ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కడతేరని కరోనా ముప్పు

ABN, First Publish Date - 2022-12-22T02:45:56+05:30

ఇంతవేగంగా పరిణామాలు మారిపోతాయని ఎవరూ ఊహించివుండరు. నాలుగుదేశాల వరుసలో చివర్లో చైనా పేరుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంతవేగంగా పరిణామాలు మారిపోతాయని ఎవరూ ఊహించివుండరు. నాలుగుదేశాల వరుసలో చివర్లో చైనా పేరుపెట్టి, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రాలు జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచి నమూనాలు ఇన్సాకాగ్ లాబరేటరీలకు పంపాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాష్ట్రాల్లోని తన సహచరులకు మంగళవారం ఓ లేఖరాశారు. బుధవారం కేంద్ర ఆరోగ్యవైద్యమంత్రి మన్ సుఖ్ మాండవీయ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమావేశంలో పరిస్థితిని సమీక్షించిన తరువాత కేంద్రం చాలా ఆదేశాలు జారీ చేసింది. మాస్కులు ధరించాలనీ, భౌతికదూరం పాటించాలనీ, అంతకంటే ముఖ్యంగా, దేశంలో ఇప్పటివరకు ముపైశాతంలోపే బూస్టర్ డోస్ వేసుకున్నందున, అర్హులైనవారందరూ బూస్టర్ వేసుకోవాలని కూడా సూచనలు వెలువడ్డాయి. ఇతరదేశాలనుంచి వచ్చే ప్రయాణీకుల స్క్రీనింగ్, శాంప్లింగ్ విధానం కూడా అమలులోకి వచ్చింది.

రాష్ట్రాలను కేంద్రం హెచ్చరించిన మర్నాడే, బిఎఫ్ 7 అనే కరోనా సబ్ వేరియంట్ కేసులు దేశంలో ఉన్నాయన్న వార్తలు కూడా వచ్చాయి. చైనాలో కరోనా కేసులు కోట్లలోకి చేరి, అధికారికంగా చెప్పకపోయినా వేలాది మరణాలకు కారణమవుతున్న వేరియంట్లలో ఇదే ప్రధానమైనది. ఈ వేరియంట్ ఉన్న మూడుకేసులు ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల్లో నమోదైనాయి. చైనాలో కొవిడ్ కేసుల పెరుగుదల మూడునెలలుగా ఉన్నప్పటికీ, ఇటీవల అది ‘జీరోకొవిడ్’ విధానాన్ని వదులుకున్న తరువాత అవి తీవ్రస్థాయికి చేరిన విషయం తెలిసిందే. ప్రజలమీద కోపంతోనో, ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యానో డిసెంబరు 7న ఈ నిర్ణయం తీసుకుంటున్నప్పుడు, మరో సరళతరమైన మార్గాంతరం అంటూ ప్రవేశపెట్టి ఉంటే, ఇంత విధ్వంసం జరిగివుండేది కాదు. మూడేళ్ళక్రితం వూహాన్ లో వైరస్ బయటపడినప్పుడు చైనా ఎంతటి విషాదాన్ని ఎదుర్కొన్నదో ఇప్పుడు అంతకంటే ఎక్కువ చవిచూస్తున్నది. అంతా అదుపులోనే ఉన్నదన్న మాటనే చైనా పాలకులు ఇప్పుడూ చెబుతున్నప్పటికీ, ఆస్పత్రులు, స్మశానవాటికలు కిక్కిరిసిపోతున్న, ఆప్తులు రోదిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతున్నాయి. జీరోకొవిడ్ విధానం ఎత్తివేసిన తరువాత ఒకే ఒక్క మరణం నమోదైందని చైనా అంటున్నది. కానీ, కొవిడ్ వైరస్ ప్రత్యక్షంగా ఊపిరితిత్తులను దెబ్బతీస్తేనే దానిని కరోనా మరణం కింద పరిగణించాలనీ, కానీ వైరస్ దెబ్బ మరేవిధంగా ఉన్నా దానిని అలా లెక్కించకూడదని చైనా నిర్ణయించుకున్న కారణంగానే లెక్కలు తారుమారవుతున్నాయి.

ఈ ఉపద్రవ కాలంలో చైనాలో ఎన్నిలక్షలమంది కన్నుమూస్తారన్న లెక్కలను అటుంచితే, మిగతా ప్రపంచం సమీపకాలంలోనే ఆ ప్రభావాన్ని చవిచూడబోతున్నదనీ, కనీసం పదిశాతం ప్రపంచ జనాభాకు కరోనా సోకే అవకాశాలున్నాయని లెక్కలు చెబుతున్నాయి. ఆయా దేశాలు విపత్తును ఎదుర్కోవడంతో పాటు, చైనా ఎగుమతులు, సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాన్ని కూడా చవిచూడక తప్పదు. రెండేళ్ళకాలంలో కాస్తంత తేరుకున్న ప్రపంచం పారిశ్రామికంగా, ఆర్థికంగా ఎంతమేరకు నష్టపోబోతున్నదో ఇప్పుడే చెప్పలేం.

చైనాలో కేసులు హెచ్చినంతమాత్రాన, మనం భయపడనక్కరలేదని వాక్సిన్ తయారీదారు అదర్ పూనావాలాతో పాటు చాలామంది నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే దేశంలో విస్తృతస్థాయిలో వాక్సిన్ వేయడం, రెండుడోసులతో పాటు బూస్టర్ డోసు పొందినవారు కూడా ఉండటం, వివిధ చిన్నాచితకా వేరియంట్లు ఇప్పటికే దేశంలో ఉన్నందున అన్నీ కలగలసి సామూహిక రోగనిరోధక శక్తి వృద్ధిచెందినందున మనం ఏ మాత్రం భయపడనక్కరలేదని వారంటారు. చైనాలో ఎక్కువమంది వాక్సిన్ తీసుకోకపోవడం, అక్కడ అభివృద్ధిచేసిన వాక్సిన్ సమర్థత తక్కువగా ఉండటం కూడా ఈ ఉధృతికి కారణమంటున్నారు. కొవిడ్ కథ ముగియలేదని తేలిపోయిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజారక్షణ చర్యలను ఎంత త్వరగా అమలుచేస్తే అంతమంచిది. ఎన్నికలతో సహా తమ అవసరాలన్నీ తీరిపోయిన తరువాత, ఇప్పుడు అకస్మాత్తుగా కరోనా భయాన్ని తెరమీదకు తెచ్చి, రాహుల్ గాంధీ జోడోయాత్ర మాత్రమే ప్రమాదకరమైనదిగా చిత్రీకరించే రాజకీయ విన్యాసాలకు స్వస్తిచెప్పి, పరిస్థితి చేజారిపోకుండా ప్రజలను కాపాడటం అవసరం.

Updated Date - 2022-12-22T02:46:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising