ప్రశ్నార్థకంగా ఆయుర్వేద కళాశాల మనుగడ!

ABN , First Publish Date - 2022-11-07T11:45:10+05:30 IST

విజయవాడలోని డాక్టర్ నోటి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నిర్మించి వందేళ్లయినా నేటికీ సమస్యలు తొలగిపోలేదు. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదాన్ని

ప్రశ్నార్థకంగా ఆయుర్వేద కళాశాల మనుగడ!
ప్రభుత్వం శీతకన్ను

అధ్యాపకుల కొరతతో ఈ ఏడాది అడ్మిషన్లు రద్దు

ఆయుష్మాన్‌ భారత్‌కు నీళ్లొదిలిన రాష్ట్ర ఆయుష్‌ శాఖ

వందేళ్ల చరిత్ర కలిగిన కాలేజీని ఖాళీ చేయాలని జలవనరుల శాఖ నోటీసులు

ఆయుర్వేద కళాశాలపై ప్రభుత్వం శీతకన్ను

విజయవాడలోని డాక్టర్ నోటి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల నిర్మించి వందేళ్లయినా నేటికీ సమస్యలు తొలగిపోలేదు. ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయుర్వేదాన్ని అభివృద్ధి చేయాలని ప్రణాళికలు రచిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ కళాశాల పరిస్థితిని ఘోరంగా తయారుచేసింది.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : వందేళ్ల చరిత్ర కలిగిన ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. 11 డిపార్ట్‌మెంట్లలో 12 ప్రొఫెసర్‌ పోస్టులు, 9 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు, 2 పీజీ ప్రొఫెసర్‌ పోస్టులు, మరో ఆరు పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతోనే 2022-23 అడ్మిషన్లు నిలుపుదల చేస్తున్నట్లు కేంద్ర ఆయుష్‌ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నుంచి మరో 74 మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినా నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. ఈ కళాశాలలో ఏటా వందమంది విద్యార్థులు బీఏఎంఎస్‌, ఏఎంఎస్‌, ఎండీ, ఎంఎస్‌ కోర్సుల్లో జాయిన్‌ అవుతారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆయుర్వేద విద్యపై మక్కువ ఉన్న విద్యార్థులకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. రాష్ట్ర ఆయుష్‌ శాఖ ఖాళీలను భర్తీ చేయడానికి కూడా అడుగులేయడం లేదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ఆయుర్వేద విద్య, వైద్యాన్ని పూర్తిగా నాశనం చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకుందని, కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వ అలసత్వం ప్రదర్శిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు. అధ్యాపకుల్ని నియమించకపోతే వచ్చే ఏడాది కూడా అడ్మిషన్లు ఉండటం కష్టమని అసోసియేషన్‌ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాలేజీని ఖాళీ చేయండి

బందరురోడ్డులో విజయవాడ ఆయుర్వేద కళాశాల నెలకొల్పిన స్థలం జలవనరుల శాఖది. ఏటా రాష్ట్ర ఆయుష్‌ శాఖ నామమాత్రపు లీజు చెల్లిస్తుంది. కొంతకాలంగా ఇరిగేషన్‌ అధికారులు తమ స్థలాన్ని తమకు తిరిగిచ్చేయాలని నోటీసులు జారీ చేస్తున్నారు. గత ప్రభుత్వం సీఆర్డీయే పరిధిలో 5.46 ఎకరాలు కళాశాల నిర్మాణానికి కేటాయించింది. ప్రస్తుతం మంగళగిరిలోని ఎయిమ్స్‌ పక్కన ఆయుర్వేద కళాశాలకు 2.46 ఎకరాలు కేటాయించారు. కానీ, నేటికీ ముందడుగు పడలేదు. నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను కళాశాల నిర్మాణానికి కేటాయించింది. కాలేజీ నిర్మాణానికి ఇప్పటికే రూ.8 కోట్లు విడుదల చేసింది. కళాశాల నిర్మాణానికి నిర్దిష్టమైన స్థల కేటాయింపు లేకపోవడంతో ఆ నిధులు వృథాగానే ఉండిపోయాయి. ఈ ఏడాది ఆయుర్వేద అభివృద్ధికి రూ.24 కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. దీనిలో కేంద్ర వాటా కింద రూ.14 కోట్లు, రాష్ట్ర వాటా కింద రూ.10 కోట్లు కేటాయించాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులను కేటాయించడం లేదని తెలిసింది. దీంతో నూతన కాలేజీ నిర్మాణం అగమ్యగోచరంగా మారింది.

ఇన్‌చార్జే దిక్కు..

1956 యాక్టు ప్రకారం ఆంధ్ర బోర్డు ఫర్‌ ఆయుర్వేద ఏర్పడింది. దీని నియమావళిని అనుసరించి ఓ కమిటీ ఏర్పాటు చేయాలని, దానిలో 24 మంది సభ్యులుగా ఉండాలని పేర్కొన్నారు. కానీ, నేటికీ కమిటీ ఏర్పడలేదు. కేవలం ఒక రిజిస్టర్‌ను నియమించి మమ.. అనిపిస్తున్నారు. ఆ రిజిస్టర్‌ పోస్టు కూడా నాన్‌ టీచింగ్‌ వ్యక్తిని నియమించాలని స్పష్టంగా ఉంది. కానీ, ప్రస్తుతం కళాశాలలో హెచ్‌వోడీగా ఉన్న వ్యక్తినే ఇన్‌చార్జిగా నియమించారు. లైసెన్సింగ్‌ డ్రగ్‌ అథారిటీ పోస్టులో కూడా ఆ వ్యక్తే కొనసాగుతున్నారు.

కొత్తవి ఇవ్వరు.. పాతవి రెన్యువల్‌ చేయరు..

ఆయుష్‌ డ్రగ్‌ లైసెన్స్‌ అథారిటీ తీసుకున్న నిర్ణయాల వల్ల ఆయుర్వేద మందులను తయారుచేసే కంపెనీలు మూతపడే స్థాయికి చేరుకున్నాయి. మందుల తయారీకి కొత్త లైసెన్సులు పెట్టుకుంటే ఏదో ఒక సాకు చూపి లైసెన్సులు జారీ చేయడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు తయారుచేస్తుండగా, వాటి లైసెన్సులు రెన్యువల్‌ చేయడంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆయుష్‌ డ్రగ్‌ లైసెన్స్‌ అథారిటీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీనివల్ల రాబోయే రోజుల్లో ఆయుర్వేద మందులు లభ్యం కావడంలో సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్‌ నేషనల్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సభ్యులు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-11-07T11:45:10+05:30 IST

Read more