ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎవరు ప్రమాదకారులు?

ABN, First Publish Date - 2022-11-11T01:10:27+05:30

గన్ను పట్టుకున్న నక్సలైట్లు, పెన్ను పట్టుకున్న ‘అర్బన్ నక్సలైట్లు’ దేశానికి ప్రమాదకారులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలే మరోమారు ఉద్ఘాటించిన నేపథ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గన్ను పట్టుకున్న నక్సలైట్లు, పెన్ను పట్టుకున్న ‘అర్బన్ నక్సలైట్లు’ దేశానికి ప్రమాదకారులని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవలే మరోమారు ఉద్ఘాటించిన నేపథ్యంలో, భీమాకోరేగావ్ కేసులో నిందితుడు, మానవహక్కుల కార్యకర్త గౌతమ్ నవ్లఖా కేసు విచారణ సందర్భంలో దేశంలో వేళ్ళూనుకున్న అవినీతిపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సందర్భోచితమైనవి. ఈ తరహా నిందితులకంటే అవినీతిపరులతోనే దేశానికి తీవ్ర ప్రమాదమన్న జస్టిస్ కె.ఎం. జోసెఫ్ వ్యాఖ్య ప్రభుత్వానికి చెంపపెట్టు.

ఏడుపదులు దాటిన వయసులో, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తనను జైలులో కాక, గృహనిర్బంధంలో ఉంచమంటూ నవ్లఖా దాఖలు చేసుకున్న పిటిషన్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్ఐఎ తరఫు న్యాయవాది ఎ.వి. రాజు చేసిన ఆరోపణలు సుప్రీంకోర్టుకు ఆశ్చర్యాన్నీ, ఆగ్రహాన్నీ కలిగించాయని తెలుస్తూనే ఉంది. నవ్లఖాకు ఐఎస్ఐతో సంబంధం ఉన్నదనీ, ఆయన దేశాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారనీ రాజు వాదిస్తున్న సందర్భంలో, నిజంగా దేశాన్ని నాశనం చేస్తున్నవారెవ్వరో తెలుసుకోవాలని ఉందా అంటూ న్యాయస్థానం ఈ ఘాటైన వ్యాఖ్యలతో వారెవ్వరో గుర్తుచేసింది. అవినీతిపరుల విషయంలో ఏ చర్యలూ లేవనీ, ప్రభుత్వం వారిపట్ల పక్షపాతంతో వ్యవహరిస్తున్నదని కూడా న్యాయమూర్తులు స్పష్టంచేశారు.

అవినీతిమీద తమ ప్రభుత్వం రాజీలేని పోరాటం చేస్తున్నదని ఈ మధ్యనే ప్రధాని మోదీ సరిహద్దుల్లో సైనికులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చెప్పారు. సరిహద్దుల్లోపలివారికి మాత్రం అటువంటి పోరు జరుగుతున్నట్టు అనిపించడం లేదు. నవ్లఖా కేసు సందర్భంలో న్యాయమూర్తులు ప్రస్తావించినట్టుగా, ఎన్నికైన ప్రజాప్రతినిధులకే కోట్లు ఇస్తామంటూ బేరాలు పెడుతున్న దౌర్భాగ్యం తెలంగాణకు మాత్రమే పరిమితమైన దృశ్యం కాదు. గత ఎనిమిదేళ్ళకాలంలో చాలా రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలంగా జరిగిన అధికార మార్పిడి వెనుక ఎన్నిరూపాల్లో ఏ స్థాయిలో అవినీతి చోటుచేసుకుందో ప్రత్యేకంగా చెప్పుకోనక్కరలేదు. ప్రజాస్వామ్యాన్నీ, చట్టబద్ధతనూ, మానవహక్కులను, జీవననాణ్యతను, మనుగడను, భద్రతనూ దెబ్బతీస్తూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలన్నింటికీ పటిష్ఠమైన పునాది వేస్తున్న అవినీతి నిర్మూలన విషయంలో ప్రభుత్వానికి విస్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలంటూ ఇటీవల సుప్రీంకోర్టులో ఒక పిల్ దాఖలైంది. అవినీతి అత్యధికంగా ఉన్నదేశాల్లో మనం 85వ స్థానంలో ఉన్నందున, ఒక ఉన్నతస్థాయి కమిటీ వేసి, అవినీతి లేని తొలి 20దేశాలు ఎటువంటి విధానాలు పాటిస్తున్నాయో తెలుసుకోవాలని పిటిషనర్ అభ్యర్థించారు. సుప్రీంకోర్టు ఈ పిల్ కొట్టివేసిన విషయం అటుంచితే, గత కాంగ్రెస్ ప్రభుత్వాల అవినీతిమీద ఎంతో రాద్ధాంతం చేసి, ‘బహుత్ హువా భ్రష్టాచార్, అబ్ కీ బార్ మోదీ సర్కార్’ అంటూ నినదించి అధికారంలోకి వచ్చినవారు ఈ విషయంమీద శ్రద్ధపెట్టకపోవడం విచిత్రం. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎన్ని కుంభకోణాలు చోటుచేసుకుంటున్నా, కర్ణాటకలో థర్టీపర్సంట్ సీఎం అంటూ అక్కడి కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వంటివే ఆరోపించినా ఏ చర్యలూ తీసుకోకుండా, విపక్షపాలిత రాష్ట్రాలపై ఈడీనీ, సీబీఐని ప్రయోగించడం అవినీతిపై పోరాటం అనిపించుకోదు. నేను తినను, మరొకరిని తిననివ్వను అని తొలి ఎర్రకోట ప్రసంగంలోనే హామీ ఇచ్చిన మోదీ హయాంలోనే, అత్యంత రహస్యమైన ఎన్నికల బాండ్ల వ్యవస్థ పుట్టుకొచ్చింది. దాతలెవరో తెలియనివ్వని ఈ వ్యవస్థలో, ఏ ఏడాది చూసినా, విరాళాల్లో 80శాతానికి పైగా బీజేపీకే అందుతున్నాయి. రాఫెల్ కొత్త ఒప్పందంలోకి అనిల్ అంబానీ రావడం, అదానీ అతివేగంగా ఎదిగిపోవడం, ఆయనకు ఓ భారీ ప్రాజెక్టు కట్టబెట్టాలని శ్రీలంకకు స్వయంగా మోదీయే సూచించారని ఆరోపణలు రావడం వంటి ఘట్టాలను ఏ పేరుతో పిలవాలో పాలకులే చెప్పాలి.

గతంలో జి.ఎన్. సాయిబాబా బెయిల్ వాదనల సందర్భంలో ఆయన శారీరక వైకల్యం కాక, ప్రమాదకరమైన బుర్రను చూడాలని ప్రభుత్వం వాదిస్తే, న్యాయస్థానం ఆమోదించింది. పెన్నుపట్టుకున్నవారు వృద్ధులైనా, వికలాంగులైనా దేశానికి ప్రమాదకారులని వాదిస్తూ, ఏళ్ళతరబడి వారిని ప్రభుత్వం జైలుకు పరిమితం చేయగలుగుతున్న స్థితిలో, వారికంటే, అసలు ప్రమాదం అవినీతిపరులతోనే అని పాలకులకు గుర్తుచేసినందుకు న్యాయమూర్తులు అభినందనీయులు.

Updated Date - 2022-11-11T01:10:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising