Shraddha Walkar Murder: బెయిల్ కోసం ఢిల్లీ కోర్టుకు అఫ్తాబ్
ABN, First Publish Date - 2022-12-16T16:19:32+05:30
శ్రద్ధ వాకర్ ను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా బెయిలు కోరుతూ..
న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ (Shraddha Walkar)ను అత్యంత పాశవికంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అఫ్తాబ్ పూనావాలా (Aftaba Poonawala) బెయిలు (Bail) కోరుతూ ఢిల్లీ సాకేత్ కోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించాడు. ఈ పిటిషన్‌పై శనివారం విచారణ జరుగనుంది. ఈనెల 23 వరకూ అఫ్తాబ్‌కు జ్యుడిషియల్ కస్టడీ విధించగా, ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో అతను ఉన్నాడు.
ఢిల్లీలో తనతో సహజీవనం సాగిస్తున్న 27 ఏళ్ల శ్రద్ధావాకర్‌ను అఫ్తాబ్ ఇటీవల అత్యంత పాశవికంగా హత్య చేశాడు. ఆమెను 35 ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో దాచి ఉంచి, రోజుకు కొన్ని ముక్కలు చొప్పున నగర శివార్లలోని అడవుల్లోకి విసిరేశాడు. సుమారు 6 నెలల తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా శ్రద్ధావాకర్ హత్య కేసు సంచలనమైంది. శ్రద్ధావాకర్ శరీర భాగాలను మూడు వారాల పాటు 350 లీటర్ల ఫ్రిజ్‌లో దాచి ఉంచాడని, ఆ తర్వాతే వాటిని గుట్టుచప్పుడు కాకుండా వివిధ ప్రాంతాల్లో విసిరేశాడని పోలీసులు అంటున్నారు. హత్యానేరం అఫ్తాబ్ అంగీకరించినట్టు కూడా వారు చెబుతున్నారు.
డీఎన్ఏ పరీక్షల్లో పురోగతి...
కాగా, ఈ కేసుకు సంబంధించి డీఎన్ఏ పరీక్షల్లో కీలక పురోగతి సాధించినట్టు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటవీ ప్రాంతంలో స్వాధీనం చేసుకున్న ఎముకల డీఎన్ఏ శాంపుల్స్, శ్రద్ధావాకర్ హత్య జరిగిన ప్రాంతం నుంచి సేకరించిన రక్తం నమూనాలు, ఆమె తండ్రి నుంచి సేకరించిన డీఎన్ఏ శాంపుల్స్‌తో సరిపోలాయని తెలిపారు. లోథి రోడ్డులోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) నుంచి ఈ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు. ఇంతవరకూ ఢిల్లీ పోలీసులు మెహ్రౌలి అడవుల నుంచి 13 ఎముకలను (Bone pieces) స్వాధీనం చేసుకున్నారు. అయితే గుర్తుతెలియని ప్రాంతంలో అఫ్తాబ్ విసిరేసినట్టుగా అనుమానిస్తున్న ఆమె ఫోన్ జాడ మాత్రం ఇంతవరకూ తెలియలేదు. ఈ కేసును వాదించేందుకు ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను అనుమతించాలంటూ ఢిల్లీ పోలీసులు చేసిన ప్రతిపాదనకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఆమోదం తెలిపారు.
Updated Date - 2022-12-16T16:24:55+05:30 IST