Himachal polls: అప్పుల రాష్ట్రంలో అంతా కుబేర అభ్యర్థులే..
ABN, First Publish Date - 2022-11-11T20:17:40+05:30
హిమాచల్ ప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి కాపాడటమే ఆ పార్టీ ప్రభుత్వానికి ప్రధాన సవాలు..
హిమాచల్ ప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సిద్ధమవుతున్న హిమాచల్ ప్రదేశ్‌లో (Himachal pradesh polls) ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాన్ని అప్పుల బారి నుంచి కాపాడటమే ఆ పార్టీ ప్రభుత్వానికి ప్రధాన సవాలు కానుంది. హిమచల్ ప్రదేశ్ రూ.64,904 కోట్ల రుణాల ఊబిలో ఉండటమే అందుకు కారణం. అయితే. ఎన్నికల్లో ప్రధాన పార్టీల తరఫున పోటీ చేస్తున్న వారిలో మెజారిటీ శాతం కుబేరులే ఉండటం విశేషం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (Association of Democratic Reforms) నివేదిక ప్రకారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థుల్లో 90 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తున్న వారిలో 82 శాతం మంది కోటీశ్వరులు. మొత్తంగా 61 మంది కాంగ్రెస్ అభ్యర్థులు, 56 మంది బీజేపీ అభ్యర్థులు కోట్లకు పడగలెత్తారు.
బీజేపీ నుంచి సిమ్లాలోని ఛోపల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న బల్వీర్ సింగ్ వర్మ రూ.128 కోట్ల ఆస్తులతో కుబేరుల స్థానంలో అగ్రస్థానంలో ఉన్నారు. సిమ్లా రూరల్ సీటు నుంచి పోటీచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ తనయుడు విక్రమాదిత్య సింగ్ రూ.101 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు. నగ్రోటా సీటుకు పోటీ చేస్తున్న కాంగ్రెస్ దివంగత నేత జి.ఎస్.బాలి తనయుడు ఆర్ఎస్.బాలి రూ.96.33 కోట్లతో మూడు స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలోని 68 అసెంబ్లీ స్థానాలకు గాను 412 అభ్యర్థులు పోటీ చేస్తుండగా, వీరిలో 55 శాతం మంది...అంటే 226 మంది అభ్యర్థులు కోటీశ్వరులే. ఆమ్ అద్మీ పార్టీ 67 మందిని బరిలో దింపగా, వారిలో కోటీశ్వరులు 35 మంది ఉన్నారు. బీఎస్పీ 53 స్థానాల్లో పోటీ చేస్తుండగా 13 మంది కోటీశ్వరులున్నారు. సీపీఎం నుంచి నలుగురు కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో సైతం 45 మంది కోటీశ్వరులు ఉన్నారు.
Updated Date - 2022-11-11T20:23:07+05:30 IST