ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాహుల్‌ సందేశం!

ABN, First Publish Date - 2022-12-27T02:29:54+05:30

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ సోమవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి సమాధిని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌గాంధీ సోమవారం మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి సమాధిని సందర్శించి ఆయనకు నివాళులర్పించారు. భారత్‌ జోడోయాత్రలో భాగంగా ఢిల్లీలో ఉన్న రాహుల్‌, మహాత్మాగాంధీతో పాటు మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిర, లాల్‌బహదూర్‌ శాస్త్రి, చరణ్‌సింగ్‌, రాజీవ్‌ సమాధులకు నివాళులర్పించారు. అక్కడితో ఆగకుండా ‘సదైవ్‌ అటల్’ లోపలకు వెళ్ళి, గులాబీపూలతో ఈ ఆరెస్సెస్‌, బీజేపీ నాయకుడికి కూడా నివాళులర్పించడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. బీజేపీ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా, సామాజిక శాంతి, దేశసమైక్యతలకోసం ఈ యాత్ర చేపట్టినట్టు రాహుల్‌ చెబుతున్నారు కనుక, ఇది ‘జోడోయాత్ర’ స్ఫూర్తికి అనుగుణంగానే ఉన్నదని అధికులు మెచ్చుకుంటున్నారు. రాహుల్‌ చర్యకు రాజకీయ ప్రభావమేమీ ఉండకపోయినా, మోదీ వైఖరికి భిన్నంగా, కచ్చితంగా సందేశాత్మకమైనదే.

వాజపేయి హయాంలోని బీజేపీకీ, ప్రస్తుతం మోదీ–షా గుప్పిట్లో ఉన్న బీజేపీకీ, అటల్‌కూ ఇప్పటి నాయకులకూ హస్తిమశకాంతరం ఉన్నదని రాహుల్‌ ఈ చర్యతో విప్పిచెప్పారనీ, ఇది ఒక తెలివైన రాజకీయ ఎత్తుగడని కొందరు విశ్లేషిస్తున్నారు. వాజపేయి మరణించిన నాలుగేళ్ళ తరువాత ఓ కాంగ్రెస్‌ నాయకుడు, అదీ గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తి ఆ స్మృతివనంలోకి ప్రవేశించడం ఇదే ప్రథమం. తన జీవితపర్యంతం స్వయంసేవకుడిగా ఉంటూ జాతీయవాదానికి కట్టుబడిన అటల్‌జీ ముందు మోకరిల్లిన రాహుల్‌ ఆయన ఆదర్శాలను ఆవాహన చేసుకుంటే మంచిదని బీజేపీ దెప్పిపొడుస్తూనే, ఇది ఫోటోలకు ఫోజులిచ్చే చర్య అని తీసిపారేస్తున్నది. తన యాత్రలో భాగంగా హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్డులో ఇందిర విగ్రహానికి దండలు వేసిన రాహుల్‌, ఆ పక్కనే ఉన్న పీవీ నరసింహారావు విగ్రహానికి ఎందుకు దణ్ణం పెట్టలేదని కూడా ప్రశ్నిస్తున్నది.

తాను అందరివాడిననీ, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఒక్కటిచేస్తున్నానని, కాంగ్రెస్‌ ముక్త్‌ భారత్‌ నినాదంతో నెహ్రూను సైతం విమర్శించే ఇప్పటి పాలకులకు తన ఆలోచనావిధానం భిన్నమని చెప్పుకోవడం రాహుల్‌ ఉద్దేశం కావచ్చు. అటల్‌ అధికారంలో ఉన్నప్పుడు ఆయనమీద కూడా తీవ్రవిమర్శలు చేసినా, అప్పట్లో కాంగ్రెస్‌ ప్రధానలక్ష్యం అడ్వానీయే. మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత, అటల్‌, అడ్వానీ వంటివారికి సముచితగౌరవం ఇవ్వనందుకు, వాజపేయి ఆస్పత్రిలో ఉన్నప్పుడు కూడా మోదీ పరామర్శించనందుకు కాంగ్రెస్‌ విమర్శించింది కూడా. ప్రత్యర్థులను కూడా గౌరవించే కాలానికి చెందిన వాజపేయికీ, వారిని తీవ్రంగా ద్వేషించే మోదీకీ ఎంతో తేడా ఉన్నదని ఎప్పటికప్పుడు కాంగ్రెస్‌ గుర్తుచేస్తూనే ఉంది. సాధారణ పరిస్థితుల్లో విమర్శలు చేసుకున్నా, వాజపేయి, పీవీ వంటివారు దేశం విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు విపక్షపార్టీలను కూడా కలుపుకొనిపోవడం, అంతర్జాతీయ వేదికలమీద భారత్‌ తరఫున వాదించడానికి వారిని పంపడం వంటివి జరిగాయి. ఇప్పుడు విపక్షాలకు విలువ ఇవ్వకపోగా, సంక్షోభ కాలంలోనూ సంప్రదింపులన్నవే లేకుండా, విదేశీగడ్డమీద కూడా వాటిని దుమ్మెత్తిపోయడం చూస్తున్నాం. ఇప్పుడు అటల్‌ సమాధిని సందర్శించినంత మాత్రాన బీజేపీ అధినాయకులు నెహ్రూను విమర్శించడం, గాంధీ కుటుంబీకులను తూలనాడటం ఆపివేస్తారన్న భ్రమ రాహుల్‌కు ఉండకపోవచ్చు. కానీ, అలనాటి పరస్పర గౌరవపూర్వకమైన రాజకీయానికి తాను కట్టుబడివున్నానన్న సందేశాన్ని మాత్రం ఆయన ఈ చర్యతో ఇవ్వగలిగారు. ఆదిలో రాహుల్‌ జోడోయాత్రను తీసిపారేసిన బీజేపీ, అది క్రమంగా బలపడుతున్నకొద్దీ తన విమర్శల స్థాయి పెంచింది. హక్కుల సంఘాలు, భిన్నవర్గాల వేదికలు, సాధారణ ప్రజలు, వివిధరంగాల ప్రముఖుల భాగస్వామ్యంతో, అనేకాంశాలపై చర్చలతో సాగుతున్న ఈ యాత్రను ఇప్పుడు ఏకంగా నిలిపివేయడానికే కరోనా బూచిని చూపిస్తున్నదని కాంగ్రెస్‌ అంటోంది. దేశంలో జూన్‌–సెప్టెంబరు మాసాలమధ్య బిఎఫ్‌7 వేరియంట్‌ కేసులు నమోదైతే, నవంబరు వరకూ ‘ఇన్సాకాగ్‌’ బులెటిన్లలో కూడా వాటిని చూపకుండా దాచిపెట్టి, మోదీ సహా బీజేపీ నాయకులంతా ర్యాలీలు, సభలు స్వేచ్ఛగా నిర్వహించుకొని, గుజరాత్‌ ఎన్నికలు ముగిశాక, రాహుల్‌ యాత్రను ఆపేయడానికి మోదీ ప్రభుత్వం కరోనా అస్త్రాన్ని ప్రయోగిస్తున్నదని కాంగ్రెస్‌ విమర్శ. ఇప్పుడు ఏకంగా అటల్‌కు అంజలిఘటించి రాహుల్‌ బీజేపీని మరింత తొందరపెడుతున్నారేమో తెలియదు.

Updated Date - 2022-12-27T02:29:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising