‘ఆమ్ఆద్మీ’ జయపతాక
ABN, First Publish Date - 2022-12-08T03:37:13+05:30
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఎగ్జిట్ పోల్స్ అంచనాల స్థాయిలో లేకున్నా, ఘనమైనదే. పదిహేనేళ్ళపాటు దేశరాజధాని నగరపాలికలపై...
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ విజయం ఎగ్జిట్ పోల్స్ అంచనాల స్థాయిలో లేకున్నా, ఘనమైనదే. పదిహేనేళ్ళపాటు దేశరాజధాని నగరపాలికలపై కాషాయజెండా ఎగురవేసిన బీజేపీ, తనకంటే ముప్పైస్థానాల ఆధిక్యం సాధించిన కేజ్రీవాల్ పార్టీకి మేయర్ పీఠాన్ని అప్పగించవలసి వస్తున్నది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను గుజరాత్, హిమాచల్ ఎన్నికలతో ఎందుకు ముడివేసారో తెలియదుకానీ, ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు వెలువడబోయే ముందురోజు కేజ్రీవాల్ కు మంచి ఉత్సాహమే దక్కింది. ఢిల్లీని పూర్తిగా స్వాధీనం చేసుకోవడంతో, హిమాచల్ లో ఖాతా తెరవకపోయినా, గుజరాత్ లో కాస్తంత కాలూనినా ఇక తమకు ఎదురులేదనీ, బీజేపీకి దేశవ్యాప్త ప్రత్యామ్నాయం తామేనని ఆప్ నేతలు చెప్పుకోవచ్చు. విస్తృతిలోనూ, ఓటర్ల లెక్కనా చూసినా హిమాచల్ కంటే ఢిల్లీ మునిసిపాలిటీ పెద్దదే కనుక పంజాబ్ తరువాత మరో రాష్ట్రాన్ని జయించినంతగా వారు సంబరపడవచ్చు. ఆప్ కేవలం కాంగ్రెస్ ను మాత్రమే ఓడిస్తుందన్న బీజేపీ ధీమాను తొలిసారిగా దెబ్బతీసిన ఫలితాలు ఇవి.
‘పిక్చర్ అభీ బాకీ హై’ అని బీజేపీ నాయకులు కొందరు బాహాటంగానే అంటున్నందున పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించని మేయర్ ఎన్నిక జరిగేవరకూ ఆప్ అప్రమత్తంగా ఉండకతప్పదు. తమ కౌన్సిలర్లను ఎత్తుకుపోవడానికి బీజేపీ కుట్రలు చేస్తున్నదని సిసోడియా అప్పుడే ఆరోపణలు కూడా మొదలెట్టేశారు. 250 వార్డులున్న ఢిల్లీలో మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలంటే 126 మంది కౌన్సిలర్లు అనుకూలంగా ఓటువేయాలి. ఆప్ కు ఈ సంఖ్య తగినంత ఉన్నప్పటికీ, ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ కు 12మంది కౌన్సిలర్లను నామినేట్ చేసే అధికారం ఉన్నందున, వారంతా బీజేపీ అనుకూలురే అనుకుంటే, ఆప్ కు గట్టిపోటీ తప్పదు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన తొమ్మిదిమందితో పాటు మిగిలిన మరో ముగ్గురు కూడా క్రాస్ ఓటింగ్ చేస్తే, ఆప్ నుంచి కొందరు చేయికలిపితే మేయర్ పీఠం చేజారిపోవచ్చు. ఈ అంచనాలను అటుంచితే, మూడుసార్లు బీజేపీకి మున్సిపాలిటీని అప్పగించినా పరిస్థితులు బాగుపడలేదని ప్రజలే అనుకున్నారో, మోదీ హవా దిగువవరకూ విస్తరించలేదో తెలియదుగానీ, ఈ ఎన్నికల్లో విజయానికి ఆర్నెల్లుగా ఆప్ తదేక లక్ష్యంతో కృషి చేస్తూవచ్చింది. బీజేపీ ఏలుబడిలో ఉన్న కార్పొరేషన్లలో పేరుకుపోయిన చెత్తమీద, అవినీతిమీద, గుంతలుపడిన రోడ్లమీద రాజకీయ యుద్ధాలు చేయడంతో పాటు తాము అధికారంలోకి వస్తే వ్యర్థాల నిర్వహణకు శాస్త్రీయ పరిష్కారం దక్కుతుందనీ, రోడ్లు చక్కగా ఉంటాయని హామీ ఇచ్చింది. కేజ్రీవాల్ పాలనలో మెరుగుపడిన విద్య, వైద్య సదుపాయాలు, విద్యుత్ సబ్సిడీలు, ఉచిత బస్సు ప్రయాణాలు చూసిన ఢిల్లీ వాసులకు ఆయన హామీలమీద నమ్మకం కలిగివుంటుంది.
సమస్త అధికారాలూ కేంద్రం చేతిలో ఉన్నందున, దాని సహాయనిరాకరణను ఎదుర్కొంటూ ఢిల్లీని బాగుచేయాలంటే కేజ్రీవాల్ మరిన్ని యుద్ధాలు చేయవలసిరావచ్చు. ప్రజలకు కృతజ్ఞతలు చెబుతూ, మోదీ ఆశీస్సులు, కేంద్రం చేయూత అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించింది ఇందుకే కావచ్చు. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆప్ ను అక్రమాల పుట్టగా ముద్రవేసేందుకు పలు కుంభకోణాల్లో దాని నాయకులను ఇరికించినా ప్రజలపై దాని ప్రభావం పెద్దగా ఉన్నట్టు లేదు. కానీ, సీఎస్ డీఎస్ ఇటీవల నిర్వహించిన సర్వేలో మాత్రం ప్రజలు గతస్థాయిలో మాదిరి ఆప్ ను అవినీతిరహిత పార్టీగా భావించడం లేదని తేలింది. బీజేపీతో పోల్చితే ఆప్ కాస్తంత నయం అని ఓటర్లు అనుకున్నందువల్లనే, ఎగ్జిట్ పోల్స్ ఊహించినంతగా బీజేపీ తుడిచిపెట్టుకుపోలేదు, ఆప్ ఉధృతంగానూ రాలేదు. ఢిల్లీలో కేజ్రీవాల్ స్థాయి నాయకుడంటూ లేకపోవడం కూడా బీజేపీకి పెద్ద లోటు. ఆ లోటును భర్తీచేసుకోవడానికే కాబోలు, ఢిల్లీ ప్రజలు తమను ఆశీర్వదించారనీ, మేయర్ స్థానంతో దీవించబోతున్నారని పార్టీ నాయకులు బహిరంగంగానే చెబుతున్నారు. గతంలో మాదిరిగా బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ వంటి మిగతా రాజకీయపక్షాలకు ఒక్కవార్డు కూడా దక్కకుండా, ముగ్గురు స్వతంత్రులు పోను మిగతావి మూడు రాజకీయపార్టీలు పంచుకోవడం ఈ ఎన్నికలు ఎంత పోటాపోటీగా జరిగాయో తెలియచెబుతున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలాదీక్షిత్ ఉండగా బీజేపీ ఉధృతికి అడ్డుకట్టవేసేందుకు మున్సిపల్ కార్పొరేషన్ ను మూడుముక్కలు చేసినా కాంగ్రెస్ విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు ఆ మూడింటినీ ఒక్కటి చేసి, ఆ పేరిట ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలను రెండు రాష్ట్రాలతో కలిపినా బీజేపీ లబ్ధిపొందలేకపోయింది. పదిహేనేళ్ళపాటు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ నూ, పదిహేనేళ్ళు నగరపాలికలను ఏలిన బీజేపీని దెబ్బకొట్టిన తరువాత, ఇక ఎన్నికలు ఏవైనా సరే, జాతీయ అధికారపక్షానికి ప్రత్యామ్నాయం నేనేనని ఆప్ మరింత గట్టిగా చెప్పుకోవచ్చు.
Updated Date - 2022-12-08T03:37:21+05:30 IST