ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Anesthesia: మత్తు వైద్యం గురించి..

ABN, First Publish Date - 2022-11-01T17:24:06+05:30

మత్తు మందు లేనిదే ఎలాంటి శస్త్ర చికిత్సా సాధ్యపడదు. మత్తు మందు ఆవిష్కరించి, 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనీస్థీషియా పట్ల, దాంతో ఒరిగే

మత్తు వైద్యంపై..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మత్తు మందు లేనిదే ఎలాంటి శస్త్ర చికిత్సా సాధ్యపడదు. మత్తు మందు ఆవిష్కరించి, 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అనీస్థీషియా పట్ల, దాంతో ఒరిగే ఉపయోగాల పట్ల అవగాహన ఏర్పరుచుకునే ప్రయత్నం చేద్దాం!

అక్టోబరు 16, 1946లో అమెరికా, బోస్టన్‌లోని మసాచుసెట్స్‌ జనరల్‌ ఆస్పత్రిలో ప్రపంచ వైద్య రంగంలోనే గొప్ప ఆవిష్కరణ చోటుచేసుకుంది. డాక్టర్‌ డబ్ల్యు.టి.జి మోర్టాన్‌, ఈథర్‌ అనే మత్తు మందుతో గిల్బర్ట్‌ అబోట్‌ అనే రోగికి, నొప్పి లేకుండా శస్త్రచికిత్స జరిపారు. దాంతో వైద్య రంగంలో పరిశోధనలు, ఆవిష్కరణల ఆవిశ్యకత ప్రపంచానికి తెలిసొచ్చింది. అప్పటి నుంచి నొప్పి లేకుండా శస్త్రచికిత్సలు చేసే విధానం ఊపందుకుంది. అంతకు పూర్వం రోగికి మద్యం తాగించి, కదలకుండా పట్టుకుని సర్జరీలు చేసేవారు. రోగి విపరీతమైన బాధతో అరవడం, కొన్ని సందర్భాల్లో తట్టుకోలేని నొప్పితో షాక్‌లోకి వెళ్లి మరణించడం జరిగేవి. నేడు ప్రపంచవ్యాప్తంగా నొప్పి లేకుండా, సురక్షితంగా సర్జరీలు జరపడానికి కారణం... ‘అనస్థీషియా’! మత్తు వైద్యం ఒక స్పెషాలిటీగా అవతరించింది. డెంటల్‌ ఆపరేషన్ల నుంచి, న్యూరల్‌ సర్జరీల వరకూ, గుండె, కాలేయం సర్జరీలు, అవయవ మార్పిడి మొదలైన అన్ని రకాల సర్జరీల్లో మత్తుమందు కీలకంగా మారింది. సర్జరీ సమయంలో వైద్యులు రోగి పక్కనే ఉంటూ మత్తు ఇవ్వడంతో పాటు, శ్వాస, గుండె పనితీరులను తమ ఆధీనంలో ఉంచుకుంటూ, రక్తస్రావాన్ని బట్టి రక్తాన్ని ఎక్కించడం లాంటి అనేక రకాల ప్రొసిజర్స్‌ చేస్తూ ఉంటారు.

ఉస్మానియా పాత్ర

ఈథర్‌ తర్వాత, క్లోరోఫామ్‌ అంతే ప్రాచుర్యం పొందింది. నిజాం మీర్‌ మహబూబ్‌ అలీ ఖాన్‌ ఆదేశం మేరకు 1888 నుంచి 1891 మధ్యలో డాక్టర్‌ ఎడ్వర్డ్‌ లారీ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం క్లోరోఫామ్‌పై పరిశోధనలు చేసింది. ఈ బృందంలో డాక్టర్‌ రూపాబాయ్‌ ఫెర్దోన్జీ కూడా ఒకరు. ఈవిడ ప్రపంచంలోని మొట్టమొదటి మహిళా అనస్థీషియా డాక్టరు. క్లోరోఫామ్‌ అనస్థీషియాతో ఆపరేషన్‌ చేయించుకున్న ప్రముఖుల్లో మహాత్మా గాంధీ కూడా ఒకరు. 1925లో పూణేలో అపెండిక్స్‌ ఆపరేషన్‌ క్లోరోఫోమ్‌ సహాయంతో చేపట్టడం జరిగింది.

