ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ యుద్ధం, నిర్దాక్షిణ్య పర్వం!

ABN, First Publish Date - 2022-11-17T03:33:46+05:30

పెద్ద ఎత్తున బలప్రదర్శన జరగలేదు కానీ, తెలంగాణలో సుదీర్ఘ, సమరశీల రాజకీయ పోరాటానికి రామగుండంలో తగినంత ఎరువు మాత్రం దొరికింది. పేరుకు రాజకీయమే అయినా, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెద్ద ఎత్తున బలప్రదర్శన జరగలేదు కానీ, తెలంగాణలో సుదీర్ఘ, సమరశీల రాజకీయ పోరాటానికి రామగుండంలో తగినంత ఎరువు మాత్రం దొరికింది. పేరుకు రాజకీయమే అయినా, ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులు, న్యాయప్రక్రియలు వగైరా అనుబంధ వినోదాలు చాలా ఉండబోతున్నాయి. ఎవరి బలగాలు వారు మోహరిస్తున్నారు. భీషణ ప్రతిజ్ఞలు వినిపిస్తున్నాయి కానీ, అవి అవక్రపరాక్రమం నుంచో అభద్రతా భావం నుంచో, తెలియడం లేదు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒకటిన్నర రోజులో రెండు తెలుగు రాష్ట్రాలు చుట్టేశారు. మునుగోడు తరువాత, కొనుగోలు రచ్చ తరువాత వస్తున్నారు కాబట్టి, ఏదో సందేశం ఇస్తారని, ఉత్సాహం నింపుతారని తెలంగాణ బిజెపి వారు ఆశించారు. కలహభోజనం సిద్ధిస్తుందని పరిశీలకులు నిరీక్షించారు. పవన్ కళ్యాణ్ హడావుడి తరువాత, చంద్రబాబు కలసిన తరువాత వస్తున్నారు కాబట్టి, విశాఖలో ప్రధాని ఏదో మాట్లాడతారని ఆంధ్రప్రదేశ్ వారు ఎదురుచూశారు. ప్రధానికి అసలు తెలంగాణలో అడుగుపెట్టే అర్హతే లేదన్నట్టుగా టిఆర్ఎస్, కొత్తగా సత్తువ తెచ్చుకున్న కమ్యూనిస్టులు నిరసన శంఖాలు పూరించారు. రామగుండం దాకా శంఖాలు వెళ్లలేదు కానీ, ఎక్కడికక్కడ నల్లజెండాలూ నినాదాలూ కనిపించాయి, వినిపించాయి. ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతున్న అన్యాయం గురించి జగన్ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. మాట్లాడలేకపోవడం ఆ ముఖ్యమంత్రి నైతిక బలహీనత. మోదీకి తెలియని తెలుగులో మాట్లాడి, మొత్తానికి ఆ లోపాన్ని అధిగమించారు. విశాఖ ఉక్కు గురించో, రైల్వే జోన్ గురించో ప్రధాని హిందీలో అయినా సరే ఓ మంచి మాట చెప్పాలని, లేదా ముఖ్యమంత్రి చెప్పించాలని వ్యక్తమయిన ఆకాంక్ష ఫలించలేదు. ముందురోజు రాత్రి పవన్ కళ్యాణ్‌తో జరిగిన భేటీలో ఏయే సందేశాలు, సూచనలు బట్వాడా అయ్యాయో తెలియదు. మొత్తం మీద ప్రధాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, జగన్ మీదా ఎటువంటి వ్యాఖ్యా చేయకుండా, యథాతథస్థితినే సూచిస్తూ వెళ్లిపోయారు. తెలంగాణలో అట్లా కాదు. వేలు పెట్టి, పేరుపెట్టి ఎవరినీ ప్రస్తావించకపోవచ్చు కానీ, ఎవరికి తగలాలో వారికి తగిలేట్టుగా మాట్లాడారు. సూర్యుడు ఉదయించగానే కమలాలు వికసిస్తాయని కవులు రాస్తారు. ఆ కవిసమయం కూడా తెలుసునో ఏమో మోదీకి, తెలంగాణలో సూర్యోదయం ఖాయమని చెప్పి పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. దోపిడీదారులను సహించబోమని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. అబద్ధాలు చెప్పడం కూడా సరిగ్గారాదని, కొనుగోలు కుంభకోణం గురించి కాబోలు, ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై యువత ఆగ్రహంగా ఉన్నారని, మునుగోడులో వ్యక్తమైన ధోరణిని మనసులో పెట్టుకుని వ్యాఖ్యానించారు.

నరేంద్రమోదీని మితభాషి అనడానికి లేదు. ఆయన ప్రతిరోజూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. చాలా జాగ్రత్తగా రూపొందించిన వ్యక్తీకరణలతో ఆయన వివిధ ప్రజాసమూహాలను, లేదా ప్రత్యర్థి బృందాలను ఉద్దేశించి మాట్లాడతారు. ఆయన మాటకు ఒక లక్ష్యం ఉంటుంది. మౌనానికీ ఒక లక్ష్యం ఉంటుంది. దేశంలో అవాంఛనీయ పరిణామాలు అనేకం జరుగుతున్నప్పుడు, ఎంతటి ఆందోళన వ్యక్తమైనా, ఆయన పెదవి విప్పకుండా ఉన్న సందర్భాలు మనకు తెలుసు. అట్లా ఉండడం వల్ల ఎటువంటి సందేశం వెడుతుందో, ఆ సందేశం అందించడమే ఆయన మౌనానికి అర్థమని, తరువాత తరువాత కాలాల్లో ఆయన అనేక మౌనాల వల్ల మనకు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో అరాచక పాలన గురించిన ఆయన మౌనం కూడా అర్థవంతమైనదే అయి ఉంటుంది. ‘మీరేమీ మొహమాట పడనక్కరలేదు, పోరాడవలసిన విషయాలున్నప్పుడు పోరాడండి’ అని రాష్ట్ర బిజెపి నేతలకు ఆయన సూచించారని చెబుతున్నారు. కానీ, ఏపీ గురించి ఆయనకు, ఆయన పార్టీకి తక్షణ పథకాలేమీ లేనట్టు కనిపిస్తుంది. ఉండి ఉంటే, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడినే గుర్తుపట్టకుండా ఉండేవారు కాదు. కనీసం గుర్తుపట్టలేదన్న విషయాన్ని ప్రదర్శించేవారు కాదు. తెలంగాణలో పరిస్థితి వేరు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆదేశం మేరకు తాను వచ్చానని మోదీ అన్నారు. అంటే, తెలంగాణలో ప్రాజెక్టు బలంగా ముందుకు వెడుతున్నదన్న అర్థాన్ని ఆ మాటల్లో చదువుకోవాలి.

కొనుగోలు కుంభకోణం దర్యాప్తు వేగవంతం అయింది. కొత్త ఆధారాలు ప్రస్తావనకు వస్తున్నాయి. కొండను తవ్వి ఎలుకను కాకుండా కొండచిలువనే పట్టగలనని టిఆర్ఎస్ ప్రభుత్వం ఆశిస్తోంది. కేంద్రప్రభుత్వం, దాన్ని నడిపించే అధికారపార్టీ, తనను, తన మనుషులను జాతీయ ఏజెన్సీలతో ఇబ్బంది పెట్టకుండా, కెసిఆర్ వేస్తున్న ఎదురుమంత్రమే ఈ కొనుగోలు దర్యాప్తు అని జనం చెప్పుకుంటున్నారు. రాష్ట్ర దర్యాప్తు, కేంద్ర దర్యాప్తు కొట్టుడుపోయి, అన్నీ గప్ చుప్ కావాలని ఆయన ఆశిస్తున్నారని అంటున్నారు. కానీ, కేంద్రం దగ్గర నాలుగు పాచికలు ఎక్కువే ఉన్నట్టు కనిపిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్, ఒక్క దెబ్బకు రెండు పిట్టలలాగా, అటు ఆప్ ప్రభుత్వాన్ని, ఇటు టిఆర్ఎస్‌నీ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ కుంభకోణంలో కమిషన్ లాభాలు పొందేవారు కొందరు, వ్యాపార లాభం పొందేవారు మరికొందరు, గూడుపుఠాణి చేసిన వారు, వారికి డబ్బును తరలించినవారు అందరూ ఒక్కొరుగా తెరమీదకు వస్తున్నారు. దేశంలో ఇప్పుడు నడుస్తున్న వ్యవహారాలతో పోలిస్తే, చెప్పుకోదగ్గంత గొప్ప కుంభకోణమేమీ కాదు కానీ, రాజకీయంగా పనికిరాగల వ్యవహారం కావడంతో ఆయుధంగా మారింది. అవినీతి రాజకీయ వ్యవహారాలలో చార్టర్డ్ విమానాల పాత్ర గురించి కొత్తగా మాట్లాడుకునేది ఏముంది, కొనుగోలు కుంభకోణం విడియోల్లో అంతా బాహాటంగానే మాట్లాడుకున్నారు. రాత్రికి రాత్రి పనులు జరగాలంటే, లాభాలు చేసుకోవాలంటే, ప్రభుత్వాలు కూల్చాలంటే, కిరాయి విమానాలు లేకుండా సాధ్యమయ్యే రోజులేనా? కానీ, కాలం కలసిరాకపోతే, విమానవిహారాల జాబితాలే మెడకు చుట్టుకుంటాయి. లిక్కర్ స్కామ్ అయినా, ఎమ్మెల్యేల కొనుగోలు కుంభకోణం అయినా, మోదీ అన్నట్టు ‘వికృత ఆలోచనాపరుల విపరీత చేష్టలు’ అని అనుకోవడానికి లేదు. ఈ అన్నిరకాల దొంగ వ్యవహారాలూ జరగడానికి వీలున్నవే, రాజకీయాల్లో, ప్రభుత్వాల్లో ఉన్న పెద్దమనుషులు ఇటువంటి పాడు పనులు చేయకూడదని మడి కట్టుకున్నవారేమీ కాదు. వందల వేల కోట్లు ఎట్లా చేతులు మారతాయి, డబ్బు ఎక్కడ పార్క్ అవుతుంది, అమ్ముడుపోయినవారికి లేదా లబ్ధిదారుడికి డబ్బు ప్రయాణించడానికి గ్రీన్ కారిడార్లు ఎట్లా రూపొందుతాయి, ఇప్పుడు పెద్ద రహస్యాలేమీ కావు. ప్రాంతీయ ప్రభుత్వాలకు సన్నిహితంగా మెలిగే మహాసంపన్నులను దారికితేవడాన్ని బిజెపి తన రాజకీయ వ్యూహంలో ఒక భాగం చేసుకున్నది. అవినీతి కేంద్రంలో కానీ, తన చేతిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలలో కానీ లేదన్నట్టు, ప్రతిపక్ష రాష్ట్రాల మీదనే, అక్కడి అధికార రాజకీయనేతల మీద, సంపన్నుల మీద ఏజెన్సీల దాడులు జరిపిస్తున్నది. రాష్ట్రప్రభుత్వాలు కూడా తమ చేతిలో ఉన్నమేరకు, సిఐడిని, ఎసిబిని, ఇంటెలిజెన్స్ విభాగాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాయి. కేంద్రం చేసే ట్యాపింగులు కొన్ని, రాష్ట్రాలు చేసే ట్యాపింగులు ఎన్నో. బిజెపి కానివారి అందరి ఫోన్లు, బిజెపి వారి ఫోన్లు కూడా కేంద్రం వింటున్నదట, గవర్నరుతో సహా అందరి ఫోన్లూ టిఆర్ఎస్ ప్రభుత్వం వింటున్నదట. నిఘాల భయంలో నీతిగా ఉంటున్నారు తప్ప, అమ్ముడుపోగూడదనే నియమం రాజకీయవాదులకు లేకపోతున్నది. ఆ నలుగురూ ఎవరి భయంలో ఉన్నారో తెలియని పరిస్థితి! సంఘ భయం మాత్రం ఖచ్చితంగా లేదు.

త్వరలో కొత్త తాఖీదులు, కొత్త అరెస్టులు మొదలవుతాయి. తన కుమార్తె కవితను కూడా బిజెపిలోకి రమ్మన్నారంటూ, కెసిఆర్ సిసోడియా మంత్రం జపించారు. జాతీయ ఏజెన్సీల చర్యలకున్నంత పదును కెసిఆర్ పెట్టే గగ్గోలుకు, చేసే ప్రచారయుద్ధానికి ఉంటుందా అన్నది అనుమానమే. లొంగదీసుకోవడమే లక్ష్యం అయితే కేంద్ర అధికారపార్టీ తీరు ఒక రకంగా ఉంటుంది. తొలగించడమే ఉద్దేశ్యం అయితే మరో రకంగా ఉంటుంది. తన ఎదురుదాడి సంధికి దారితీస్తే, తెలంగాణ అధికారపార్టీ ఒక రకంగా స్పందించవచ్చు. ఉనికికే మోసం వస్తే మరో రకంగా వ్యవహరించవచ్చు. అమీతుమీ యుద్ధం అయితే మాత్రం, అది తీవ్రంగానే ఉంటుంది. మంగళవారం నాడు కెసిఆర్ తన సకల రాజకీయ శ్రేణులకు చెప్పిన జాగ్రత్త, చేసిన హెచ్చరిక అదే. మంచిచెడ్డల సమస్యో, నీతి అవినీతుల సమస్యో కాదిది. పచ్చి వేట. ప్రస్తుతానికి తెలంగాణలో జరుగుతోంది. రేపు ఆంధ్రలోనూ జరగవచ్చు. మరెక్కడైనా జరగవచ్చు.

కె. శ్రీనివాస్

Updated Date - 2023-03-06T09:23:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising