‘ఉప’ ఫలితాలు
ABN, First Publish Date - 2022-11-08T01:14:54+05:30
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లోని అధికారపక్షాలను కానీ, ప్రభుత్వాలను కానీ కుదిపేసేంతటివేమీ కావు...
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లోని అధికారపక్షాలను కానీ, ప్రభుత్వాలను కానీ కుదిపేసేంతటివేమీ కావు కానీ, ఏ పార్టీకి ఆ పార్టీ తమకు నచ్చినరీతిలో భాష్యం చెప్పుకోవడానికి ఇవి ఉపకరిస్తాయి. ఏడింటిలో ఐదుస్థానాలు గతంలో ఏ పార్టీ చేతుల్లో ఉన్నాయో వాటికే పోయాయి. మిగతా రెండిటినీ కాంగ్రెస్ కొత్తగా కోల్పోయింది. మొత్తంగా బీజేపీ నాలుగు, ప్రాంతీయపార్టీలు మూడు స్థానాలను గెలుచుకున్నాయి. మహారాష్ట్రలోని తూర్పు అంధేరీలో తప్ప మిగతా ఆరుచోట్లా పోటీచేసి బీజేపీ గెలుచుకున్న నాలుగుస్థానాల్లో మూడు గతంలోనూ తనవే. కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికతో రెండుస్థానాల్లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీ ఒకదానిని దక్కించుకుంది, రెండోది కోల్పోయింది.
ఉన్నవాటిని నిలబెట్టుకోవడం, కొత్తగా మరొకటి దక్కించుకోవడంతో ఈ ఉపఎన్నికల్లో బీజేపీ జోరు సాగిందని అనడం సహజం. ఉత్తర్ ప్రదేశ్‌లోని గోలా గోకర్ణానాథ్ స్థానంలో అది భారీ విజయం సాధించడం మరింత ఆశ్చర్యకరం. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా ప్రాతినిథ్యం వహిస్తున్న లఖింపూర్ ఖేరీ లోక్ సభ స్థానం పరిధిలోకి వచ్చే ఈ ప్రాంతంలో మూడు సాగుచట్టాల వ్యతిరేకోద్యమ ప్రభావం కానీ, ఉద్యమసమయంలో మిశ్రా కుమారుడు తన వాహనాన్ని ఎక్కించి నలుగురు రైతుల ప్రాణాలు తీసిన ఘటన కానీ పెద్దగా ప్రభావం చూపకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. సమాజ్ వాదీపార్టీ అభ్యర్థికి గట్టిగానే ఓట్లు వచ్చినప్పటికీ, మరణించిన బీజేపీ ఎమ్మెల్యే కుటుంబం పట్ల ప్రజల్లో ఉన్న సానుభూతి మరింత పనిచేసినట్టుంది. ఒడిశా ధామ్ నగర్ స్థానంలోనూ ఇదే జరిగింది. పాలకపక్ష బీజేడీ గట్టిపోటీ ఇచ్చినా, మూడున్నరవేల ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ఏకంగా డిపాజిట్ కోల్పోవడంతో, పదివేల లోపు ఓట్లతో ఈ స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకోగలిగింది.
బీజేపీతో తెగదెంపులు చేసుకొని, ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్న తరువాత బిహార్‌లో రెండుస్థానాలకు జరిగిన ఎన్నికలు కనుక వీటిని నితీశ్, తేజస్వీ యాదవ్‌కు తొలిపరీక్ష అని కొందరు అభివర్ణిస్తున్నారు. మొకామా స్థానాన్ని బలంగానే నిలబెట్టుకొని, గోపాల్ గంజ్ కోల్పోయినప్పటికీ, మహాగడ్బంధన్ ప్రభావం బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నది. బీజేపీ ఎమ్మెల్యే మరణంతో వచ్చిన గోపాల్ గంజ్ ఎన్నికలో సానుభూతి పనిచేయలేదని, దాదాపు పన్నెండువేల ఓట్లు కొల్లగొట్టిన ఎంఐఎమ్ భారీగా ఆర్జేడీ విజయవకాశాలను దెబ్బ తీయడంతో, రెండువేలలోపు ఓట్లతో బీజేపీ గట్టెక్కిందని సులువుగా అర్థమవుతుంది. ఎంఐఎం పోటీతో సెక్యులర్ ఓట్ల చీలిక బీజేపీని కష్టకాలంలో ఒడ్డునపడేస్తుందనడానికి ఇది మరో నిదర్శనం. అంధేరీ స్థానాన్ని ఉద్ధవ్ ఠాక్రే సేన నిలుపుకోవడంలో పెద్ద విశేషం లేదని కొందరు అంటున్నప్పటికీ, సేన అభ్యర్థిని ఓడించడానికి సాగిన పలు కుట్రలను ఎదుర్కొని తాము విజయం సాధించామని ఉద్ధవ్ అంటున్నారు. ముందుగా బీజేపీ తన అభ్యర్థిని ఎన్నికల బరిలో దించి, తాను ఎలాగూ గెలవనని తేలిపోవడంతో, దివంగత ఎమ్మెల్యే పట్ల సానుభూతితో ఉపసంహరించుకున్నట్టు ప్రకటించి, నోటాకు ఓటువేయమని ఉధృతంగా ప్రచారం చేసిందని సేన వాదన. పదిహేను శాతం ఓట్లతో నోటా ఇక్కడ రెండోస్థానంలో ఉండటం కచ్చితంగా ఆశ్చర్యకరమైన, విశ్లేషణార్హమైన అంశమే.
తన పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపుతో హరియాణాలోని అదంపూర్‌లోనూ, తెలంగాణలోని మునుగోడులోనూ వచ్చిపడిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ రెండింటినీ కోల్పోయింది. అదంపూర్ మాజీ ముఖ్యమంత్రి భజన్‌లాల్ కుటుంబానికి కంచుకోట. 1968 నుంచి ఆయన కుటుంబమే గెలుస్తూ వస్తున్నందున, ఈ మారు ఆ విజయం బీజేపీ తన ఖాతాలో వేసుకోగలిగింది. కానీ, ఇదే విన్యాసం మునుగోడులో ఫలితాన్నివ్వలేకపోయింది. అత్యంత హోరాహోరీగా, ఖరీదుగా జరిగిన ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పదివేల ఓట్లతో గెలిచింది. కానీ, బీజేపీ ‘కాంగ్రెస్ ముక్త్’ లక్ష్యం మాత్రం నెరవేరినట్టయింది.
కేవలం స్థానికాంశాల ఆధారంగా, సర్వసాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలే నెగ్గుకొచ్చే ఉప ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికలను కానీ, సార్వత్రక ఎన్నికలను కానీ ప్రతిబింబించవు. కానీ, బీజేపీ ఆధిపత్యం బలంగా కొనసాగుతున్నదనీ, దాని దూకుడుకు కళ్ళెవేయగల సమర్థత మరోపక్క ప్రాంతీయపార్టీల్లో ఇంకా మిగిలేవుందని ఈ ఫలితాలు చెబుతున్నాయి.
Updated Date - 2022-11-08T01:15:16+05:30 IST