ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలోచన, అనుభవం, అచ్చుపుస్తకం!

ABN, First Publish Date - 2022-12-22T03:04:07+05:30

జెనరేషన్ జడ్ లేదా జెనరేషన్ జి. 1990ల చివరి సంవత్సరాల నుంచి 2010 మధ్య కాలంలో పుట్టినవాళ్లు. వీళ్లని జెన్ జీయర్లు అని జూమర్లు అని కూడా అంటారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జెనరేషన్ జడ్ లేదా జెనరేషన్ జి. 1990ల చివరి సంవత్సరాల నుంచి 2010 మధ్య కాలంలో పుట్టినవాళ్లు. వీళ్లని జెన్ జీయర్లు అని జూమర్లు అని కూడా అంటారు. వీళ్లు మిలెనియల్స్ అని పిలిచే జనరేషన్ ఎక్స్ పిల్లలన్నమాట. ఎక్స్ కంటె ముందు తరం బేబీ బూమర్స్. జెన్ జీయర్ల తరువాత వచ్చే తరం జెన్ ఆల్ఫా. ఇదంతా పశ్చిమదేశాలలో ప్రాచుర్యంలో ఉన్న సామాజిక సాంస్కృతిక తరాల వర్గీకరణ. ఇప్పుడు పాతికేళ్లకు అటూ ఇటూగా ఉన్నవాళ్ల దగ్గర నుంచి పది పన్నెండేళ్ల వయస్సువారి దాకా ఉన్న జెన్ జీయర్లు, ఇంటర్నెట్ అవతరించిన తరువాత పుట్టి, దాని వ్యాప్తిని, స్మార్ట్ ఫోన్ల ఉధృతిని మొదటగా అనుభవంలోకి తీసుకున్నవాళ్లు. వీళ్లు డిజిటల్ దేశానికి మూలవాసులు. ముందుతరం వాళ్లకంటె వీళ్లు యవ్వనాన్ని నిదానంగా గడుపుతున్నారు. 1960ల తరంతో పోలిస్తే ఏమంత సుఖవాదులు కూడా కాదు. మద్యం, సిగరెట్ వంటి సాంప్రదాయ వ్యసనాలు తక్కువే. ఇట్లా ఈ తరానికి ఎన్నో కొత్త లక్షణాలున్నాయి. అనేక కొత్త సమస్యలూ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వస్తువులతో ఎక్కువ సమయం గడుపుతారు. సెక్స్ చాట్ ఎక్కువే చేస్తారు కానీ, వాటి ఫలితాల గురించి, అసలు ఏ పర్యవసానాల గురించీ ఆలోచించరు. అచ్చు పుస్తకాల జోలికి వెళ్లరు, లేదా అతి తక్కువగా చదువుతారు. వీళ్లకు దేనిమీదా దృష్టి ధ్యాస నిలవదు, పదజాలం తక్కువ. చొరవా చాకచక్యమూ ఎక్కువే అయినా, బుర్ర తక్కువ.

పైన చెప్పిన విశేషాలన్నీ ప్రధానంగా అమెరికా, ఆస్ట్రేలియాల్లో, యూరప్ దేశాల్లో యువతరానికి సంబంధించినవి. సంపన్నదేశాలలో పెద్ద పెద్ద ఉద్యోగావకాశాలన్నీ, ఆసియన్ దేశాల యువకులకు రావడానికి కారణం, స్థానిక జెన్ జీయర్లలో కనిపించే క్షీణలక్షణాలే అని సామాజిక జనాభాశాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రపంచీకరణకాలంలో, ఒక తరం లక్షణాలు కొన్ని ప్రాంతాలకే పరిమితమై ఎంతో కాలం ఉండవు. భారత్ వంటి ఆసియన్ దేశాలలో కనీసం కొన్ని ఉన్నత సామాజిక శ్రేణుల్లో జెన్ జీయర్ లక్షణాలు ఇప్పటికే ఉండి ఉంటాయి. త్వరలో అవి బలంగానే వ్యక్తమవుతాయి, విస్తరిస్తాయి కూడా. ఇప్పుడు యువతరం అంటే దీర్ఘకాలం కొనసాగే జనాభా కాబట్టి, వారి గురించి కలవరంతో ఈ వివరాలు తెలుసుకుంటున్నాము. కానీ, ఇప్పుడు సజీవంగా ఉన్న మునుపటి తరాలు కూడా ఈ లక్షణాలకు కొద్దోగొప్పో లోనవుతున్నాయి. కారణం, డిజిటల్ సాధనాలు, సామాజిక మాధ్యమాలు. ఈ రెంటికీ సానుకూల లక్షణాలు లేవని కాదు, వాటి వల్ల సమకూరిన సార్వజనీనత, ప్రజాస్వామికత లేవని కాదు. భౌతికంగా, సారాంశంలోనూ కూడా డిజిటల్ సాధనాలు, తగినంత శ్రేష్ఠతను, జవాబుదారీతనాన్ని ప్రదర్శించలేకపోవడం కారణంగా మనుషులకు, సమాజానికీ దీర్ఘకాలికమైన చెరుపు చేస్తున్నాయి.

అమెరికాలో జెన్ జీయర్ల మీద తాజాగా ఒక అధ్యయనం చేశారు. ఆ తరం వారిలో నూటికి 33 మంది, వైద్య సలహాల విషయంలో డాక్టర్ల కంటె టిక్ టాక్ వీడియోలనే ఎక్కువ విశ్వసిస్తున్నారట. మరో 44 శాతం మంది యూట్యూబ్ వీడియోలను అధికంగా నమ్ముతున్నారట. ప్రతి అయిదుగురిలో ఒకరు డాక్టర్ దగ్గరకు వెళ్లడానికి ముందు టిక్ టాక్ చూస్తారట. వైద్య వ్యయం అధికంగా ఉండడం వంటి ఇతర కారణాలు ఉన్నాయి కానీ, అరచేతిలో ఎప్పుడూ సిద్ధంగా ఉండే స్మార్ట్ ఫోన్, నిపుణుల కంటె సామాజిక మాధ్యమాలలో ఉండే ప్రభావకారులు (ఇన్ఫ్లుయన్సర్స్) యువత నిర్ణయశీలతపై పెత్తనం చేస్తున్నాయని అర్థమవుతోంది. మరేదో కారణంతో టిక్ టాక్ను అమెరికా కూడా నిషేధించే దారిలో ఉన్నది కానీ, సమస్య టిక్ టాక్ కాదు. డిజిటల్ మాధ్యమాలలో వినోదం, విజ్ఞాన విషయాలపై పరిచయాత్మక లఘు చిత్రాలు ఉండవచ్చు, తప్పులేదు. కానీ, జ్ఞాన గ్రహణ విధానంలో ప్రధానంగా దేనిమీద ఆధారపడుతున్నాము అన్నది ప్రశ్న.

మానవచరిత్రలో లేఖనం, పఠనం ఎన్నో మజిలీలు దాటుకుని ఇప్పటి స్థితికి వచ్చాయి. రాతిమీద, రాగిరేకుల మీద, తాటియాకుల మీద, వస్త్రాల మీద, ముతక కాగితం మీద అక్షరాలు ఆయా దశలలో వేర్వేరు స్థాయిలలో సమాచారాన్ని, సందేశాలను, విజ్ఞానాన్ని, సృజనాత్మక అనుభవాన్ని అందించడానికి ప్రయత్నించాయి. అభివృద్ధి క్రమంలో జ్ఞాన ప్రసార సాధనాలు, రూపాలు కూడా మారడం సహజమే. సుమారు మూడు నాలుగువందల సంవత్సరాల నుంచి ఉనికిలో ఉన్న కాగితపు పుస్తకం, ఆధునిక యుగంలో మనిషికి గొప్ప సాహచర్యం అందించింది. ఇప్పుడు, డిజిటల్ సాధనాలు, ఈ సాహచర్యాన్ని బలహీనపరుస్తున్నాయి. అంతేకాదు, అక్షరం చేసిన ప్రయాణం ఇంతకాలం మానవమేధను మరింత విస్తృతం, దృఢం చేస్తూ రాగా, డిజిటల్ మజిలీ బలహీనపరుస్తున్నది, జ్ఞానేంద్రియాల గ్రహణపారీణతను అణచివేస్తున్నది.

రోజుకు కనీసం ఇరవై నిమిషాలు చదివే పిల్లలకు, ఏడాదికి ఇరవై లక్షల పదాలతో పరిచయం ఏర్పడుతుందట. టీనేజిలో చదివే అలవాటున్నవారికి, చదవనివారితో పోలిస్తే 25శాతం అధిక పదజాలంతో పరిచయం ఉంటుందట. చిన్నతనం నుంచి చదివే అలవాటున్నవారు, పెద్దవయసులో ఎక్కువ సమయం చదివేవారు వృద్ధాప్యంలో మేధాశక్తి క్షీణతను తక్కువగా ఎదుర్కొంటారట. పుస్తకపఠనం మానసిక ఒత్తిడిని 70శాతం దాకా తగ్గిస్తుందట. నిద్రపోవడానికి ముందు చదివేవారిలో నిద్ర నాణ్యత యాభైశాతానికి పైగా పెరుగుతుందట. నవలలు, కథలు వంటి కాల్పనిక వచన సాహిత్యం చదివేవారికి, ఉద్యోగ వ్యాపారాలలో నిర్ణయ కౌశల్యం బాగా పెరుగుతుందట. అమెరికాలో ఏటా 75 వేల డాలర్ల ఆదాయం కలిగినవారిలో నూటికి 86 మంది ఏడాదికి కనీసం ఒక పుస్తకం అయినా చదువుతారట. అమెరికాలో ఒకప్పుడు వయోజన జనాభాలో సగం మంది దాకా సాహిత్యాన్ని చదివేవారట. ఇప్పుడు ఆ శాతం బాగా తగ్గిపోయింది. అమెరికా కంటె, అనేక యూరప్ దేశాల కంటె భారతదేశంలోని చదువరులలో వారంలో పుస్తకపఠనం చేసే గంటల సంఖ్య అధికంగా ఉన్నది. కానీ, భారతదేశంలో అక్షరాస్యత, పాక్షిక అక్షరాస్యత పాళ్లను, విద్యాధికులలో కూడా చదువరుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే, పరిస్థితి ఏమంత ఆశావహంగా లేదు. ఇక వేగంగా వ్యాపిస్తున్న డిజిటల్ సాధనాల కారణంగా, అనేకమంది పరిమిత అక్షరాస్యులు, విద్యాధికులు పుస్తక పఠనానికి దూరంగా ఉంటున్నారు.

కేవలం పుస్తకపఠనానికి ఉద్దేశించిన కిండిల్ వంటి ఈ–రీడర్ల వల్ల అపకారం కంటె ఉపయోగమే అధికం. సంపన్నదేశాలలో సైతం ఈ–రీడర్ల పఠనాన్ని పుస్తకపఠనంతో సమానంగా పరిగణిస్తున్నారు. పుస్తకం చదువుతున్న అనుభూతినే ఇవ్వడం, ఒక చిన్న సాధనంలో అనేక పుస్తకాలను నిల్వచేసుకునే, చదువుకునే అవకాశం ఉండడం, నిర్మితంగా నిఘంటువు ఉండడం వంటి సదుపాయాలతో కాగితపు పుస్తకాన్ని మించిన ప్రయోజనం ఈ–రీడర్లు అందిస్తున్నాయి. సాధ్యమైనంతవరకు ఈ–రీడర్ల తెర కాంతి కంటికి అలసట కలిగించకుండా కూడా ఈ–రీడర్లు జాగ్రత్త వహిస్తున్నాయి. దురదృష్టవశాత్తూ, ఈ–రీడర్లను మరింతగా అభివృద్ధి చేయడం మీద ఆయా కంపెనీలు శ్రద్ధ వహించడం మానేశాయి. స్మార్ట్ ఫోన్లలోనే ఈ–రీడింగ్ యాప్లను జోడించి, అందించడం మీదే దృష్టి పెట్టాయి. అమెజాన్ కూడా ఫైర్ టాబ్లెట్, ఫోన్ల తయారీ చేపడుతోంది. పుస్తకానికి, ఈ రీడర్కు ఉండే ప్రధాన లక్షణమైన ఏకాగ్రతను స్మార్ట్ ఫోన్లు దెబ్బతీస్తాయి. కంటికి హాని చేస్తాయి. మేధాశక్తిని బలహీనపరుస్తాయి.

పుస్తకం చదవడానికి మనం ఉద్యుక్తులమవుతున్నప్పుడు, కాలాన్ని, స్థలాన్ని ఏర్పరచుకుంటాము. అంతరాయాలు అసలే ఉండవనలేము కానీ, పరిమితం చేసుకోగలుగుతాము. పఠనంలోకి దిగిన తరువాత ఒక ఆవరణంలోకి ప్రవేశించి, అందులోనే నిమగ్నం అవుతాము. పదే పదే దృశ్యాన్ని రిఫ్రెష్ చేసే తెర ఉండదు, ఉన్నట్టుండి పలకరించే నోటిఫికేషన్లు ఉండవు, లింకులతో, మరేదో పాప్ అప్లతో మన దృష్టి మరోవైపు మళ్లదు. అక్షరాల నుంచి కాల్పనిక సాహిత్యమో, కవిత్వమో, విజ్ఞాన విషయమో, సిద్ధాంత అంశమో మన బుద్ధి జాగ్రత్తగా, ఒక క్రమపద్ధతి ప్రకారం గ్రహిస్తూ ఉంటుంది. చదువుతున్నప్పుడు అనుభూతి కానీ, అధ్యయనం కానీ ఆయా పాఠ్యాలు అందించే తీరులో పాఠకులకు అందుతాయి. సృజనను గ్రహించి, దృశ్యాలనో, భావుకతనో ఊహించుకుంటాము, పాత్రలకు రూపురేఖలను ఆపాదించుకుంటాము. చిత్రించిన పరిస్థితులను, వాటిలోని సమస్యలను అర్థం చేసుకుంటాము, ఒక సావధానస్థితిలో విజ్ఞానాంశాలను నిక్షిప్తం చేసుకుంటాము. డిజిటల్ సాధనాలలో చదువు మనలను నిలకడగా ఉండనివ్వదు. తేలికపాటి చదువుకు, వినోద రచనలకు కొంత పనికివస్తుందేమో కానీ, అవగాహనకు, అధ్యయనానికి, అభ్యసనానికి డిజిటల్ సాధనాలు పెద్దగా ఉపయోగపడవు.

ప్రపంచంలో అన్ని దేశాలూ విద్యాభ్యాసంలో అచ్చుపుస్తకాలను, చేతిరాతను విధిగా కొనసాగిస్తున్నాయి. పరీక్షలను కూడా చేతిరాతతోనే నిర్వహిస్తున్నాయి. ఫోన్ కెమెరాలు వచ్చినా సాంప్రదాయిక కెమెరాలే గౌరవం అందుకుంటున్నాయి. డిజిటల్ రూపంలో వచ్చే పుస్తకాలు, ఫోటో తీసిన పేజీలలో అక్షరాలను కూడా వేరుచేసి చదవగలిగిన టెక్నాలజీ, ఈ–రీడర్లు ఇవన్నీ పుస్తకాల ప్రయాణంలో ముఖ్యమైన పురోగతులే. కానీ, అనేక తపోభంగాలకు ఆస్కారమిచ్చే స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్లు అధ్యయనానికి, అభిరుచి పఠనానికి పనికిరావు. సమాచార సమృద్ధి వల్ల, అనేక వాచకాల ముమ్మరం వల్ల జ్ఞానం పెరగదు. తార్కిక శక్తి, వివేచన, ఊహాసామర్థ్యం వీటికి ఆస్కారమిచ్చే జ్ఞాన ప్రసార సాధనం మన బౌద్ధిక, మానసిక వికాసానికి పూచీపడుతుంది. ప్రస్తుతానికి, అది అచ్చుపుస్తకం.

ఈ ఏడాదికి పుస్తకాల రుతువు హైదరాబాద్ బుక్ ఫెయిర్ తో నేటితో మొదలవుతోంది. ఆ తరువాత విజయవాడలో, ఆ తరువాత మరిన్ని పట్టణాలలో, జిల్లా కేంద్రాలలో పుస్తకాల జైత్రయాత్ర కొనసాగుతుంది. అచ్చుపుస్తకమే ఎందుకు చదవాలో తెలుసుకుని చదువుదాం. కొత్త పుస్తకపు పరీమళంతో గుప్పుమందాం!

కె. శ్రీనివాస్

Updated Date - 2023-03-06T09:16:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising