RK KOTTHAPALUKU: బాబూ, పవన్ లను బూచీలుగా చూపిస్తూ..
ABN, First Publish Date - 2022-12-25T00:43:11+05:30
‘ఆంధ్రాకూ కేసీఆరే ఆశాకిరణం’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత పత్రికలో దర్శనమిచ్చిన బ్యానర్ కథనం చూసి ముచ్చటేసింది. ఎందుకంటే అంతకు ఒక్కరోజు ముందే తెలుగుదేశం...
‘ఆంధ్రాకూ కేసీఆరే ఆశాకిరణం’ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత పత్రికలో దర్శనమిచ్చిన బ్యానర్ కథనం చూసి ముచ్చటేసింది. ఎందుకంటే అంతకు ఒక్కరోజు ముందే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు తెలంగాణలో ఏం పని? అని పలువురు తెలంగాణ మంత్రులు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కూడా ఇటువంటి శీర్షిక పెట్టించుకోవడం భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గడుసుతనం కాక మరేమిటి? తాను ఇప్పుడు ప్రాంతీయవాదిని కాదని, జాతీయవాదినని అంటూ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చుకొని జాతీయ రాజకీయాలను ఏలాలనుకుంటున్న కేసీఆర్‌కు... ఆంధ్రావాళ్ల గురించి ఎటువంటి అభిప్రాయం ఉందో దీన్నిబట్టి తెలుస్తోంది. నా పుట్టలో వేలు పెడితే ఊరుకుంటానా? అన్నట్టుగా తెలంగాణలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుల ఆధ్వర్యంలో ఉన్న రాజకీయ పార్టీలు రాజకీయం చేయకూడదని కోరుకొనే కేసీఆర్‌కు పొరుగు రాష్ర్టాలను కూడా ఏలాలన్న కోరిక ఉండటం కించిత్ ఆశ్చర్యం కలిగించకుండా ఉంటుందా? గత ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి తన వంతు కృషి చేసిన కేసీఆర్, ఇప్పుడు మళ్లీ జగన్‌కు పరోక్షంగా సహకరించడానికి పావులు కదపడంలో భాగంగానే ఆంధ్రాలో కూడా తన నాయకత్వమే దిక్కు అన్నట్టు భ్రమలు కల్పించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో ఆంధ్రాకు చెందిన ఊరూ పేరూ లేని కొంతమందిని పిలిపించుకొని, వారితో ఫొటోలు దిగి తన పత్రికలో వేయించుకొని మురిసిపోతున్నారు. కేసీఆర్‌ను కలిసిన వారిలో ఉనికిలో లేని ఒక పత్రికలో గతంలో కంట్రిబ్యూటర్‌గా పని చేసిన వ్యక్తి కూడా ఉండటం విశేషం. తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రగతిభవన్‌లోకి తెలంగాణ ప్రజలకు ప్రవేశం లేకుండా ఇంతకాలం గడిపిన కేసీఆర్, ఇప్పుడు బీఆర్‌ఎస్ అధినేతగా పొరుగు రాష్ర్టాలకు చెందినవారు వచ్చి అడిగిందే తడవుగా గంటలకొద్దీ సమయాన్ని కేటాయిస్తున్నారు. తెలంగాణలో గొర్రెలు ఎక్కువ అని చెబుతున్న ముఖ్యమంత్రి, ఇలా తనను కలవడానికి వస్తున్న వారికి పొట్టేలు మాంసంతో విందులు కూడా ఇస్తున్నట్టు చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో బీఆర్‌ఎస్ కార్యాలయాన్ని అట్టహాసంగా ప్రారంభించిన కేసీఆర్ అక్కడ ఒక రోజంతా తనను కలవడానికి వచ్చిన వారందరికీ దర్శన భాగ్యం కల్పించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వివిధ రాష్ర్టాలకు చెందిన వాళ్లెవరూ కేసీఆర్ దర్శనం కోసం రాకపోయినప్పటికీ తెలంగాణకు చెందిన బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు మాత్రం ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఢిల్లీ వెళ్లి కేసీఆర్ దర్శనభాగ్యం పొందారు. హైదరాబాద్ ప్రగతిభవన్‌లో తలుపులు తెరుచుకోవు కనుక ఇకపై తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను కలవాలనుకుంటే ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు వెళ్లి ఉచిత దర్శనం పొందవచ్చునన్న మాట!
ఖమ్మం సభతో ఉలికిపాటు!
కేసీఆర్‌ను కలిసి మద్దతు ప్రకటిస్తే ఆర్థికంగా లబ్ధి పొందవచ్చునన్న ఆశతో సొంత రాష్ట్రంలో చెల్లని రూపాయలుగా ఉన్నవారు కొందరు కేసీఆర్ ప్రారంభించిన బీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రలో కేరాఫ్ అడ్రస్ కూడా సరిగా లేని కొంతమంది వచ్చి కలవడంతో ఆంధ్రకు కూడా తానే ఆశాకిరణం అని రాయించుకొని కేసీఆర్ మురిసిపోతున్నారు. తాను ప్రారంభించిన బీఆర్‌ఎస్‌కు ఉత్తరాది రాష్ర్టాలలో ప్రచారం కల్పించడం కోసం ప్రముఖ హిందీ పత్రికల వారితో ప్యాకేజీలు కూడా మాట్లాడుకుంటున్నారని భోగట్టా. తనకు మద్దతు ప్రకటిస్తున్న ఇతర రాష్ర్టాల నాయకులకు ఎన్నికల సందర్భంగా భారీగా ఆర్థిక సహాయం చేస్తానని హామీ ఇస్తున్న కేసీఆర్, ఇప్పుడు జాతీయ మీడియాకు కూడా ఆర్థిక ప్యాకేజీలు ఇవ్వజూపుతున్నారు. దీంతో తెలంగాణ పైసలన్నీ ఇతర రాష్ర్టాలకు పోతున్నాయని కేసీఆర్ అంటే గిట్టని తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో తన పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నలుమూలల నుంచి వేల మంది అనూహ్యంగా తరలివచ్చారు. గత ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాజకీయాలలో వేలుపెట్టి సొంత రాష్ట్రంలో కూడా అధికారం కోల్పోయిన అనుభవం చంద్రబాబుది. అప్పుడు కాంగ్రెస్‌తో చేతులు కలిపి తెలంగాణలో పోటీ చేశారు. తెలంగాణ రాజకీయాలలో చంద్రబాబు క్రియాశీలంగా వ్యవహరించడాన్ని సహించలేని కేసీఆర్ తెలంగాణ సెంటిమెంటును రగిలించి గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయినా చంద్రబాబుతో ఎప్పటికైనా రాజకీయంగా ప్రమాదకరమని భావించిన కేసీఆర్ ఆ తర్వాత ఆంధ్రాలో జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం సహకరించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు మళ్లీ తెలంగాణ రాజకీయాల వైపు చూడటం ద్వారా పాత తప్పునే మళ్లీ చేస్తున్నారా? అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు. ఈ అభిప్రాయంలో హేతుబద్ధత ఉందా? లేదా? అన్న విషయం పక్కన పెడితే, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఇప్పటికీ ఓట్లు ఉన్నాయన్నది మాత్రం వాస్తవం.
ఎన్నికల్లో సొంతంగా పోటీ చేసి గెలవడానికి మాత్రం ఈ ఓట్లు సరిపోవు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు గణనీయంగా ఉన్నారు. గత ఎన్నికల తర్వాత ఈ ఓటర్లు అందరూ కేసీఆర్ వైపు మళ్లారు. హైదరాబాద్ నగరపాలక సంస్థకు జరిగిన ఎన్నికల్లో ఈ విషయం రుజువైంది. ఆంధ్ర మూలాలు ఉన్న ఓటర్లు గణనీయంగా ఉన్న ఐదారు నియోజకవర్గాలలోనే అప్పుడు టీఆర్‌ఎస్‌కు చెందిన కార్పొరేటర్లు విజయం సాధించారు. సెటిలర్ల మద్దతు లభించి ఉండకపోతే నగర పాలక సంస్థ ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కోల్పోయి ఉండేది. ఈ పరిస్థితులలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజుకుంటే తన అధికారానికి ముప్పు తప్పదని గుర్తించిన కేసీఆర్ తెలుగుదేశం పార్టీ ఉనికిని సహించలేకపోతున్నారు. 2018 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో నిస్తేజంగా ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అధికారం కోల్పోవడంతో చంద్రబాబు కూడా తెలంగాణను పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపించడంతో తెలంగాణలో తన పార్టీని పునరుద్ధరింపజేయడానికి ఆయన ప్రయత్నాలు మొదలెట్టారు. ఇందుకు కారణం లేకపోలేదు. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్ల అవసరం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అక్కడ బీజేపీకి ఓట్లపరంగా బలం లేకపోయినా ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవాలనే ఆలోచనతో బీజేపీకి స్నేహ హస్తాన్ని అందిస్తున్నారు. అయితే ఆంధ్రలో పొత్తుల విషయమై బీజేపీ అగ్రనాయకత్వం ప్రస్తుతానికి గుంభనంగా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలపై చంద్రబాబు మళ్లీ దృష్టి సారించారు. తెలంగాణలో తమ పార్టీ బలాన్ని రుజువుచేసుకోగలిగితే తమతో పొత్తుకు బీజేపీ ముందుకు వస్తుందని తెలుగుదేశం నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో ఉక్కపోతకు గురవుతున్న మాజీ తెలుగుదేశం నాయకులు పలువురు బీజేపీతో పొత్తు ఉండే పక్షంలో మళ్లీ తెలుగుదేశంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే జరిగితే జాతీయ రాజకీయాల సంగతేమోగానీ తెలంగాణలో కూడా అధికారం కోల్పోయే ప్రమాదం ఉందని కేసీఆర్ ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే వైఎస్ షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. ఆమె ప్రారంభించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి క్రైస్తవుల మద్దతు ఎంతో కొంత లభించే అవకాశం ఉంది. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలో తెలంగాణలో చురుగ్గా ఉన్న బీఎస్పీకి దళిత యువత మద్దతు లభిస్తోంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తయారైంది. నిజానికి కేసీఆర్ అండ్ కో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీని లెక్కలోకి తీసుకోలేదు. కాసాని జ్ఞానేశ్వర్‌కు రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించిన తర్వాత ఖమ్మంలో నిర్వహించిన బహిరంగ సభ అనూహ్యంగా విజయవంతమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకులు అందరూ వివిధ పార్టీలలోకి వలస వెళ్లినందున ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జిల్లాలో బలమైన నాయకత్వం కూడా లేదు. అయినా ప్రతి గ్రామం నుంచి ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం సభకు తరలిరావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్ అండ్ కో కూడా ఉలిక్కిపడ్డారు. ఖమ్మం సభ తర్వాత బీఆర్‌ఎస్‌లో అవకాశాలు దక్కని పలువురు తెలుగుదేశం మాజీ నాయకులు సొంత గూటికి చేరే ప్రయత్నాలు మొదలుపెట్టారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు కుదిరే పక్షంలో ఈ చేరికలు మరింత ఊపందుకుంటాయి.
ఆ మూడూ అటు కలిస్తే దెబ్బే!
అంతర్గత కుమ్ములాటలతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నానాటికీ బలహీనపడటంతో కేసీఆర్‌ను ఎదుర్కోగలిగేది బీజేపీ మాత్రమే అన్న అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో ఏర్పడింది. అయితే ఈ కోవకు చెందిన పలువురు నాయకులకు బీజేపీలో చేరడానికి మనసు అంగీకరించడం లేదు. బీజేపీలో తాము ఇమడలేమన్న అభిప్రాయంతో వారు ఉన్నారు. ఈ కారణంగానే పార్టీలోకి చేరికలను ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటుచేసినా బీజేపీలో చేరడానికి చాలా మంది ముందూ వెనుకా ఆలోచిస్తున్నారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ ఖమ్మంలో నిర్వహించిన సభ వారిలో ఆశలు చిగురింపజేసింది. తెలుగుదేశం పార్టీలో ఎంతమంది చేరబోతున్నారు? వారెవరు? అన్న విషయంలో మాత్రం ఇప్పటివరకు స్పష్టత లేదు. అయినప్పటికీ ఖమ్మం సభ తర్వాత బీఆర్‌ఎస్ మంత్రులు అంతలా ఎందుకు స్పందించారంటే కారణం లేకపోలేదు. తెలంగాణలో కేసీఆర్‌ను గద్దె దించాలంటే ప్రస్తుత పరిస్థితులలో బీజేపీ బలం సరిపోదు. తెలుగుదేశం పార్టీతో పాటు షర్మిల, ప్రవీణ్ కుమార్ సహకారం కూడా తీసుకోగలిగితేనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూడు పార్టీల వల్ల ప్రధానంగా నష్టపోయేది బీఆర్‌ఎస్ మాత్రమే. ఎందుకంటే ఈ మూడు పార్టీల వైపు ఆకర్షితులైన ఓటర్లు ప్రస్తుతం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. బీజేపీతో ఆ మూడు పార్టీలకూ పొత్తు ఏర్పడితే రానున్న ఎన్నికల్లో కేసీఆర్ గట్టి పోటీని ఎదుర్కోవలసి వస్తుంది. తెలంగాణలో కనీసం పాతిక సీట్లలో ప్రభావం చూపించగల తెలుగుదేశం పార్టీ ఉనికిని కేసీఆర్ అందుకే సహించలేకపోతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబుకూ, కేసీఆర్‌కూ మధ్య వైరం కొనసాగడానికి ఇదే కారణం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో కేసీఆర్‌కు రాజకీయంగా ఏ పేచీ లేదు. తెలంగాణ రాజకీయాల పట్ల జగన్‌కు ఆసక్తి లేదు. అదే సమయంలో ఆయనకు ఇక్కడ ఓటు బ్యాంకు కూడా లేదు. జగన్ ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాజధాని అమరావతి మూలనపడింది. ఫలితంగా హైదరాబాద్ అభివృద్ధి అప్రతిహతంగా కొనసాగుతోంది. తెలంగాణకు ఏ విధంగానూ పోటీ ఇవ్వగల పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు లేదు. రాజకీయంగా, ప్రభుత్వపరంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే తనకు ఏ ఇబ్బందీ ఉండదు కనుక కేసీఆర్ ఆయనతో సఖ్యతగా ఉంటున్నారు. ఈ సఖ్యత మామూలుగా లేదు. ఆ మధ్య తెలంగాణకు చెందిన కొందరు మంత్రులు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ పాలనలో రోడ్లు వగైరా అధ్వాన్నంగా ఉంటున్నాయని, అప్పు చేసి పప్పు కూడు తింటున్నారని విమర్శలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం గొప్పగా పనిచేస్తోందని చెప్పుకోవడానికే ఆంధ్రప్రదేశ్‌తో పోల్చారు గానీ జగన్మోహన్ రెడ్డిని కించపరచడానికి కాదు. అయితే తెలంగాణ మంత్రులు తమ ప్రభుత్వ పనితీరును విమర్శించడాన్ని సహించలేకపోయిన జగన్ తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ఫోన్ చేసి మరీ అభ్యంతరం తెలిపారు. తన ప్రభుత్వాన్ని విమర్శించకుండా తెలంగాణ మంత్రులను కట్టడి చేయాలని కోరారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్ నాయకులెవరూ జగన్ ప్రభుత్వాన్ని విమర్శించడం లేదు. కేసీఆర్ కుటుంబానికి, జగన్ కుటుంబానికి మధ్య ఉన్న సత్సంబంధాలకు ఇంతకన్నా నిదర్శనం ఏమి కావాలి? చంద్రబాబు అధికారంలో ఉంటే కేసీఆర్‌కు ఇటువంటి సౌలభ్యం ఉండదు. అభివృద్ధి విషయంలో ఆయన తెలంగాణతో పోటీ పడతారు.
కేసీఆర్‌కు సహజంగానే అది నచ్చదు. 2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో జగన్ అధికారంలోకి వస్తేనే హైదరాబాద్‌లో అభివృద్ధికి ఆటంకం ఏర్పడదని, చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తే అమరావతి పోటీగా తయారవుతుందని పార్టీ ముఖ్యుల వద్ద కేసీఆర్ స్వయంగా వ్యాఖ్యానించారు. వాస్తవం ఇది కాగా, ఆంధ్రకు కూడా తానే ఆశాకిరణం అని కేసీఆర్ ఇప్పుడు ప్రచారం చేయించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి ప్రాంతీయవాదం నుంచి జాతీయవాదం వైపు అడుగులు వేస్తున్నట్టు చెప్పుకొన్న కేసీఆర్, ఇప్పుడు మళ్లీ ప్రాంతీయవాదాన్ని ఆశ్రయించడం ఆశ్చర్యంగా ఉంది. రానున్న ఎన్నికల్లో పొరుగు రాష్ర్టాల్లో పోటీ చేస్తానని ప్రకటించిన కేసీఆర్, తెలంగాణలో మాత్రం ఇతర పార్టీలకు చెందినవారు పోటీ చేయకూడదని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆంధ్రకు తానే ఆశాకిరణం అని నమ్మమంటున్నారు. ఆంధ్రావాళ్లు ఎంతమంది కేసీఆర్‌ను నమ్ముతారో తెలియదు. లంకలో పుట్టినవాళ్లు అందరూ రాక్షసులే అన్నట్టుగా ఆంధ్రావాళ్లు అందరూ దోపిడీదారులేనని ఉద్యమ సమయంలో కేసీఆర్ చేసిన విమర్శలను ఆంధ్రావాళ్లు మరచిపోలేరు కదా! అత్యాశకు పోయి జగన్మోహన్ రెడ్డి వంటి వాళ్లకు అధికారం అప్పగించిన ఆంధ్రావాళ్లు తనను ఆదరించకపోతారా? అన్న భరోసా కేసీఆర్‌లో ఏర్పడి ఉంటుంది. తన మాటల గారడీతో ఆంధ్రావాళ్లను కూడా మాయ చేయవచ్చునన్న ధీమా కేసీఆర్‌లో ఏర్పడి ఉండవచ్చు. అందుకే తన ఆశలకు, ఆకాంక్షలకు తూట్లు పొడిచే ప్రయత్నాన్ని చంద్రబాబు చేయడం కేసీఆర్‌కు సహజంగానే నచ్చడంలేదు. దీంతో జాతీయవాది కాస్తా ప్రాంతీయవాదిగా కుచించుకుపోతున్నారు. తెలంగాణపై కేసీఆర్‌కు ఉన్నంత ప్రేమ పారాచూట్ నాయకులకు ఉంటుందా? అని మంత్రులతో ప్రశ్నింపజేశారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిల.. బీజేపీ వదిలిన బాణాలని విమర్శలు చేయిస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రా మూలాలు ఉన్న ఆ ముగ్గురూ తెలంగాణకు పరాయి వారేనని తేల్చారు. అదే నిజమైతే రాష్ట్ర విభజనకు కారకుడినని చెప్పుకొనే కేసీఆర్, ఆంధ్రప్రదేశ్‌కు పరాయివాడు కాకుండా ఎలా పోతారు? ఆంధ్రా, కర్ణాటక, మహారాష్ట్రలలో పోటీ చేస్తానని చెప్పుకొంటున్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సొంత రాష్ట్రమైన తెలంగాణకు ఎవరూ రాకూడదని కోరుకోవడం ఏమిటి? దేశంలో ఎక్కడైనా పోటీ చేసే అర్హత ప్రస్తుతానికి తనకు మాత్రమే ఉందని, ఇతరులకు ఆ హక్కు లేదని కేసీఆర్ భావిస్తున్నట్టుగా ఉంది. తెలంగాణలో ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలితే తప్ప రానున్న ఎన్నికల్లో విజయం సాధించలేని స్థితిలో కేసీఆర్ ఉన్నారు. ఈ కారణంగానే చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిల వంటి వారు బీజేపీతో చేతులు కలపకుండా అడ్డుకొనే ప్రయత్నాలు మొదలెట్టారు. ఆ పార్టీలతో కలిస్తే నష్టం అన్న భావనను బీజేపీకి కలిగించడం కోసం మళ్లీ ప్రాంతీయవాదాన్ని అందుకున్నారు.
..మరి కేసీఆర్‌కు ఏం పని?
తెలంగాణలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిలకు ఏమి పని? అంటున్న వాళ్లు కేసీఆర్‌కు ఆంధ్రాతో ఏమి పని? అన్న ప్రశ్నకు సమాధానం చెబితే బాగుంటుంది. కేసీఆర్ కుటుంబంపై తెలంగాణ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. తెలంగాణ ఏర్పాటువల్ల కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్న అభిప్రాయానికి తెలంగాణ యువత వచ్చింది. ఈ పరిస్థితిని అధిగమించడం కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్, షర్మిలను బూచీలుగా చూపించే ప్రయత్నం మళ్లీ మొదలెట్టారని భావించాలి. అయితే కేసీఆర్ అండ్ కో చేస్తున్న ఈ ప్రయత్నాలు ఈ పర్యాయం ఫలించకపోవచ్చు. పార్టీ పేరు నుంచే తెలంగాణను తొలగించిన కేసీఆర్ ఇప్పుడు మళ్లీ తెలంగాణవాదం అందుకోవడం ఎబ్బెట్టుగా ఉంటుంది. స్వరాష్ట్రంలో ప్రాంతీయవాదం ఆలపిస్తూ ఇతర రాష్ర్టాలలో జాతీయవాదం గురించి మాట్లాడితే నమ్మడానికి ప్రజలు అంత అమాయకులా? కూట్లో రాయి ఏరలేని వాడు ఏట్లో రాయి ఏరడానికి బయలుదేరాడు అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి కూడా తయారైంది. తెలంగాణలో అధికారం చేజారిపోకుండా చూసుకోవడమే కేసీఆర్‌కు ఇప్పుడు ప్రధాన సమస్య. ఆ తర్వాత పారాచూట్ నాయకుడివలె ఇతర రాష్ర్టాలపై వాలవచ్చు. చంద్రబాబు గురించి మంత్రులు చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ఇప్పుడు కేసీఆర్‌కే ఎదురొస్తున్నాయి. కుదిరితే కప్పు కాఫీ తాగుదాం అన్నంత కూల్‌గా, చాన్స్ వస్తే ప్రధానమంత్రి అవ్వాలని కలలు కంటూ టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చి జాతీయ నాయకుడిగా ప్రచారం చేయించుకుంటున్న కేసీఆర్‌కు ఈ వైఖరి ఆశించిన ఫలితాన్ని ఇస్తుందా? లేక బీఆర్‌ఎస్ ఆయనకు శిరోభారం అవుతుందా అన్నది వేచి చూద్దాం! ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణను పాలించమని అధికారం కట్టబెడితే ఆంధ్రాతో నీకేం పని అని తెలంగాణ సమాజమే నిలదీసే అవకాశం కూడా ఉంది సుమా! ఆంధ్రావాళ్లను మాయ చేయవచ్చు గానీ తెలంగాణ ప్రజలను మళ్లీ మళ్లీ మాయ చేయలేరని కేసీఆర్ గుర్తిస్తే ఆయనకే మంచిది!
ఆర్కే
Updated Date - 2022-12-25T03:59:47+05:30 IST