల్పం చెప్పుకున్న విషయం, ఒకటిన్నర డిగ్రీల లోపే ఉండేట్టు చూస్తూ పారిశ్రామికీకరణ ముందుస్థితికి భూగోళాన్ని తీసుకుపోవాలన్న మరో మహదాశయం తెలిసినవే. గ్రీన్ హౌస్ వాయువుల నియంత్రణ లక్ష్యాన్ని ఇప్పటికిప్పుడు పూర్తిస్థాయిలో సాధించినా, ఆ రెండుడిగ్రీల లక్ష్యాన్ని చేరుకోవడం అసాధ్యమని ఐరాస వాతావరణమార్పుల నివేదిక ఈ మధ్యనే తేల్చేసింది. 2100 నాటికల్లా కనీసం రెండున్నర డిగ్రీల పెరుగుదలను చవిచూడక తప్పదని అది హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా నడుస్తాయన్న ఓ చిన్నఆశను కూడా ఈ సదస్సు నెరవేర్చలేదు. వాతావరణ నిధి కోసం ఏటా పదివేలకోట్ల డాలర్లు ఇస్తామని అభివృద్ధిచెందిన దేశాలు దశాబ్దం క్రితం ఇచ్చిన హామీ ఇప్పటికీ నెరవేరలేదనీ, అందువల్ల, ఈ కొత్త పరిహారనిధి ఏమేరకు సమకూరుతుందన్నది అనుమానమేనని నిపుణులు అంటున్నారు. నిధి విషయాన్ని అటుంచితే, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించుకోవడం, ఉద్గారాలను నియంత్రించుకోవడం వంటి అంశాల్లో కూడా ఒక నిర్దిష్టమైన లక్ష్యాలు ప్రకటించుకోకపోవడం విషాదం.

చమురు సహజవాయువు కంపెనీలకు చెందిన లాబీయిస్టులు గత ఏడాదితో పోల్చితే ఈ మారు సదస్సులో నాలుగోవంతు పెరిగి, శిలాజ ఇంధనాల చర్చలను, నిర్ణయాలను ప్రభావితం చేశారని నిపుణులు ఆరోపిస్తున్నారు. కాప్ సదస్సు ఉద్రిక్తతలకు వేదికగా, ఆరోపణలు, ప్రత్యారోపణల కేంద్రంగా సాగడం, ఏమంత గొప్ప నిర్ణయాలు చేయకుండానే ముగిసిపోవడం విచారకరం. ఎన్ని విపత్తులూ, ఉత్పాతాలూ చవిచూస్తున్నా ధనిక దేశాలు తమ స్వార్థాన్ని వదులుకోలేకపోతున్నాయి.

Updated Date - 2022-11-22T02:37:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising