యుద్ధ క్రీడలు!
ABN, First Publish Date - 2022-12-30T02:42:12+05:30
రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతకాలపు మిత్రుడు, అక్కడి చట్టసభ సభ్యుడైన పావెల్ అంతోవ్ ఒడిశాలోని ఒక హోటల్ పైనుంచి పడి కన్నుమూశారు...
రష్యాఅధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గతకాలపు మిత్రుడు, అక్కడి చట్టసభ సభ్యుడైన పావెల్ అంతోవ్ ఒడిశాలోని ఒక హోటల్ పైనుంచి పడి కన్నుమూశారు. మూడంతస్థుల ఎత్తునుంచి పడిపోవడంతో అంతర్గతగాయాలతో పావెల్ మరణించారని పోస్టుమార్టం నివేదిక తేల్చింది. ఈ ఘటనకు రెండురోజులముందు ఆయనతోపాటు వచ్చిన వ్లాదిమిర్ బెడెనోవ్ అనే మరో రష్యన్ తనగదిలో అపస్మారకస్థితిలో పడివుండి, ఆస్పత్రిలో చేర్చేసరికే గుండెపోటుతో మరణించినట్టుగా నిర్థారణ అయింది. ఒకేహోటల్‌లో బసచేసిన ఈ ఇద్దరు రష్యన్ల మరణాలపై ఒడిశా ప్రభుత్వం సీఐడి విచారణకు ఆదేశించిన విషయాన్ని అటుంచితే, ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకించిన రష్యా కులీనులు కొందరు అక్కడ అనుమానాస్పదంగా మరణిస్తున్న నేపథ్యంలో, పావెల్ కూడా యుద్ధవ్యతిరేకే కావడంతో, ఈ రెండు మరణాలు అంతర్జాతీయ మీడియాలోనూ చర్చనీయాంశాలైనాయి.
‘మీరు రష్యాలో బడాపారిశ్రామికవేత్తలో, చట్టసభసభ్యులో, సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తిమంతులో అయివుండి కూడా ఉక్రెయిన్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న పక్షంలో, బహుళ అంతస్థుల భవనాలకూ, వాటి కిటికీలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా బాల్కనీల్లో నిలబడి వెచ్చటి టీ తాగాలని ఆశపడకండి’ అంటూ ఈమధ్యన పాశ్యాత్యమీడియాలో కథనాలు వచ్చాయి. ఉక్రెయిన్ యుద్ధం ఆరంభమైనప్పటినుంచి, ఇప్పటివరకూ కనీసం ఓ ఇరవైమంది రష్యన్ కులీనులు ఎత్తయిన భవనాలనుంచి పడిపోవడంవల్లనో, గుండెపోటుతోనో మరణించిన నేపథ్యంలో, ఇప్పుడు పావెల్ మరణంమీద కూడా అనుమానాలు రేగడం సహజం. రెండురోజుల ముందే తన సన్నిహితమిత్రుడి మరణంతో బాధతట్టుకోలేక అతిగా మద్యం సేవించిన పావెల్ భవనంపైనుంచి తూలిపడిపోయివుండవచ్చుననీ, లేదా ఆత్మహత్యచేసుకొని ఉండవచ్చునని ఓ వాదన. నేలమీద రక్తపుమడుగులో కనిపించడమే తప్ప ఆయన పడినప్పుడు ఏ శబ్దమూ వినబడలేదట. పోస్టుమార్టం నివేదిక ఏమి నిర్థారించినప్పటికీ, ఈ విదేశీ టూరిస్టులవి అసహజమరణాలు కనుక, వారి శరీర అంతర్భాగాల శాంపిళ్ళను పద్ధతిప్రకారం భద్రపరిస్తే బాగుండేది. అటువంటిది చేయకపోగా, పోస్టుమార్టం పూర్తికాగానే ఇరువురినీ ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు దహనం చేయడం కూడా విమర్శలకు తావిస్తున్నది. భౌతికదేహాలను రష్యాపంపకుండా, క్రైస్తవులైనందున ఖననం చేయకుండా, హడావుడిగా దహనం ఎందుకు చేశారని కాంగ్రెస్ నేత మనీశ్ తివారీ వంటివారు ప్రశ్నిస్తున్నారు.
రష్యన్ ధనవంతుల్లో ఒకడిగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కిన పావెల్, పుతిన్‌ను ఆదిలో యుద్ధోన్మాదిగా, తీవ్రవాదిగా విమర్శిస్తూ వచ్చి, ఆ తరువాత వెనక్కుతగ్గి, వివరణలు సవరణలు ఇచ్చుకున్నారు కూడా. పావెల్ మరణకారణాలను, కుట్రకోణాలను అటుంచితే, ఇటువంటి అసహజమరణాలు అంతర్జాతీయంగా భారత ప్రతిష్టకు భంగం కలిగిస్తాయి. అంతేకాదు, తమ ప్రత్యర్థులను మట్టుబెట్టేందుకు ఇతరదేశాలు మనదేశాన్ని వాడుకొనే ప్రయత్నాలు ఏమాత్రం సహించకూడనివి. దశాబ్దం క్రితం న్యూఢిల్లీలో ఇజ్రాయెలీ దౌత్యవేత్త మీద జరిగిన ఒక హత్యాయత్నం వెనుక ఇరాన్ ఉన్నదని వార్తలు వచ్చాయి. భౌగోళిక రాజకీయాల్లో మనదేశం కీలకపాత్ర పోషిస్తున్నకొద్దీ విదేశీశక్తుల కుట్రలు హెచ్చే ప్రమాదమూ ఉంది. అందువల్ల, కనీసంగా కొన్ని దేశాలనుంచి వచ్చే ఇటువంటివారిపై మన నిఘా వ్యవస్థలు ప్రత్యేక దృష్టిపెట్టడం అవసరం.
యుద్ధాన్ని సత్వరమే ముగించాలని ఉందంటూనే ఉక్రెయిన్ నగరాలమీద పుతిన్ రోజుకో వందమిసైళ్ళు ప్రయోగిస్తున్నారు. చర్చలకు సిద్ధమంటూనే మా ఎజెండాకు ఒప్పుకుంటేనే అని నిబంధనలు పెడుతున్నారు. మరోపక్క ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా శాంతి గురించి మాట్లాడుతూనే అమెరికా వెళ్ళి ఆయుధాలు తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఆయన భారతప్రధాని నరేంద్రమోదీకి ఫోన్ చేసి యుద్ధాన్ని ఆపండి ప్లీజ్ అంటూనే ఓ పది శాంతిసూత్రాల చిట్టా ముందుపెట్టారు. నవంబరులో బాలిలో జరిగిన జీ20 సదస్సుకు సమర్పించిన ఈ ప్రణాళికను ఇప్పుడు మళ్ళీ మోదీ చేతికి ఇచ్చారు. ఏడాదిపాటు అధ్యక్షహోదాలో ఉండబోతున్న భారతదేశం దానిని ఆచరణలోకి తీసుకురావాలన్నది జెలెన్‌స్కీ కోరిక. ఆ ప్రతిపాదనలు ఉక్రెయిన్ పక్షాన ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదుగానీ, రష్యాను కాస్తంతైనా వంచాలంటే, ఉక్రెయిన్‌ను తమవైపు తిప్పుకోవాలనుకుంటున్న నాటో, అమెరికా వైఖరుల్లో మార్పురావాలి. రష్యాకు నిర్దిష్టమైన హామీలు దక్కాలి. రష్యాతో సాన్నిహిత్యం ఉన్న భారతదేశం వచ్చే ఏడాది సెప్టెంబరులో జరగబోయే జీ20 సదస్సునాటికి ప్రత్యర్థులను ఒకతాటిపైకి తెచ్చి ఈ పీటముడిని విప్పగలిగితే, యావత్ ప్రపంచం ఒక పెను సంక్షోభం నుంచి బయటపడుతుంది.
Updated Date - 2022-12-30T02:42:16+05:30 IST