మన దేశంలో అనస్థీషియా, ఈథర్‌, క్లోరోఫాం తర్వాత, ఎన్నో కొత్త ఔషధాలు వినియోగంలోకి వచ్చాయి. ఆధునిక శస్త్రచికిత్సలన్నీ సురక్షితంగా జరుగుతున్నాయి. మన దేశంలో మొట్టమొదటి ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌, 1962లో, ముంబయిలో, ఒక అనస్థీషియా డాక్టర్‌ ఏర్పాటు చేశారు.

అనస్థీషియా బోధన

స్వాతంత్ర్యానికి పూర్వమే మన దేశంలో రెండు మెడికల్‌ కాలేజీల్లో అనస్థీషియా బోధన జరిగింది. నేడు ప్రతి వైద్య కళాశాలలో అనస్థీషియా పిజి బోధన జరుగుతోంది. అత్యవసర సమయాల్లో రోగి పరిస్థితి క్లిష్టంగా ఉన్నప్పుడు, అనస్థీషియా డాక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. నేడు మత్తు వైద్యుల పాత్ర కేవలం శస్త్రచికిత్సలకే పరిమితం కాలేదు. ప్రసవ సమయంలో నొప్పిని తగ్గించడానికి, మత్తు వైద్యులు గర్భిణికి లేబర్‌ అనస్థీషియా ఇస్తున్నారు. శస్త్రచికిత్స తదనంతర నొప్పిని తగ్గించడానికి ఎపిడ్యురల్‌ అనాల్జేసియాను కూడా మత్తు వైద్యులే ఇస్తూ ఉంటారు. ఇంటెన్సివ్‌ కేర్‌ పర్యవేక్షణ వీరి చేతుల్లోనే ఉంటుంది. కొవిడ్‌ సమయంలో విషమంగా ఉన్న ఎంతోమంది రోగులకు, వెంటిలేటర్‌తో కృత్రిమ శ్వాసను అందించి, వారి ప్రాణాలను కాపాడిన ఘనత వీరికే దక్కుతుంది. దీర్ఘకాలిక వ్యాధులకు పెయిన్‌ కిల్లర్స్‌ను నిర్వహించేది కూడా ఈ వైద్యులే!

హఠాత్తుగా గుండె ఆగినప్పుడు (కార్డియాక్‌ అరెస్ట్‌), కార్డియాక్‌ మసాజ్‌ చేసి, రోగికి ప్రాణదానం చేసే ప్రక్రియలో మత్తు వైద్యుల పాత్ర ముఖ్యమైనది. దీని కోసం భారతీయ మత్తు వైద్య సంఘం ఆధ్వర్యంలో ఇండియన్‌ రిసస్కిటేషన్‌ కౌన్సెల్‌ను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్లు నిర్విరామంగా దీని కోసం శ్రమిస్తున్నారు.

75 ఏళ్లు పూర్తి చేసుకుని...

మత్తు మందు నేడు అప్పుడే పుట్టిన పసికందు మొదలు పండు ముదుసలి రోగుల వరకూ అందరికీ సురక్షితమైనది. దీనికోసం మత్తు వైద్యులు నిరంతంరం వారి పరిజ్ఞానాన్ని, జర్నల్స్‌ ద్వారా, సదస్సులకు హాజరవడం ద్వారా అప్‌డేట్‌ చేసుకుంటూ ఉంటారు. భారతీయ మత్తు వైద్యం స్థాపించి 75 సంవత్సరాలు(1947-2022) అయిన సందర్భంగా, ప్రజల్లో మత్తు వైద్యం గురించి అవగాహన కల్పించడం, వారి అపోహలను తొలగించడం కోసం, అనస్థీషియా జ్యోతిని దేశవ్యాప్తంగా ప్రదర్శిస్తూ, వివిధ కార్యక్రమాలను చేపడుతున్నారు.

-డాక్టర్‌ రామకృష్టారెడ్డి,

అనస్థీషియా ప్రొఫెసర్‌,

భారతీయ మత్తు వైద్య సంఘం తెలంగాణా రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2022-11-01T17:24:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising