Gujarat Polls: ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి పోటీ చేసే స్థానం ఇదే
ABN, First Publish Date - 2022-11-13T17:41:21+05:30
గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ
న్యూఢిల్లీ : గుజరాత్ శాసన సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్ గధ్వీ (Isudan Gadhvi) పోటీ చేసే నియోజకవర్గంపై ఉత్కంఠకు తెరపడింది. ఆయన జామ్ఖంభలియా (Jamkhambhaliya) స్థానం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ప్రకటించారు.
కేజ్రీవాల్ ఆదివారం ఇచ్చిన ట్వీట్‌లో, గుజరాత్ శాసన సభ ఎన్నికలు (Gujarat Assembly elections)లో ఇసుదాన్ గధ్వీ జామ్ఖంభలియా నుంచి పోటీ చేస్తారని తెలిపారు. ఆయన అనేక సంవత్సరాల నుంచి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, వ్యాపారుల కోసం గళమెత్తుతున్నారన్నారు. శ్రీకృష్ణుడి పవిత్ర భూమి నుంచి నూతన, మంచి ముఖ్యమంత్రిని గుజరాత్ పొందగలదన్నారు.
గుజరాత్‌లో 182 శాసన సభ స్థానాలున్నాయి. ఆప్ ఇప్పటి వరకు 15 జాబితాల ద్వారా 176 మంది అభ్యర్థులను ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఇసుదాన్ గధ్వీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ ఎన్నికలు డిసెంబరు 1, 5 తేదీల్లో జరుగుతాయి. ఓట్ల లెక్కింపు డిసెంబరు 8న జరుగుతుంది.
Updated Date - 2022-11-13T17:41:27+05:30 IST