Munugode by Election: కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో పరాభవం!
ABN, First Publish Date - 2022-11-07T04:15:37+05:30
కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఎదురుదెబ్బలే తగిలాయి. గతంలో టీఆర్‌ఎస్ కోరి తెచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలవగా, ప్రస్తుతం బీజేపీ
గతంలో టీఆర్‌ఎస్, ఇప్పుడు బీజేపీకి ఎదురుదెబ్బ
5 ఉప ఎన్నికల్లో మూడింట టీఆర్‌ఎస్ విజయం
సాగర్, హుజూర్‌నగర్, మునుగోడులో గెలుపు
దుబ్బాక, హుజూరాబాద్ సిటింగ్ స్థానాల్లో ఓటమి
హైదరాబాద్/నల్లగొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కోరి తెచ్చుకున్న ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలకు ఎదురుదెబ్బలే తగిలాయి. గతంలో టీఆర్‌ఎస్ కోరి తెచ్చిన ఉప ఎన్నికలో బీజేపీ గెలవగా, ప్రస్తుతం బీజేపీ కోరుకున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించింది. 2018లో రెండోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక హుజూర్‌నగర్, దుబ్బాక, నాగార్జునసాగర్, హుజూరాబాద్, మునుగోడు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఇందులో హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికలు కొంత ప్రత్యేకమైనవి. ఎందుకంటే వీటిని ఆయా పార్టీలు కోరి తెచ్చుకున్నాయి. టీఆర్‌ఎస్ సర్కారు ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కేసీఆర్ తీసుకున్న రాజకీయ నిర్ణయం వల్ల హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యమైంది. అందులో 23,855 ఓట్ల మెజారిటీతో ఈటల గెలిచారు. ఇక, మునుగోడు ఉప ఎన్నికను బీజేపీ కోరుకుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రె్‌సకు రాజీనామా చేసి, బీజేపీ తరఫున పోటీ చేశారు. కానీ, ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ గెలిచింది.
మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్ గెలుపు..
తెలంగాణలో టీఆర్‌ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరిగిన ఐదు ఉప ఎన్నికల్లో మూడు స్థానాల్లో అధికార పార్టీ గెలుపొందింది. ఇందులో మూడు సిట్టింగ్ స్థానాల్లో రెండింటిని కోల్పోగా.. ఒక్క చోటే గెలిచింది. మరోవైపు, కాంగ్రెస్ రెండు సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. వాటిని టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. 2018లో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా, నల్లగొండ ఎంపీగా గెలిచారు. ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంలో 2019లో ఉప ఎన్నిక జరిగింది. అందులో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత దుబ్బాక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. అక్కడ జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు గెలుపొందారు. 2021లో నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య చనిపోవడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికలో సిటింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడంతో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగి విజయం సాధించారు. దాంతో టీఆర్‌ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. తాజాగా మునుగోడులో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి రాజీనామాచేసి ఉప ఎన్నికలో బీజేపీ నుంచి బరిలోకి దిగారు. ఇక్కడ టీఆర్‌ఎస్ గెలిచింది.
గులాబీ ఖిల్లా.. నల్లగొండ జిల్లా
తొలుత వామపక్షాలకు ఆ తర్వాత కాంగ్రె్‌సకు కంచుకోటగా ఉన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా మూడు ఉప ఎన్నికలతో గులాబీ ఖిల్లాగా మారింది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 స్థానాల్లో హుజూర్‌నగర్, నకిరేకల్, మునుగోడు నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. హుజూర్‌నగర్, మునుగోడులో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ గెలిచింది. నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య టీఆర్‌ఎ్‌సలో చేరారు.
చక్రం తిప్పిన జగదీశ్ రెడ్డి..
2018 నుంచి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మూడు ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలుపొందారు. సీఎం కేసీఆర్‌కు అనుంగు శిష్యుడిగా, పార్టీ ఆవిర్భావం నుంచి ఆయన వెంటే ఉంటూ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మంత్రి జగదీశ్‌రెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిని, రాజగోపాల్‌రెడ్డిని ఉప ఎన్నికల్లో ఓడించడంలో కీలకంగా పనిచేశారు.
Updated Date - 2022-11-07T13:13:28+05:30 IST