కండరాల పటుత్వం కోసం...
ABN, First Publish Date - 2022-05-11T18:51:09+05:30
యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఏ ఆసనంతో ఏ కండరాలకు వ్యాయామం అందుతుందో, ఎలాంటి ఫలం దక్కుతుందో తెలుసుకుందాం!
ఆంధ్రజ్యోతి(11-05-2022)
యోగాసనాలతో అవయవ పటుత్వం పెరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందే! అయితే ఏ ఆసనంతో ఏ కండరాలకు వ్యాయామం అందుతుందో, ఎలాంటి ఫలం దక్కుతుందో తెలుసుకుందాం!
ప్రసరిత పాదోత్తనాసనం
రెండు కాళ్లూ, రెండు చేతులూ నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనంతో పలు ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే....వెన్ను సాగదీయబడుతుంది. తొడలు, పిక్కలు, పిరుదుల్లోని కండరాలు బలపడతాయి. మనసు నెమ్మదించి, ఒత్తిడి, ఆందోళన, గందరగోళం, తలనొప్పులు, భుజాల్లో నొప్పులు తగ్గుతాయి.ఈ ఆసనంతో నాడీ వ్యవస్థ స్వాంతన పొందుతుంది.మరింత క్లిష్టమైన యోగాసనాలను సాధన చేసేందుకు వీలుగా ఈ ఆసనం శరీరాన్ని సిద్ధం చేస్తుంది.
అధోముఖ కపోతనాసనం
ఒక కాలును మడిచి, మరో కాలును వెనకగా చాపి కూర్చుని, శరీరాన్ని ముందుకు నేల మీద ఆనించి ఉంచే ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే! వెనకకు వంగే ఆసనాలు వేయడానికి శరీరాన్ని సిద్ధం చేస్తుంది.తుంటి, తొడ ఎముకలు కలిసే కీలును బలపరుస్తుంది.నడిచేటప్పుడు, పద్మాసనం వేసే సమయంలో, పరిగెత్తే సమయంలో, నిలబడినప్పుడు శరీరం మరింత తేలికగా కదిలేలా ఈ ఆసనం తోడ్పడుతుంది.
విపరీతకారిణి
నేల మీద వెల్లకిలా పడుకుని, గోడ మీద కాళ్లు నిటారుగా చాపి ఉంచే ఈ ఆసనంతో ఒరిగే ప్రయోజనాలు ఇవి...ఈ ఆసనం వేసే సమయంలో నడుము అడుగున దుప్పటి ఉండలా చుట్టి ఉంచుకుంటే, కాళ్ల వాపులు, అలసిపోయే కీళ్లు, భారంగా మారే తుంటి సమస్యలు తగ్గుతాయి.ఈ ఆసనం వేయడం ద్వారా ఇలాంటి ఇబ్బందులకు కారణమయ్యే లింఫ్, ఇతర స్రావాలు ఆయా శరీర భాగాల నుంచి పొత్తికడుపులోకి చేరతాయి. ఫలితంగా కాళ్లు, పునరుత్పత్తి వ్యవస్థల్లోని ఇబ్బందులు తొలగుతాయి.