ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లూలా పునరుత్థానం!

ABN, First Publish Date - 2022-11-03T04:03:42+05:30

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డి సిల్వా విజయం సాధించారు. హోరాహోరీ పోరులో ఆయన అతితక్కువ తేడాతో ఒడ్డునపడ్డారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో లూలా డి సిల్వా విజయం సాధించారు. హోరాహోరీ పోరులో ఆయన అతితక్కువ తేడాతో ఒడ్డునపడ్డారు. ఆయన ప్రత్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడైన బోల్సోనారోకు 49.1 శాతం ఓట్లు దక్కితే, లూలాకు 50.9శాతం ఓట్లు వచ్చాయి. లాలూ పునరాగమనంతో బ్రెజిల్ ఇక బాగుపడుతుందని చాలామంది వ్యాఖ్యానిస్తున్నప్పటికీ, బ్రెజిల్ ఓటర్లు కుడి ఎడమల మధ్య నిలువునా చీలిపోయారని అర్థం. అయినప్పటికీ, బ్రెజిల్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరిగిన తరువాత, అధికారంలో ఉన్న అధ్యక్షుడు ఒక పదవీకాలంలోనే ఓటమి పాలు కావడం మూడుదశాబ్దాల్లో ఇదే మొదటిసారి. గతంలో రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా ఉన్న లూలా సుదీర్ఘ విరామం తరువాత కూడా తిరిగి అధికారంలోకి రాగలగడం చెప్పుకోదగ్గ విషయం.

ప్రపంచంలో ఎనిమిదవ ఆర్థికశక్తిగా ఉన్న బ్రెజిల్ లో ఈ వామపక్షనాయకుడు నెగ్గడంతో, లాటిన్ అమెరికాలో మెక్సికో నుంచి మొదలై అర్జెంటినా, చిలీ, కొలంబియా, పెరూ వరకూ ఇప్పుడు వామపక్షాలే అధికారంలో ఉన్నట్టు. యూరోపియన్‌ దేశాల్లో మితవాద భావనలున్న పార్టీలూ నాయకులు అధికారంలోకి వస్తున్న తరుణంలో, బోల్సోనారో వంటి గట్టి మితవాద నాయకుడిని అక్కడి జనం ఒకవిడతలోనే గద్దెదించేయడం విశేషం. ఇప్పుడు విజయం సాధించిన లూలా అవినీతి ఆరోపణలమీద మూడేళ్ళక్రితం కొంతకాలం జైలులో ఉండివచ్చినవ్యక్తి. బ్రెజిల్ సర్వోన్నత న్యాయస్థానం ఆయనమీద ఆరోపణలు కొట్టివేయడం అటుంచి, సామాన్యజనం కూడా ఆ ఆరోపణలను విశ్వసించలేదనడానికి ఈ ఫలితాలు నిదర్శనం. బోల్సోనారో అనుసరిస్తున్న మితవాదం, జాతీయవాదం, మార్కెట్ అనుకూల విధానాల మీద లూలా ప్రమాణం చేసిన సంక్షేమం, సంఘటిత సుస్థిర అభివృద్ధి, పై చేయి సాధించాయి. కరోనా కష్టకాలంలో బోల్సోనారో ప్రభుత్వం అనుసరించిన అపసవ్య విధానాల వల్ల సుమారు ఏడులక్షలమంది కన్నుమూశారు. అనంతరకాలంలో దేశం ఆర్థికంగా ఏ మాత్రం మెరుగుపడకపోగా, అన్ని రంగాల్లోనూ దేశం పతనమవుతున్న స్థితిలో తమ అధ్యక్షుడు మాటకారే కానీ, చేతలమనిషి కాదని జనానికి అర్థమైపోయింది.

వరుసగా రెండుసార్లు దేశాధ్యక్షుడిగా ఉన్న లూలా మూడవసారి పదవి చేపట్టడం అక్కడి రాజ్యాంగనిబంధన వల్ల సాధ్యం కాక తన మనిషిని ప్రతిష్ఠించారు. ఆ తరువాత బోల్సోనారో రావడంతోనే అవినీతి కేసులు లూలాను చుట్టుముట్టాయి. లూలా పార్టీని ప్రజల దృష్టిలో అప్రదిష్టపాల్జేయాలనుకున్న బోల్సోనారో తన చర్యలతో ప్రజల మనసులు మాత్రం గెలుచుకోలేకపోయారు. గతాన్ని కీర్తిస్తూ వర్తమానంలో ఏ మాత్రం ప్రజాస్వామ్యభావనలకూ, సంక్షేమానికి తావులేని రీతిలో పాలన సాగించాడు. మరీ ముఖ్యంగా అమెజాన్ అడవులు ఆయన పాలనలో విధ్వంసం కావడంతో యావత్ ప్రపంచానికి ఆయన నిజస్వరూపం తెలిసివచ్చింది. అడవుల పరిరక్షణలో స్థానిక సమాజాలకు అధిక భాగస్వామ్యాన్నిచ్చే చట్టాలను తిరగరాసి, వాటిని ధనికులు, పారిశ్రామికవేత్తలు యథేచ్ఛగా కొల్లగొట్టేందుకు వీలుకల్పించాడు. అమెజాన్ ప్రపంచ సొత్తు కాదనీ, అది బ్రెజిల్ ఆస్తి కనుక ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానన్న ఆయన వ్యాఖ్యలు, చర్యలు ప్రపంచాన్ని నివ్వెరపరిచాయి. ఎన్నికల ఫలితాల తరువాత కూడా ఆయనలో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ప్రపంచం చూసింది. తన ఓటమికి మీడియాను తప్పుబడుతూ, ఎన్నికల ప్రక్రియను విమర్శిస్తూ ఆయన ఫలితాలను ఆమోదించలేదు. ఆయన మద్దతుదారులు దేశంలోని ప్రధాన రహదారులను వాహనాలతో దిగ్బంధించారు. ఎక్కడికక్కడ నిరసనలు, ఆందోళనతో ప్రజలను భయభ్రాంతులను చేశారు. చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని తీవ్ర హెచ్చరికలతో, విస్పష్టమైన ఆదేశాలతో పరిస్థితిని చక్కదిద్దవలసి వచ్చింది.

‘నన్ను నిలువునా పాతేద్దామని చూశారు, అయినా సజీవంగా మీ ముందు ఉన్నాను’ అన్న లూలా వ్యాఖ్యల్లో వాస్తవం ఉంది. తనను రాజకీయంగా అంతం చేయడానికి జరిగిన అన్ని కుట్రలనూ ఆయన సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆయన గతపాలనలో దేశం ఆకలిని జయించింది, కోట్లాదిమంది దారిద్ర్యం నుంచి బయటపడ్డారు. అభివృద్ధి సంక్షేమాలను చక్కగా సమన్వయం చేస్తూ, అన్ని రంగాల్లోనూ దేశాన్ని పురోగతిబాట పట్టించారు. ఐదేళ్ళ పాలనలో బోల్సోనారో విభజన రాజకీయాలు నెరపుతూ దేశంలో ఆకలినీ, దారిద్ర్యాన్ని అధికం చేసిన నేపథ్యంలో గత విధానాలను, నిర్ణయాలను తిరగదోడి దేశాన్ని గాడినపడవేయవలసిన బాధ్యత కొత్త అధ్యక్షుడిమీద ఉంది.

Updated Date - 2022-11-03T04:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising